ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుపతి వేదికగా ‘‘వారాహి డిక్లరేషన్’’ పేరుతో సనాతన ధర్మ డిక్లరేషన్ ను ప్రకటించారు. ‘‘సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా వారాహి డిక్లరేషన్ ను వేంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రకటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు నిర్దాక్షిణ్యంగా పని చేస్తాయని, సనాతన ధర్మాన్ని దూషించే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయన్నారు.
సనాతన ధర్మాన్ని బూతులు తిట్టిన, దేవీ దేవతలను తిట్టినా ఒక్క కోర్టూ మాట్లాడదని, అలాంటి వారిని ఏదైనా అనాలంటే కోర్టులు భయపడతాయన్నారు. సనాతన ధర్మాన్ని దూషించే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తున్నాయన్నారు.
- ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
- సనాతన ధర్మ పరిరక్షణ కోసం, దాని విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఓ బలమైన చట్టం అవసరం వుంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
- సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి.
- సనాతన ధర్మం పరిరక్షణ బోర్డుకు ప్రతి యేటా నిధులు కేటాయించాలి.
- సనాతన ధర్మాన్ని కించపరిచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ చేయాలి.
- ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ కేంద్రాలుగా పూర్తి స్థాయిలో రూపు దిద్దుకోవాలి. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేయాలి.