ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ |
కేరళలోని పాలక్కాడ్‌లో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సమన్వయ సమావేశం సందర్భంగా కులగణన అంశం ప్రస్తావనకు వచ్చింది. నిర్దిష్ట సమూహాలు లేదా కులాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే, ఆ సమాచారాన్ని వారి సంక్షేమం కోసమే ఉపయోగించాలని, ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.
ఆర్ఎస్ఎస్ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఈ విషయమై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కులగణనను “సున్నితమైన అంశం”గా పేర్కొన్నారు. “హిందూ సమాజానికి కులం, కుల సంబంధాలు సున్నితమైన అంశాలు. మన జాతీయ ఐక్యత, సమగ్రతలకు ఇది ముఖ్యమైన అంశం. కాబట్టి రాజకీయాల ప్రాతిపదికన లేదా ఎన్నికల ప్రయోజనాలకోసం కాకుండా చాలా సున్నితంగా వ్యవహరించాలి” అని ఆయన సూచించారు.
“ఆర్ఎస్ఎస్ భావిస్తున్నట్లుగా, అవును, ఖచ్చితంగా అన్ని సంక్షేమ కార్యక్రమాల కోసం, వెనుకబడిన నిర్దిష్ట సమూహం లేదా కులాన్ని ఉద్దేశపూర్వకంగా దృష్టి సారించడం, కొన్ని వర్గాలు, కులాలపై ప్రత్యేక శ్రద్ధ అనేవి అవసరం. కాబట్టి, అందుకోసం, ప్రభుత్వానికి సంఖ్యలు అవసరం. ఆ మేరకు తీసుకోవచ్చు. ఇదివరలో తీసుకున్నారు కూడా” సునీల్ అంబేకర్ తెలిపారు.
“అయితే అది ఆ వర్గాలు , కులాల సంక్షేమం కోసం మాత్రమే ఉండాలి. దీనిని ఎన్నికల ప్రచారానికి రాజకీయ సాధనంగా ఉపయోగించకూడదు. కాబట్టి మేము ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక లైన్‌తో ఉంచాము” అని అంబేకర్ పేర్కొన్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దేశవ్యాప్తంగా కులగణన కోసం ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణన చేబడతామని ప్రకటించారు.
సంక్షేమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం “ప్రత్యేక శ్రద్ధ అవసరమయ్యే సందర్భాలలో” కులగణన అవసరాన్ని ఆర్ఎస్ఎస్ నాయకుడు అంగీకరించారు. ఇంతకు ముందు, బీహార్ కుల సర్వే నివేదికను “ఎన్నికల ప్రయోజనాల కోసం కాకుండా అసమానతను (హిందూ సమాజంలో) పరిష్కరించడానికి ఏదైనా శాస్త్రీయ నిశ్చయాత్మక చర్య కోసం ఉపయోగించినట్లయితే మంచిదే” అంటూ ఆర్ఎస్ఎస్ స్వాగతించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా “కుల జనాభా గణనను నిర్వహించడానికి బిజెపి వ్యతిరేకం కాదు” అని చెప్పారు. అయితే పార్టీకి అలాంటి సర్వే ఏదైనా చేయాలనే ఆలోచన ఉందా అనేది వెల్లడించలేదు. ముఖ్యంగా బీహార్‌లో నితీష్ కుమార్‌కి చెందిన జనతాదళ్ (యునైటెడ్), చిరాగ్ పాశ్వాన్‌కి చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) వంటి అనేక బిజెపి మిత్రపక్షాలు కుల గణనను డిమాండ్ చేస్తున్నాయి.