గ్రామ గ్రామన హిందువులు సమైక్యం కావాలి : భాగయ్య
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 99 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వయంసేవకులు అందరూ ప్రతీ గ్రామంలోనూ సంఘశాఖల నిర్మాణం చేపట్టాలని అఖిల భారత కార్యకారణి సదస్యులు భాగయ్య సూచించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులోని వివేకానంద ఆరోగ్యకేంద్రంలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు.
దసరా శరన్నవరాత్రులు దేశమంతా ఉత్సాహంగా, భక్తిగా నిర్వహించారని చెప్పిన భాగయ్య , ఉత్సవాల అంతరార్థం గ్రహించాలని సూచించారు. ముఖ్యంగా ప్రతీ గ్రామంలోని హిందువులనూ సమైక్యం చేయాలని పిలుపునిచ్చారు. మానసిక స్థైర్యం, శారీరక సామర్థ్యం కలిగిన జాతి నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. సమాజాన్ని సంఘటితపరచడంతో పాటు స్వయంసేవకులు సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రబోధించారు. రాజకీయ పక్షాలకు అతీతంగా సంఘం పనిచేస్తోందని చెబుతూ, సమాజంలోని అన్నివర్గాలవారితోనూ సమరసతాభావంతో కలిసి పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో ‘ధవళేశ్వరం ఖండ’కు చెందిన సుమారు 150 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.
అంతకుముందు, విజయదశమి పర్వదినం, రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వ్యవస్థాపక దినం సందర్భంగా ‘శ్రీ వివేకానంద హాస్పిటల్’ భవనానికి భూమిపూజ జరిగింది. సంఘ్ అఖిలభారత కార్యకారణి సదస్యులు భాగయ్య భూమిపూజ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పెద్దలు రిమ్మలపూడి సుబ్బరాజు, ఓలేటి సత్యనారాయణ, ఆర్కె జైన్, పతివాడ రామరాజు, ముళ్ళపూడి జగన్, డాక్టర్ పిల్లాడి పరమహంస, ఇంకా వివేకానంద ఆరోగ్య కేంద్రం ట్రస్ట్ సభ్యులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.