Sunil Ambekar |
‘‘భారతీయ ధృక్కోణం’’ నుంచి చూస్తేనే భారత్ అర్థమవుతుంది : సునీల్ అంబేకర్
హిందూ సమాజంలో విశ్వాసాన్ని నింపడమే ఆరెస్సెస్ ప్రధాన లక్ష్యమని, ఇది ఓ ప్రక్రియ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ పేర్కొన్నారు. ఈ దిశగానే తాము సమాజంలో ముందుకు సాగుతున్నామని వివరించారు. ఉదాహరణకు అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సమయంలో అన్ని విభజన వాదాలను దాటుకొని, హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చి నిలబడిందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ జాతీయ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ అంబేకర్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అలాగే సమన్వయ బైఠక్ అంశాలు, జాతీయ భద్రత, మహిళా సాధికారత, బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువులపై మారణహోమం, వాయనాడ్ ప్రళయం, సంఘ్ భవిష్యత్తు... ఇలా పలు అంశాలపై ఆయన స్పందించారు. ఇక... దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి నగరం, పట్టణంలో సానుకూల ఉత్సాహం, భక్తి భావాలు పుష్కలంగా వున్నాయని, అందరూ కలిసి రావడం ద్వారా భారత్ లోని ఐక్యత అన్న దానిని చూడవచ్చు అని తెలిపారు. అందుకే భారతీయులలో ఈ చైతన్యం కచ్చితంగా ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతూనే వుంటుందని ప్రకటించారు.
మరోవైపు అఖండ భారత్ గురించి ఇంటర్వ్యూలో ప్రస్తావించగా... అఖండ భారత్ అనేది రాజకీయ భావన కాదని తేల్చి చెప్పారు. ఇది సాంస్కృతిక భావన అని వివరించారు. అఖండ భారత్ అనేది భారత దేశపు ప్రాచీన సంస్కృతి సమగ్ర స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. అయితే.. సాంస్కృతిక ఐక్యత కాలక్రమేణా బలహీనపడినప్పటికీ, ప్రజలు ఒకరినొకరు గౌరవంగా చూసుకుంటూ, తేడాలను చెరిపేసుకుంటూ జీవించినప్పుడే అంతిమంగా శాంతి, సామరస్యాన్ని సాధించవచ్చని తెలిపారు. సాంస్కృతిక కోణంలో భవిష్యత్తులో అఖండ భారత్ అనేది వాస్తవంగా చూడొచ్చని ధీమా వ్యక్తం చేశారు.
ఇక.. స్వ అన్న అంశం, వలసవాద బుద్ధి విషయంపై కూడా స్పందించారు. ఒక దేశం సహజంగా అనుభవం ద్వారా దాని సొంత జీవన విధానాన్ని ఏర్పర్చుకుంటుందని తెలిపారు. సామరస్యంతో సమాజం కలిసి జీవించాల్సిన వాతావరణాన్ని గుర్తించి, దానిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.ఆరెస్సెస్ ‘‘స్వ’’ అన్న భావజాలం కోసం కృషి చేస్తోందని, ప్రతి అంశంలోనూ అంటే భాష, జీవన శైలి, వ్యవస్థలు, పాలనలో ఈ ‘‘స్వ’’ అన్నది రావాలని ఆకాంక్షించారు. విద్య మొదలు సాంకేతికత విధాన రూపకల్పన, అభివృద్ధి... ఇలా అన్ని అంశాల్లోనూ భారత్ తనంతట తాను వ్యక్తీకరించుకోవడానికి వీలు కల్పిస్తూ.. ‘‘స్వ’’ అన్న పద్ధతిని అనుసరిస్తూ మెళ్లి మెళ్లిగా వలసవాద ధోరణిని విడనాడాలని అన్నారు.
బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న సంక్షోభం, అక్కడి హిందువులపై జరుగుతున్న దాడులను కూడా ఈ ఇంటర్వ్యూలో సునీల్ అంబేకర్ ప్రస్తావించారు. మైనారిటీల భద్రత విషయంలో, హిందువులకు రక్షణ కల్పించాలని తాము ఇప్పటికే సూచించామని, దౌత్యపరంగా ఈ అంశాన్ని కూడా అక్కడి తాత్కాలిక ప్రభుత్వంతో లేవనెత్తాలని ఆరెస్సెస్ ప్రభుత్వాన్ని కోరిందని గుర్తు చేశారు.అక్కడి హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వారి రక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజాగా పాలక్కడ్ వేదికగా జరిగిన అఖిల భారతీయ సమన్వయ బైఠక్ గురించి ప్రస్తావించారు. ఈ బైఠక్ లో సంఘ్ ప్రేరేపిత వివిధ సంస్థల కార్యకలాపాలు, విస్తరణపై దృష్టి సారించిందని తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు సైనిక భద్రతకు భారత్ అంతర్గత బలం అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. సానుకూల స్వభావం కలిగిన ఓ బలమైన దేశం సహజంగానే దాని పొరుగు వారిని సానుకూలంగానే ప్రభావితం చేస్తుందన్నారు. ప్రపంచ శ్రేయస్సు, సామరస్యం కోసం ఉద్దేశించిన వసుదైక కుటుంబం అనేది భారత్ ఎదుగుదలకు ఎంతో సహాయకారి అని తెలిపారు.
