కష్ట సమయాల్లో పుంజుకోవడానికి భగవద్గీత చాలా ఉపకరించింది : డా. కే. రాధాకృష్ణన్
విజయానికి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎంత ముఖ్యమో... యోగేశ్వరుడు కూడా ముఖ్యమని ఇస్రో మాజీ చైర్మన్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత డా. కే. రాధాకృష్ణన్ అన్నారు. నాగపూర్ లో ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘విజయ దశమి సందర్భంగా ఇక్కడికి రావడం విశేషం. పంచపరివర్తన్ అన్న ప్రక్రియలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ప్రసంగించడం కూడా నాకు విశేషం. స్మృతి మందిర్లో స్వీయ-క్రమశిక్షణ మరియు నిస్వార్థ సేవ అనే ఈ సద్గుణ వాతావరణంలో ఒక రోజు వుండటం, RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ జీకి నివాళులర్పించడం గొప్ప విషయం. నేను కూడా ఆయన ఇంటిని, ఆయన జన్మస్థలాన్ని సందర్శించే సందర్భం వచ్చింది. శౌర్యం, సంకల్పం అన్న వాటికి సామరస్యం అనే దానికి సాక్ష్యంగా చూడటం ఓ అనుభవం.
1960 ప్రారంభంలో భారత్ అంతరిక్ష కార్యకలాపాల్లోకి విలక్షణమైన శైలితో ప్రవేశించింది. విశేషమైన స్ఫూర్తిని ప్రసాదించే డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ సతీష్ ధావన్, డాక్టర్ బ్రహ్మ ప్రకాష్ నాయకత్వంలో సమాజ కేంద్రీకృతంగా వుండాలని భారత్ ఎంచుకుంది. రాకెట్ సైన్స్ అన్న దానిని ముందుకు తీసుకెళ్లడానికి దేశ వ్యాప్తంగా వున్న వారు ఇస్రో కేంద్రంగా కలిశారు. మొదటి తరానికి చెందిన ప్రముఖులు భారత్ లో అంతరిక్ష సాంకేతికత మరియు అనువర్తనాలకు పునాది రాయి వేశారు. ఉడిపి రామచంద్రరావు, అబ్దుల్ కలాం, యశ్ పాల్ వీరందరూ మొదటి ప్రాజెక్టుకు నాయకత్వం వహించారు. స్థిరమైన మానవ శ్రేయస్సు కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించాలని భారత్ నడుం బిగించింది. విశ్వం కేంద్రంగా ఆలోచిస్తే మనం ఒంటరిగా లేమని అర్థమవుతుంది. ఇస్రో ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
2040 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి సీనియర్ శాస్త్రవేత్తలు నాయకత్వం వహిస్తున్నారు. అంతరిక్ష సాంకేతికత సాధారణ మానవుడి మొదలు... అన్ని స్థాయిల వారి వరకూ ప్రభావాన్ని చూపుతోంది. ఆత్మనిర్భరత, స్వావలంబన అనేది ఓ లక్ష్యం మాత్రమే కాదు... అవి చోదకాలు. సాంకేతికత, శాస్త్రీయ ఆవిష్కరణలకు, ఆర్థిక పరివర్తనకు చోదకాలు. భారత్ ఇందులో విశేషమైన పురోగతిని సాధించింది. ఆర్థిక వ్యవస్థకు సాంకేతికత, అనువర్తిత శాస్త్రాలు అనేవి చోదకాలు. దేశంలోని భయంకరమైన సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికత , సైన్స్ రెండూ పనికొస్తాయి. అంతరిక్షం మరియు సాంకేతికతలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. అయితే.. అభివృద్ధి చెందుతున్న, సాంకేతికతంగా కేంద్రీకృతమైన ఈ యుగంలో సాంకేతికతలో సమర్థత అనేది అత్యంత ఆవశ్యకం. రాబోయే దశాబ్దం ఆరు, లేదా ఏడో పారిశ్రామిక విప్లవానికి సాక్ష్యంగా నిలవనుంది. మనం పునర్నిర్మాణం కావడం అనేది ఈ సందర్భంగా అత్యావశ్యకమే.
విద్యా రంగం, సాంకేతిక రంగంలో గణనీయమైన మార్పులే వచ్చాయి. విద్యా వ్యవస్థ పరివర్తన చెందుతూ.. సానుకూల దిశలో ప్రయాణిస్తోంది. జాతీయ విద్యావిధానం 2020 అనేది ఈ సన్నద్ధతలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. కళలు, ఆధ్యాత్మికత అనేవి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడంలో నాకు బాగా ఉపకరించాయి. అంతరిక్షం, సైన్స్, టెక్నాలజీ రంగంలో నాయకత్వం వహించడానికి నాకు సంగీతం ఉపయోగపడుతోంది. ఆరో తరగతి చదువుతున్న సమయంలో అర్జునుడి పాత్ర వేశాను. అప్పటి నుంచి భగవద్గీతపై ఆకర్షణ కలిగింది. కష్ట సమయాల్లో తిరిగి పుంజుకోవడానికి భగవద్గీత చాలా ఉపకరించింది. ముఖ్యంగా గీతలోని 16 వ అధ్యాయంలో చెప్పిన వ్యక్తి లక్ణాలు, నిర్భయత, త్యాగం, స్వీయ అధ్యయనం అనేవి నాలో దైవిక విలువలు పెంపొందడానికి ఉపయోగపడ్డాయి." అని డా. రాధాకృష్ణన్ తెలిపారు.