మౌలానా ఉమర్ గౌతమ్ తో సహా మరో 15 మందిని సామూహిక మతమార్పిడి విషయంలో లక్నో కోర్టు దోషులుగా తేల్చింది. వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా మత మార్పిడికి గురైన బాధితులకు ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
వివిధ రాష్ట్రాల్లో వెయ్యి మందిని అక్రమంగా ఇస్లాంలోకి మార్చారని వీరిపై ఆరోపణలున్నాయి. దీంతో ఎన్ఐఏ, యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కేసులు నమోదు చేసింది. దీంతో తాజాగా వీరిని దోషులుగా తేల్చుతూ లక్నో కోర్టు తీర్పునిచ్చింది. నిందితులందర్నీ జ్యుడీషియల్ కస్టడీకి పంపామని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఏటీఎస్ అధికారులు 17 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుల్లో ఒకరైన ఇద్రీస్ ఖురేషీ విషయంలో మాత్రం కేసు ఇంకా పెండింగ్ లోనే వుంది.
ఐపీసీ సెక్షన్లు 417 (మోసం), 153 ఏ (మత ప్రాతిపదికన ద్వేష భావాలను ప్రోత్సహించినందుకు), 153బీ తో పాటు వివిధ సెక్షన్ల కింద వారిని దోషులుగా న్యాయమూర్తి ప్రకటించారు. నిందితుల్లో మౌలానా ఉమర్ గౌతమ్, అర్షన్ ముస్తఫా, ముఫ్తీ ఖ్వాజీ జహంగీర్, కౌషర్ ఆలం, బాబుల్హా షా, ఇర్ఫాన్ షేక్, సలావుద్దీన్ జైబుద్దీన్ షేక్, మహ్మద్ సలీమ్, సర్ఫరాజ్ అలీ జఫారీ తదితరులు వున్నారు. ఢిల్లీలోని బాట్లాహౌజ్ ప్రాంతంలో ఇస్లామిక్ దవాహ్ సెంటర్ నిర్వహిస్తున్న మౌలానా ఉమర్ గౌతమ్ తో పాటు ఉద్యోగి ముఫ్తీ కాజీ జహంగీర్ కాస్మీని అరెస్ట్ చేసిన తర్వాతే ఈ సామూహిక మత మార్పిడి కేసును ఏటీఎస్ ఛేదించింది. తర్వాత జరిగిన విచారణలో ఉమర్ గౌతమ్ కుమారుడు అబ్దుల్లా ఉమర్ సహా మరో 15 మందిని అరెస్ట్ చేశారు.
మరో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరందరికీ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐతో సహా అంతర్జాతీయ సంస్థలు మత మార్పిళ్ల కోసం నిధులు కూడా సమకూర్చాయని పోలీసులు పేర్కొంటున్నారు. మత మార్పిడి విషయంలో మౌలానా ఉమర్ గౌతమ్ సిద్ధహస్తుడని, ప్రధాన పాత్ర పోషించాడని ఏటీఎస్ తన ఛార్జీషీట్ లో పేర్కొందని న్యాయవాదులు తెలిపారు. అయితే... మౌలానా ఉమర్ గౌతమ్ మొదట హిందువేనని, ఆ తర్వాత ఇస్లాంలోకి మారినట్లు చెబుతున్నారు. ఇస్లాంలోకి మారిన తర్వాత బలవంతంగా అందర్నీ ఇస్లాంలోకి తీసుకురావడం ప్రారంభమైంది. ప్రత్యేక కథనాలను ఆయనే రాస్తూ, సృష్టిస్తూ... సామూహికంగా మత మార్పిళ్లు చేసేవాడని ఏటీఎస్ పేర్కొంది. అంతేకాకుండా ఆకర్షణీయ వాగ్దానాలివ్వడం, ఉద్యోగాలిప్పిస్తామని మతం మార్చడం... ఇతరత్రా ప్రలోభాలు చూపించి సామూహిక మత మార్పిళ్లు చేసేవాడని చెబుతున్నారు.
....vskts