బాంగ్లాదేశ్ భవిష్యత్తు ఏమిటి? పాకిస్తాన్‌ను మించి మత రాజ్యంగా మారిపోతుందా? ఔననే అంటున్నారు ప్రముఖ రచయిత్రి, భారతదేశంలో అజ్ఞాతంలో గడుపుతున్న తస్లిమా నస్రీన్. ప్రస్తుత పరిణామాలలో జమాతే ఇస్లామీకి విపరీత ప్రాధాన్యం రావడం ఈ అంచనాకు కారణం. చైనా దౌత్య ప్రతినిధి కూడా జమాతే ఇస్లామీని నోరారా పొగిడి వచ్చారు.
బాంగ్లాదేశ్‌లో తీవ్రవాద మత శక్తులకు పెరుగుతున్న ఆధిపత్యం వల్ల మొదట బలయ్యేది మహిళలేనని తస్లిమా ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహిళల మీద తీవ్ర ఆంక్షలు, షరియా అమలు పొంచి ఉన్నాయనే అనుకుంటున్నానని ఆమె చెప్పారు. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు విశ్వవిద్యాల యాలలో ఇస్లాం చెప్పిన విధంగా వస్త్ర ధారణను అమలు చేయడం ఆరంభించారని ఆమె చెప్పారు. అంటే హిజాబ్, నకాబ్, బుర్ఖా వంటివి ధరించ వలసిందేనని ఆదేశాలు వస్తున్నాయి. ఒకసారి షరియా అమలులోకి వస్తే ఇక మహిళలకు హక్కులనేవి ఉండవు అని తెలియచేశారామె. మారుతున్న పరిణామాల కారణంగా హిజ్బ్ ఉత్ తహరీర్, జమాత్ ఇ ఇస్లామీ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రాధాన్యం పెంచుకున్నాయి. వీటిని షేక్ హసీనా కాలంలో ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు. ఈ సంస్థల సభ్యులు రచయితలనీ, బ్లాగర్స్నీ చంపి జైలుకెళ్లారు. ఇప్పుడు వారందరికీ స్వేచ్ఛ వచ్చింది.
ఇదంతా ఒక్కరోజులో వచ్చిన మార్పు అనుకోవద్దని తస్లిమా చెబుతున్నారు. షేక్ హసీనా కూడా మతోన్మాదులను ప్రోత్సహించిన మాట నిజమని, మదర్సాలు దేశమంతా తామరతంపరగా పెరిగాయని చెప్పారు. యువత హేతుబద్ధమైన వాతావరణం మధ్య కాకుండా ఇస్లామ్ మత వాతావరణంలో పెరిగిందని ఆమె అన్నారు. అయినా ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం, షేక్ హసీనా ప్రభుత్వం కంటే దారుణమైనదని ఆమె వ్యాఖ్యానించారు. అందుకే ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం మీద కూడా ఎలాంటి ఆశలు అవసరం లేదని తేల్చి చెప్పారు. నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ పరిస్థితులను ఇంకాస్త దిగజార్చగలరని తస్లిమా అభిప్రాయపడ్డారు. హసీనాను దింపినందుకు సంబరాలు చేసుకుంటు న్నారు. హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తున్నారు. షేక్ ముజిబూర్ రహమాన్ విగ్రహాలను కూలుస్తు న్నారు. హిందువులు వంటి మైనారిటీ వర్గాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భారత వ్యతిరేకత, మహిళల పట్ల వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత బాగా పెరిగాయని అన్నారామె. ఇస్లామిస్టులు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించ మని బాహాటంగా పిలుపునిస్తున్నారని కూడా తస్లిమా తెలియచేశారు.