పాకిస్తాన్ పరిస్థితుల గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావనకు వచ్చింది. పాక్ సంవత్సరాల తరబడి అల్లకల్లోలం ఎదుర్కొంటోందన్నారు. ఎందుకంటే.... పాకిస్తాన్ ఆవిర్భావమే సహజంగా జరగలేదన్నారు. పాకిస్తాన్ భవిష్యత్తు అనిశ్చితంగా వుందని, ముఖ్యంగా బలూచిస్తాన్ వంటి ప్రాంతాలలో అశాంతి వుందని, ఇవన్నీ చూసుకుంటే పాక్ ఎలా అభివృద్ధి పథంలో వెళ్తుందో చెప్పడం చాలా సవాలుతో కూడుకున్న పని అని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు.
ఇక.. దేశంలోని మహిళల భద్రతపై కూడా స్పందించారు. ఇది అత్యంత ఆవశ్యకమని అభిప్రాయపడ్డారు. ఇక.. తాజాగా బెంగాల్ లో జరిగిన వైద్యురాలని హత్య కేసుపై కూడా స్పందించారు. బెంగాల్ ప్రభుత్వ అనుచిత వైఖరిని తూర్పూరాబట్టారు. దోషులను రక్షించే ప్రయత్నాలను ఆయన విమర్శించారు. ఆ కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా బాలికలకు ఆత్మరక్షణ నైపుణ్యాల ప్రాముఖ్యం ఎంతో వుందని నొక్కి చెప్పారు. ఈ ఆత్మరక్షణ అనేది వారికి సానుకూల వాతావరణం తెచ్చిపెడుతుందన్నారు.
Sunil Ambekar ji |
కేరళ వయనాడ్ కొండచరియలు విరిగినప్పుడు ఆరెస్సెస్, సేవా భారతి కార్యకర్తలు చేసిన సేవలను సునీల్ అంబేకర్ ప్రశంసించారు. ఈ ప్రళయం జరిగిన సమయంలో ఆరెస్సెస్ కార్యకర్తలు అత్యంత వేగంగా స్పందించి, వేగంగా సేవా చర్యల్లో పాల్గొన్నారని మెచ్చుకున్నారు. ఇంత వేగంగా ప్రతిస్పందించడం అనేది సంఘ్ సంస్కారంలోనే నిబిడీకృతమై వుంటుందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను నివారించడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో, దాని మూల కారణాలను అధ్యయనం చేయాల్సిన అవసరం వుందన్నారు.
ఇక.. సంఘ్ పై దేశంలోని యువత ఆకర్షితులవుతున్నారా ? అని ఈ ఇంటర్వ్యూలో ప్రశ్న వచ్చింది. దీనికి సమాధానంగా... ఆరెస్సెస్ లో చేరడంపై యువకుల్లో గణనీయమైన ఉత్సాహం వుందని సునీల్ అంబేకర్ తెలిపారు. ప్రాథమిక శిక్షావర్గలో అనేక మంది యువకులు పాల్గొంటున్నారని, ఈ శిబిరం అనేక మంది యువతను ఆకర్షిస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది ఈ శిబిరానికి హాజరవుతున్నారని తెలిపారు.వారి సమయాన్ని, షెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకొని వారాంతాల్లో ‘‘శాఖ’’ను నడుపుతున్నామని పేర్కొన్నారు. మరోవైపు సంస్థ వెబ్ సెట్ ద్వారా ఆరెస్సెస్ లో జాయిన్ అవుతున్నారని, దాదాపు 1.25 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇందులో 30 ఏళ్ల లోపు యువకులే అధికంగా వున్నారని, ఇది సానుకూల దృక్పథమేనని వివరించారు.
దేశంలోని సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ కోసం ఆరెస్సెస్ క్షేత్ర స్థాయిలో చేయాల్సినంత పని చేయలేదన్న విమర్శలు వస్తున్నాయని అడగ్గా... ప్రజలను నిరంతరం జాగృతం చేసే పని ఆరెస్సెస్ ఎల్లప్పుడూ చేస్తూనే వుందని వివరించారు. ఆరెస్సెస్ ఓ సామాజిక సంస్థ అయినప్పటికీ... అవసరమైన చోట కచ్చితంగా మద్దతిస్తుందని తెలిపారు. సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలో సామాజిక పరివర్తనను తీసుకురావడానికి అనేక సన్నాహాలు చేస్తోందని వెల్లడించారు.
భారత దేశ ఐక్యత, శాంతి, అభివృద్ధిని పూర్తిగా అణగదొక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న శక్తుల నుంచే దేశానికి అత్యంత ముప్పు వుందని పేర్కొన్నారు. భారత్ ను భారతీయ దృక్పథం నుంచే అర్థం చేసుకోవాలని, అప్పుడే భారత్ అర్థమవుతుందని తెలిపారు. ఈ భావజాలమే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేలా దేశాన్ని సన్నద్ధం చేస్తుందని సునీల్ అంబేకర్ అభిప్రాయపడ్డారు.
Courtesy : vskts