Sheikh Magdum attempts to rape Vanavasi woman in Jainur, Attacked with a rod to kill women |
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం దేవగూడ దగ్గర ఒంటరిగా వెళ్తున్న వనవాసీ మహిళపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో హత్యాయత్నం చేసి, తీవ్రంగా గాయపరిచి, పారిపోయాడు. దేవగూడకి చెందిన ఆదివాసీ మహిళ రక్షా బంధన్ పర్వదినం సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు గత నెల 31 న సిర్పూర్ మండలంలో వున్న కోహినూర్ అనే గ్రామానికి వెళ్లడానికి సిద్ధమైంది. ఆటో కోసం ఆగిన సమయంలో... షేక్ మగ్దూం దగ్గరికి వచ్చి, తన ఆటో అదే గ్రామానికి వెళ్తోందని, ఎక్కాలని చెప్పాడు. దీంతో ఆ మహిళ అతడ్ని నమ్మి ఆటో ఎక్కింది. దీంతో కొంత దూరం వెళ్లగానే షేక్ మగ్దూం అసభ్యంగా మాట్లాడుతూ, ప్రవర్తిస్తూ.. లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ కేకలు వేయడంతో ఆటో డ్రైవర్ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. తన పేరు బయటికి వస్తుందన్న సాకుతో ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం ఆదివాసీ మహిళ ముఖంపై ఇనుప రాడ్డుతో బలంగా మోదాడు. దీంతో స్పృహ తప్పి, పడిపోయింది. ఆ మహిళ చనిపోయిందనుకున్న మగ్దూం... ఆమెను రోడ్డుపైనే పడేసి, ఆటోలో వెళ్లిపోయాడు.
మహిళను రాడ్డుతో తీవ్రంగా కొట్టంతో మహిళ రక్తపు మడుగులో పడిపోయింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను 108 లో ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, ఆదిలాబాద్ రిమ్స్ కి, అక్కడి నుంచి హైదరాబాద్ కి తరలించారు. అయితే... ఆ మహిళ తమ్ముడికి అసలు విషయం తెలియకపోవడం, మహిళ కూడా స్పృహలో లేకపోవడంతో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కానీ... హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. పోలీసులు కూడా విచారణ చేయడంతో ఈ నెల 2 తేదీన అసలు విషయం బయటకు వచ్చింది.
తనపై ఆటో డ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి ప్రయత్నించాడని, తాను ఎదురు తిరగడంతో తన ముఖంపై ఇనుప రాడ్డుతో బలంగా కొట్టాడని వెల్లడించింది. దీంతో అసలు విషయం బయటపడింది. మరోవైపు నిందితుడు షేక్ మగ్దూంపై లైంగిక దాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని ఆసిఫాబాద్ పోలీసులు ప్రకటించారు. మరోవైపు వనవాసీ మహిళపై దాడికి పాల్పడిన మగ్దూమ్ ను ఉరి తీయాలని వనవాసీ సంఘాలు డిమాండ్ చేస్తూ... జైనూర్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. అలాగే ఈ ఘటనను నిరసిస్తూ నేడు జైనూర్ బంద్ కి పిలుపునిచ్చారు.
Courtesy : Vsktelangana