'Vigneswara' is the first deity who receives the first pujas |
( నేడు సెప్టెంబర్ 7న – వినాయక చవితి )
భారతదేశ ఉత్తరాంచలాననున్న పర్వతరాజు హిమవంతుని ముద్దుల మనుమనికి దక్షిణాదివారు తొలి పూజలు చేయటం దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వానికి ప్రతీక. హైందవ జనులలోని దైవీభావనలోని అఖండత్వానికీ, హైందవ సంస్కృతిలోని అవిభాజ్యతకూ ఈ దైవం ప్రతీక.
విఘ్న నాయకునిగా, వినాయకునిగా పిలుచుకునే ఈ గజనునుడైన గణపతిని గూర్చిన ఎన్నెన్నో కథలూ, గాథలూ, ఆయా కథాగాధలకు అనేకానేక ఆధారభూతాలైన ఇతివృత్తాలు ` భారతదేశంలో ప్రసిద్ధిలో ఉన్నాయి. గణపతి అసాధారణమైన రూపం అనేక రకాల భావనలకూ, వివరణలకూ ప్రేరకం అవటమేగాక, అచంచలమైన భక్తి, విశ్వాస, సమర్పణాభావాలకు కేంద్రమైంది.
ఋగ్వేద రచయితయైన కవులలోకెల్ల మహాకవిగా పేర్కొనదగిన గణపతి, గజముఖంతో, లంబోదరంతో విలసిల్లే విఘ్నేశ్వరునిగా ప్రశస్తినందిన గణపతి` ఒకరా వేర్వేరా అన్నది ఒక శాశ్వత వివాదంగానే ఉండిపోయింది. ఆ దైవం తొలుదొల్త ద్రావిడుల ‘బాలదైవం’గా ఉద్భవించి, ఆర్యపథాలలో సైతం విశేష గౌరవ పూజనీయ స్థానాన్నక్రమించాడని చెప్పే ‘కథ’ చరిత్రకు అందని అంకం. అలాంటి కథలు అసంఖ్యాకం. పురాణాలు ఈ దైవాన్ని గూర్చి ఎంతగానో స్తుతిస్తాయి. రెండు పురాణాలకు ఆయనే అధినాయకుడు. కడకు అష్ట ఆగమాలు, బ్రాహ్మణాలు, సూత్రాలూ, ధర్మశాస్త్రాలూ సర్వం ఆయనను ప్రస్తుతిస్తాయి. అసంఖ్యాక భారతీయ, విదేశీ పండితులు ఈ దైవతాన్ని అనే దృక్కోణాల నుండి విశ్లేషించి చూశారు. కాని ఆ మహాదేవుడు ఇంకా ‘ఇంకని జల’ వలె ఆసక్తిదాయకములైన ఎన్నెన్నో రహస్యాలను తనలోనే దాచుకొన్నాడు. నిరంతరం వెల్లడిస్తూనే ఉంటాడు.
గణపతిని గురించి అత్యంత ప్రసిద్ధమైన గాధలలో ఇది ఒకటిÑ ‘జగన్మాత’ పార్వతి ` పరివార సందోహాలకు కొదువలేని తల్లి. ఆమె ఒకనాడు అభ్యంగన స్నానమాడగోరి ` స్నానమందిరపు వాకిట నెవరైన కాపు ఉంచాలని అనుకున్నది. ఆమె తన అభ్యంగ స్నాన సమయాన తన శరీరం నుండి వచ్చిన ‘నలుగు’తో ఒక రూపాన్ని చేసింది. ఆ రూపానికి ప్రాణం పోసి వాకిట కాపు ఉంచింది. ఈ కాపున్న వాడు తన విధిని అక్షరశః నిర్వర్తించటంలో ` పరమ శివుడే వచ్చినా అడ్డగించాడు. లోనికి పోనివ్వనన్నాడు. పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడై ఆతని కుత్తుక నుత్తరించాడు. పాపమా ‘నలుగు’ రూపి శిరం నేలవాలి దొర్లసాగింది. దొర్లి తునాతునకలై పోయింది. ఆసంకల్పితంగానే అయినా తన కుమారుని సంహరించటంతో పరమేశ్వరుడు ఆతనిని పునరుజ్జీవితున్ని చేయవలసి వచ్చింది. కుమారుని శిరస్సుకోసం లోకమంతా గాలించాడు పరమశివుడు. ఎక్కడా సరైన శిరస్సు లభించలేదు. ఒక గజముఖం దొరికితే దానితోనే తృప్తిచెంది, తెచ్చి ఆ కుమారుని మొండేనికి ఆ శిరస్సునంటించి, ప్రాణం పోశాడు. ఆ విధంగా మహాదేవుడైన గజాననుడుద్భవించాడు.