జమాత్ ఏ ఇస్లామిని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం, నోబెల్ గ్రహీత యూనస్ నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు. కానీ గతాన్ని పరిశీలిస్తే అది బాంగ్లా విద్రోహక సంస్థ. 1971 నాటి బాంగ్లా విముక్తి సమరంలో పాకిస్తాన్ కొమ్ము కాసింది. కానీ బాంగ్లా రాజకీయాలు ఈ సంగతి విస్మరించాయి. అటు ఆవామీ లీగ్, బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ రెండూ కూడా జమాత్‌ను చేరదీసి ఉపయోగించుకున్నాయి. అంతిమంగా బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి జమాత్ దూరం కావలసి వచ్చింది. 2008లో ఏర్పాటైన యుద్ధ నేరాల ట్రిబ్యునల్ ఇందుకు కారణం. 1971లో జమాత్‌కు చెందిన ప్రముఖ నాయకు లంతా పాకిస్తాన్ సేనకు సాయపడుతూ బాంగ్లా దేశీయులను ఊచకోత కోయించారు. యుద్ధ నేరాల ట్రిబ్యునల్ విచారణలు ప్రారంభించగానే బాంగ్లా దేశ్‌లో జమాత్ కుప్పకూలింది. రజాకారులు, అల్ బద్ర, అల్ షామ్స్ వంటి సంస్థలతో కలసి 1971 విమోచన సమరంలో పాక్ సేనలకు జమాత్ సహకరించి, ఘోర నేరాలకు పాల్పడింది. ఇప్పుడు నాడు తాము ఎలాంటి నేరాలు చేయలేదని ప్రకటించు కుంటున్నది. చైనా కూడా ఈ మాట నమ్మినట్టు నటిస్తున్నది. మతమే ప్రధానంగా రాజకీయాలు నడిపే జమాత్‌ను ఒక శక్తిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నది.
ఒకరు మతం మత్తుమందు అంటారు. ఇంకొకరు మా మతమే అన్నింటికీ మందు అంటారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలసి పరస్పరం సహరించు కోవాలని వాటేసుకుని మరీ ప్రతిన బూనారు. ఢాకాలో ఉండే చైనా దౌత్యవేత్త యో వెన్ అక్కడే ఉన్న జమాతే ఇస్లామి కార్యాలయానికి సెప్టెంబర్ 7వ తేదీన పనిగట్టుకుని వెళ్లి ఆ సంస్థ ఆమీర్ డాక్టర్ షఫీక్ ఉర్ రహమాన్‌ను కలుసుకున్నారు. అంతేనా! జమాతే ఇస్లామీ అనేది ఒక వ్యవస్థీకృత రాజకీయ పక్షం అని కితాబు కూడా ఇచ్చారు. ఇది అసాధారణ చర్య అని వెంటనే భారతదేశం వ్యాఖ్యానించింది. ముమ్మాటికీ ఇది అసాధారణమే.
అభిజ్ఞ వర్గాల కథనాలు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. బాంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన పరిణామాల గురించి ఆ ఇద్దరు చర్చించుకున్నారట. వార్తాపత్రికలు సరిగ్గా చదవరేమో మరి! లేకపోతే వాటి గురించి ఇంకా చర్చ ఎందుకు? ఇంకొక సంగతి కూడా ఉంది ఆ వర్గాలే వెల్లడించాయి. ఇరు దేశాల ప్రజలకీ, ప్రభుత్వాలకీ నడుమ సుహృద్భావ సంబంధాలు ఉండాలని కూడా పనిలో పనిగా ఆ ఇద్దరు కోరస్‌గా అనుకున్నారట. 2010 తరువాత జమాత్ కార్యాలయాన్ని ఒక విదేశీ ప్రతినిధి సందర్శించడం మళ్లీ ఇప్పుడే. మొన్నటి దాకా అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం జమాత్ ఏ ఇస్లామీని నిషేధించినప్పుడు ఢాకాలో ఉన్న ఈ కేంద్ర కార్యాలయాన్ని మూసివేసింది. ఈ ఆగస్ట్‌లో వచ్చిన తిరుగుబాటు అనంతరం ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జమాత్ మీద నిషేధం ఎత్తేసింది.
