మసీదు నిర్మాణం, లవ్ జిహాద్ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్‌ని, అసెంబ్లీని కుదిపి పారేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సంజౌలిలో మసీదు నిర్మాణం తీవ్ర వివాదానికి కారణమవుతోంది. ఈ మసీదు నిర్మాణాన్ని కాంగ్రెస్‌లోని సొంత మంత్రే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దీంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతోంది. రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోనే సాక్షాత్తూ కాంగ్రెస్‌లోనే ఈ మసీదు నిర్మాణం తీవ్ర విభేదాలకు కారణమైంది. దీంతో ముఖ్యమంత్రికి ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
కాంగ్రెస్ సభ్యులే పరస్పరం తీవ్ర వాగ్వాదానికి దిగారు. సిమ్లా మున్సిపల్ కార్పొరేషనే స్వయంగా ఇదంతా చేస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ మతపరమైన ఉద్రిక్తతలకు కారణమవుతోంది. అసెంబ్లీలో చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీష్ జనార్థ 1960కి ముందు నుంచే అక్కడ మసీదు వుందని, అయితే... 2010 లో వక్ఫ్ బోర్డు అధీనంలో వున్న భూమిలో మూడు నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని ఆరోపించారు.అక్రమంగా నిర్మించిన రెస్ట్ రూములను కూల్చేశారని, మసీదులో బయటి వ్యక్తులే కాకుండా స్థానిక ముస్లింలు కూడా వుంటున్నారని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పరిస్థితిని రెచ్చగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదిలా కొనసాగుతుండగా సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖూ కేబినెట్లో గ్రామీణాభివృద్ధి - పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వున్న అనిరుధ్ సింగ్ ఎమ్మెల్యే జనార్ద వ్యాఖ్యలను ఖండించారు. మసీదు నిర్మాణానికి వున్న చట్టబద్ధతను సూటిగా ప్రశ్నించారు. తాను ఏ వర్గానికి వ్యతిరేకిని కానని, అయితే.. అనుమతి లేకుండానే 2010లో నిర్మాణాలు ప్రారంభించారని, ఆ తర్వాత 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికార నిర్మాణం పూర్తైపోయిందని దుయ్యబట్టారు.2012లో జరిగిన విచారణ సమయంలో దీనికి సమ్మతి రాలేదని, అయినా 2019 నాటికి మరో నాలుగు అంతస్తులు కూడా అక్రమంగా కట్టడం పూర్తైందని మండిపడ్డారు. 2010లో వ్యాజ్యం పెండింగ్‌లో వున్నప్పుడు నాలుగు అంతస్తుల భవనాన్ని ఎలా నిర్మించారు? పరిపాలన అధికారులు నిద్రపోతున్నారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ చట్ట విరుద్ధ పనులను అధికారులు అస్సలు పట్టించుకోలేదని మండిపడ్డారు. 6,357 చదరపు అడుగుల విస్తీర్ణంలో అనధికారిక నిర్మాణాలు జరిగాయని, మసీదును నిర్మించిన భూమి అంతా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుందని మంత్రి స్పష్టం చేశారు.
మంత్రి అనిరుధ్ సింగ్ |
తమ ప్రభుత్వం ఎవ్వర్నీ వ్యతిరేకించదని అయితే... ఈ మసీదు అక్రమ నిర్మాణంలో ప్రమేయం వున్న వారందర్నీ విచారించమని స్వయంగా తాను ముఖ్యమంత్రిని కోరుతానని మంత్రి అనిరుధ్ సింగ్ ప్రకటించారు. ఈ అక్రమ నిర్మాణం ద్వారా సంజౌలి మార్కెట్ లో మహిళలు నడవడమే ఇబ్బందికరంగా మారిపోయిందని, ఈ సంఘటనను తాను వ్యక్తిగతంగా చూశానని మంత్రి ప్రకటించారు.మరోవైపు ఈ మసీదు అక్రమ నిర్మాణంపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
అలాగే మరో ముఖ్యమైన అంశాన్ని కూడా మంత్రి అనిరుధ్ సింగ్ లేవదీశారు. తెహబజారీ (లైసెన్స్ పొందిన వీధి వ్యాపారులు) అంశం కూడా ప్రస్తావించారు. ఈ వీధి వ్యాపారుల్లో ముస్లింల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హిమాచల్ నివాసితులకు మాత్రమే ఇలాంటి లైసెన్సులు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొంతమంది అక్రమంగా వచ్చి బంగ్లాదేశీయులు నివాసం వుంటున్నారని, వారి గుర్తింపును ధ్రువీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు.
లవ్ జిహాద్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మంత్రి అనిరుధ్ సింగ్
అక్రమ మసీదు నిర్మాణం, ఫుట్ పాత్ లపై ముస్లిం వ్యాపారం పెరిగిపోవడంతో పాటు రాష్ట్రంలో లవ్ జిహాద్ కూడా పెరిగిపోతోందని మంత్రి అనిరుధ్ సింగ్ తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజౌలి మార్కెట్ ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, పెరిగాయని, మహిళలు నడవడమే కష్టమైపోయిందన్నారు. అంత తీవ్ర స్థాయిలో దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటితో పాటు లవ్ జిహాద్ అంశం కూడా తీవ్రమైందన్నారు. ఇది మన దేశానికి, రాష్ట్రానికి అత్యంత ప్రమాదకారి అని స్పష్టం చేశారు. లవ్ జిహాద్ పై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణను ప్రారంభించాలని, లవ్ జిహాద్‌కి అడ్డుకట్ట వేయాలని మంత్రి అనిరుధ్ సింగ్ డిమాండ్ చేశారు.
....vskts