ఒక ‘ఆగమం’ ప్రకారం ` శివపార్వతులిర్వురూ దృష్టి క్రియాశక్తి విషయమై పోటీలు పడి దాంపత్య బాంధవ్యాన్ని కల్పిస్తూ ఒక ఏనుగుల జంటను హిమవత్పర్వత సానువులలో సృష్టించగా`ఆ గజ దంపతులకు జన్మించినవాడీ గజాననుడని ఒక కథ.
గజాననుడు క్రీ.శ.6`8 శతాబ్దాల మధ్యలో ఒక ప్రత్యేక వర్గం వారికి ప్రధాన దైవంగా ఉన్నందు వలన, ఏ సాహితీ, శిలా శాసనాది పత్రాలలోనూ ఆయన గురించి ప్రసక్తి చేయని కారణాన ` ఆయన దక్షిణాపథాన ఉన్న ఆనాటి ఆదిమ జాతులు మాత్రమే పూజించిన ఒక విఘ్నకల్పకుడు, క్రూరుడైన భూతజాతివాడని ` బ్రిటిషు చరిత్రకారులు వాదిస్తారు. వారింకా అంటారు ` ద్రావిడులపై దండయాత్ర చేసిన ఆర్యులు ఆయనకొక ప్రత్యేక స్థానమిచ్చి, తాము వశం చేసుకొన్న ద్రవిడ జాతులవారిని సంతుష్టులను చేయటానికీ, అనునయించటానికీ ` గజానుని పూజించి ఆరాధించారు అని. మన భారతీయ పండితుల భావన ప్రకారం వినాయకుడు ` కాలగతిన రూప, నామాలలో మార్పు చెందుతూ వచ్చిన హైందవుల మూల దైవతాలలో ఒకడు. వీరి అభిప్రాయం ప్రకారం ఋగ్వేదకాలంలో దేవతలకు తన సర్వజ్ఞత వలన ఆచార్యత్వం వహించిన ఆ దైవమే పురాణాల కాలానికి గజముఖుడిగా, వినాయకునిగా రూపాంతరం చెందాడని.
ఆత్మజ్ఞతకు ప్రతీకం
హిందూ ఆరాధనా విధానాలలోని అనేకానేక దైవతాలనూ ప్రతిబింబించే వివిధ ప్రతిమలూ, విగ్రహాదులూ వివిధములై వింత వింతలైన గాథలూ ఇతివృత్తాలూ వివిధ రహస్యాలూ వీటన్నిటినీ మన మేధా ప్రమాణాలలో అవగాహన చేసుకోవడం, కొలబద్దలతో విలువ కట్టడం అసాధ్యమైన కార్యం. కానీ ‘అద్భుత’ములైన ఈ ప్రతి ఒక్క సృష్టి వెనుక ఒక అలౌకికమూ లోకాతీతమూ అయిన రహస్యం, మహాత్మ్యం ఇమిడి ఉంటాయి. ఆత్మ, దైవం అన్నవి ఉన్నా లేకున్నా శాస్త్రీయ మేధ అవగాహనకూ విశ్లేషణాశక్తికీ అందని స్థాయిలో నిరంతరమైన ఒక అన్వేషణాయత్నం అనాదికాలం నుంచి నిత్యం జరుగుతూనే ఉంది. అదే నిరంతరాన్వేషణ గణపతి రూప రహస్యాన్ని కనుగొనడానికి సైతం సాగుతూనే ఉంది.