జమాత్‌తో సమావేశం తరువాత ఏమైందో తెలియదు. బాంగ్లాదేశ్ చాలా అందమైన దేశం సుమా అని మెచ్చుకున్నాడు చైనా ప్రతినిధి. జమాత్ కూడా గొప్ప నిర్మాణం కలిగిన రాజకీయ పక్షమని మార్కులు వేశాడు. చైనా బాంగ్లాతో స్నేహపూరిత సంబంధాలనే కోరుకుంటున్నదని కూడా చెప్పారాయన. బాంగ్లా ప్రస్తుత చారిత్రక సందిగ్ధంలో ఉందని అన్నారు.
చైనా దౌత్యవేత్త ప్రశంసించాడు కాబట్టి జమాత్ ఆమీర్ రహమాన్ కూడా ఊరుకోలేదు. బాంగ్లా ఆర్థిక సామాజిక అభివృద్ధికి చైనా చేసిన సాయం చాలా గొప్పదని కీర్తించాడు. ఒకే చైనా విధానానికి జమాత్ మద్దతుగా ఉంటుందనీ, తమ రెండు దేశాల మధ్య దృఢ సంబంధాలకే తాము కట్టుబడి ఉన్నామని కూడా ఆమీర్ వ్యాఖ్యానించారు. మరో రెండు అభిలాషలు కూడా చైనా దౌత్యవేత్త ముందు ఉంచాడు రహమాన్. అవే- తమ దేశంలో పెట్టుబడులు. రొహింగ్యాలకి పునరావాసం. ఈ సమావేశంలో జమాత్ నాయీబ్ ఎ అమీర్ ముజిబుర్ రహమాన్, డాక్టర్ సయ్యద్ అబ్దుల్లా తాహెర్, సెక్రటరీ జనరల్ మియా గోలామ్ పోర్వార్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదంతా చూస్తుంటే జమాతే ఇస్లామీయే బాంగ్లాదేశ్‌ను నడపబోతున్నదన్న సంగతి అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే చైనా వైపు నుంచి ఇది చాలా ప్రత్యేకమైన చర్య అని భారత్ అధికార ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో స్పష్టమయ్యేది ఏమిటి అంటే, ఇప్పుడు బాంగ్లాను ఎవరు పాలించబోతున్నారు అన్న విషయమే అని వారు వ్యాఖ్యానించారు. జమాత్ తెర మీదకు వచ్చింది కాబట్టి పాకిస్తాన్‌తో సత్సం బంధాలు పెట్టుకోవడం బాంగ్లాకు అనివార్యమని విశ్లేషకులు చెబుతున్నారు.
చైనా దౌత్యవేత్తతో జమాత్ నాయకులు సమావేశం కావడమంటే పెద్ద పథకమే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్‌తో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామని తాత్కాలిక ప్రభుత్వ మంత్రి ప్రకటించారు. అంటే భారత్‌కు అటు ఇటు ఉన్న రెండు మత రాజ్యాలను చైనా ఆడిస్తూ, తలనొప్పిని పెంచే ప్రయత్నం చైనా ఆరంభించింది. అయితే చైనాలో నీచమైన జీవితం గడుపుతున్న సాటి ముస్లింల (ఉయిగర్లు) శ్రేయస్సు కంటే భారత్‌ను ఇరుకున పెట్టే వ్యూహామే పాకిస్తాన్ అనే పాత మత రాజ్యానికీ, కొత్తగా ఆవిర్భవించబోతున్న మత బాంగ్లాకు కూడా ముఖ్యమని తేలింది. లేకుంటే ఉయిఘర్ ముస్లింలపై జరుగుతున్న దారుణం గురించి చైనా దౌత్యవేత్తని ఆ ఇస్లాం సంరక్షక దేశాలు ఎందుకు ప్రశ్నించలేదు?
– జాగృతి డెస్క్