The Mantras Project |
హిందూ, బౌద్ధ, సిక్కు మరియు యోగా అభ్యాసకులతో సహా ఐరోపాలో 4 మిలియన్లకు పైగా ప్రజలు 'మంత్రాలు' అంటే పవిత్రమైన అక్షరాల ఉచ్చారణలు క్షేమం కోసం ప్రార్థన, ధ్యానం సమయాల్లో ఉపయోగిస్తారు.
ఆధునిక యూరోపియన్ భాషలలో ఈ పదం అంటే 'మంత్రం' అనే పదం విస్తృతంగా ఉపయోగం లో ఉన్నప్పటికీ, ఈ మంత్రాలు గురించి సమగ్రంగా చాలా అరుదుగా అధ్యయనం చేయబడ్డాయి అని భావిస్తున్నారు.
అందుకే, అసలు ఈ 'మంత్రాల' లోతు పాతులు తెలుసుకోడానికి 'మంత్రమ్స్ ప్రాజెక్ట్' అనే రీసెర్చ్ ప్రాజెక్టు గతనెల సెప్టెంబర్ 1వ తేదీన 'వియన్నా యూనివర్సిటీ' లో ప్రారంభించబడింది. దీని గురించి గత 6 సం. లుగా ప్రయత్నాలు జరగగా చివరకు 'యూరోపియన్ రీసెర్చ్ కౌన్సిల్ (ERC)' సినర్జీ గ్రాంట్ €9,651,263 నిధుల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభించబడింది.
దక్షిణాసియాలోని 3,000 సంవత్సరాలుగా మంత్రాలు ఉపయోగించ బడుతున్నాయి. అక్కడ లభించే గురువులు సహాయం తో వివిధ మత గ్రూపులు ద్వారా, యోగా ద్వారా మంత్రాలు ఎలా ప్రసారం చేయబడతున్నాయో ఇది పరిశీలిస్తుంది.
ఇండాలజీ, ఆంత్రోపాలజీ, సౌండ్ స్టడీస్, మీడియా స్టడీస్, ఆర్ట్ హిస్టరీ మరియు మతాల చరిత్రను కలిగి ఉన్న ఇంటర్ డిసిప్లినరీ విధానాన్ని ఉపయోగించి, ఈ ప్రాజెక్ట్ సమగ్రమైన సోనిక్, విజువల్ మరియు డిజిటల్ టెక్స్ట్యువల్ ఆర్కైవ్లను సృష్టిస్తుంది. ఈ ఆర్కైవ్‌లు మంత్రాల యొక్క ట్రాన్స్కల్చరల్ మరియు మల్టీసెన్సరీ డైమెన్షన్లను డాక్యుమెంట్ చేస్తాయి.
ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యులు :
1. ప్రొఫెసర్ బోరాయిన్ లోయీయస్, దక్షిణాసియా విషయాలపై ప్రొఫెసర్ గా వియన్నా యూనివర్సిటీ లో పనిచేస్తున్నాడు.
2. ప్రొఫెసర్ కరోల లోరీయా, గ్లోబల్ రిలీజియన్ ప్రొఫెసర్ గా ట్యూబినెన్ యూనివర్సిటీ లో పని చేస్తోంది.
3.ఫినెన్ గెరెట్టి, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియా మరియు మధ్య ప్రాచ్య అధ్యయనాలలో సీనియర్ రీసెర్చ్ ఫెలో గా చేస్తున్నాడు.
వీరు కాక మరి కొందరు విదేశీ రీసెర్చ్ ఫెలోస్ ఈ ప్రాజెక్టు లో పాలుపంచుకుంటున్నారు.
కానీ, మంత్రాలు అంటేనే సంస్కృత భాష, వివిధ ఉచ్ఛారణా పద్ధతులు ఉంటాయి. అసలు పాశ్చాత్య భాషలను పుట్టుక తో పలకడం అలవాటు ఉన్న వీళ్ళు సంస్కృత భాష లో ఉండే మంత్రాలను దోషం లేకుండా ఏ మేరకు పఠించగలరో చూడాలి.
సరే! ఏనాడూ లేనిది ఆకస్మికంగా 'భారతీయ మంత్రాల' మీద యూరోప్ దేశాల వారికి ఇంత శ్రద్ద ఎందుకు కలిగింది. ఇక్కడ ప్రాచీన భాషను, ప్రాచీన ఆయుర్వేదం, యోగ, భారతీయ తత్వ శాస్త్రాలు మరియు మన ఇతర జ్ఞాన పరంపరలోని ఔన్నత్యాన్ని గతంలో తమవిగా చూపించే ప్రయత్నాలు చేసి చాలా వరకు సఫలీకృతం అయి, ఆ ప్రయత్నాలు లో ఇది తదుపరి ఘట్టం కాదు కదా?
సంస్కృత భాష అసలు ఇక్కడిది కాదు, యూరోప్ నుండి వచ్చింది అని గత 100 సం. లుగా నూరిపోస్తూ ఈ తరాలను నమ్మించడలో 99% వారు సఫలం అయినట్లే, ఈ వేదాలు మంత్రాలు మీద రీసెర్చ్ చేసి ఆర్యులు వలస వస్తున్నప్పుడు వీటిని తీసుకువచ్చారు అని సూత్రీకరించి మరో 100 సం.లకు ముందు తరాల భారతీయులను నమ్మించే ప్రయత్నమా?
యే దురుద్దేశాలు లేకుండా నిజంగా మంత్రాల లోతు పాతులు గురించి, వాటి వల్ల మానవాళికి కలుగే ఉపయోగాలు గురించి తెలుసుకునే ఉద్దేశ్యం తో ఈ ప్రాజెక్టు పని చేస్తే మానవాళికి మంచిది.
ఒకటి మాత్రం మెచ్చుకోవాలి. భారత్ లో అయితే, హేతువాదులు అసలు మంత్రాలు ట్రాష్. కోట్లు తగలెట్టి వాటిపై రీసెర్చ్ అవసరమా అంటూ అసలు రీసెర్చ్ నే అడ్డుకుని తమ అసహనతను బయటపెట్టుకునే వారు. ఎవరైనా వారిని ఎదిరించి ఇదే ప్రాజెక్టు భారతదేశం లో తలపెట్టి ఉంటే మన ఎర్ర మేధావులు వీర వెటకారం చేసి ఉండేవారు. తెల్లతొక్క యూరోపియన్స్ చేస్తున్నారు కాబట్టి వారికి వాకే..