కుంభమేళాలో హిందువులే స్టాల్స్ పెట్టాలి : అఖారా పరిషత్ నిర్ణయం
మహాకుంభ మేళా పవిత్రతను కాపాడే విషయంలో అఖిల భారతీయ అఖారా పరిషత్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. హిందువులు మినహా మిగతా వారెవ్వరికీ స్టాల్స్ పెట్టనివ్వకుండా నిషేధించింది. ఈ మేరకు కుంభమేళా 2025 నేపథ్యంలో పలు నిబంధనలను ప్రకటించింది. హిందువులు కాని వారు స్టాల్స్ ఏర్పాటు చేయడాన్ని అఖారా నిషేధించింది. అలాగే కుంభమేళా ఆవరణలోకి వచ్చే పండితులు, స్వామీజలు తప్పకుండా తమ ఐడీ ప్రూఫులను చూపించాలని కూడా అఖారా నిబంధన పెట్టింది. నకిలీ స్వామీజీలు, బాబాలను అరికట్టేందుకే ఈ నిర్ణయమని తెలిపారు. ఇటీవలే ప్రయాగరాజ్ లో నిరంజని అఖాడా ప్రధాన కార్యాలయంల అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్ర పూరి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది.
చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, అదే సమయంలో సనాతన ధర్మాన్ని కించపరిచే శక్తులు కూడా విజృంభిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత తమపై వుందని, అలాగే భద్రతా బలగాలకు సహకరించాల్సిన బాధ్యత కూడా తమపై వుందన్నారు. అందుకే కుంభమేళాకి వచ్చే సాధు సంతులకు కచ్చితంగా ఆధార్ లేదా ఐడీ వుండాలన్న నిబంధన తెచ్చామన్నారు. నకిలీ బాబాలను అరికట్టేందుకు అన్ని అఖాడాల నుంచి సాధువుల జాబితాను తాము అడిగామని మహంత్ రవీంద్ర తెలిపారు.
మరో వైపు అఖారా పరిషత్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కుంభమేళాకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఉర్దూ పదాలు కూడా వున్నాయి. వాటిని తొలగించి, వాటి స్థానే సనాతన పదాలను చేర్చుకోవాలని కూడా నిర్ణయం తీసుకుంది. షాహీ, పేష్వాయి పదాల స్థానంలో సనాతన ధర్మానికి సంబంధించిన పదాలను వాడాలని ప్రతిపాదించారు. వీటి స్థానంలో రాజ్సీ స్నాన్, ఛవానీ ప్రవేశ్ లాంటి హిందీ పదాలను వాడుతామని తెలిపారు. మరోవైపు తమ నిర్ణయాలను ముఖ్యమంత్రి యోగికి కూడా తెలియజేశామని, వారు కూడా సానుకూలంగా స్పందించారని మహంత్ రవీంద్ర వెల్లడించారు.