It was an Indian who invented America: Madhya Pradesh minister |
అమెరికాను కనిపెట్టింది భారతీయుడే : మధ్యప్రదేశ్ మంత్రి
అమెరికాను కనిపెట్టింది అందరూ అనుకున్నట్లు కొలంబస్ కాదని, ఓ భారతీయుడని మధ్యప్రదేశ్ విద్యా మంత్రి మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ ప్రకటించారు. తప్పుడు చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారని, దీనిని సరిచేయాలని అన్నారు.
దీనిని మార్చాల్సిన అవసరం వుందని, అసలైన చరిత్ర విద్యార్థులకు బోధించాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. అసలు వాస్తవాలేమిటో విద్యార్థులకు తెలియాలని, ఇలా చాలా విషయాలు మిగిలిపోయి వున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భోపాల్ లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. భారత్ కి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది కూడా వాస్కోడిగామా కాదని, ఓ గుజరాత్ వ్యాపారి అని వెల్లడించారు.
వాస్కోడిగామే సముద్ర మార్గాన్ని కనిపెట్టాడని ఓ చరిత్రను సుస్థిరం చేశారని, దీనిని చెరిపేసి, వాస్తవ చరిత్రను వెలికి తీయాలన్నారు.అక్కడి స్థానిక గిరిజనులను కొలంబస్ ఎలా హింసించాడు? ఎలా నాశనం చేశాడో నేర్పించాలన్నారు. అలాగే ఎలా మత మార్పిళ్లు చేశారో కూడా ప్రపంచానికి చెప్పాలన్నారు. ఆఫ్రికాలోని జాంజిబార్ ఓడరేవులో వుండే గుజరాతీ వ్యాపారి చందన్ తో భారత్ ను చూడాలన్న కోరికను వాస్కోడాగామ వ్యక్తం చేశాడని, అప్పుడు చందన్ ఓడను వాస్కోడాగామ అనుసరించారని సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంతే తప్ప… వాస్కోడాగామ భారత్ ను కనిపెట్టలేదన్నారు.