సిమ్లాలోని సంజౌలి ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణం వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. అక్రమ మసీదు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సంజౌలి ప్రాంతంలో హిందూ సంస్థలు ధల్లి ప్రాంతంలో రోడ్లపైకి వచ్చి, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
ఐదంస్తుల మసీదును అక్రమంగా నిర్మించారంటూ హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచీ హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అక్రమంగా నిర్మిస్తున్న మసీదును వెంటనే కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.దీంతో పోలీసులు మసీదు పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజౌలి ప్రాంతంలో పోలీసులు 163 సెక్షన్ ను విధించారు. ఐదారుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడడం, ఆయుధాలను తీసుకెళ్లడాన్ని నిషేధించారు.
మరోవైపు అత్యంత వివాదాస్పదమైన ఈ మసీదుకి సుదీర్ఘమైన చరిత్ర వుంది. 1947 కి ముందు.. ఇది తాత్కాలిక నిర్మాణమే. 2010 లో శాశ్వతమైన మసీదు నిర్మాణం ప్రారంభమైంది. దీంతో స్థానికంగా నిర్వాసితులైన వారి నుంచి అనేక ఫిర్యాదులు రావడం ప్రారంభమైంది.దీంతో అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. న్యాయశాఖ పరిధిలో వున్నా... 2024 నాటికి ఐదంతస్తుల నిర్మాణం పూర్తైంది. అక్రమ నిర్మాణాలను నిలిపేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. 2023 లో మున్సిపల్ కార్పొరేషన్ మసీదుకి సంబంధించిన మరుగుదొడ్లను కూల్చేయడం ప్రారంభించింది.దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
అయితే ఈ కేసుపై సెప్టెంబర్ 7 న విచారణ జరిగింది. ఆ సమయంలోనే వక్ఫ్ బోర్డు యాజమాన్య పత్రాలను సమర్పించింది. కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 5 కి షెడ్యూల్ చేసింది. మరియు వివాదాస్పద నిర్మాణం విషయంలో తాజా పరిస్థితిపై తమకు నివేదిక సమర్పించాలని సంబంధిత జేఈని కోర్టు ఆదేశించింది. మరోవైపు మసీదు ఇమామ్ ఈ అక్రమ నిర్మాణాన్ని సమర్థించాడు. 1947 కి ముందు తాత్కాలిక రెండతస్తుల భవనంగా వుండేదని, మొదట్లో మసీదు తాత్కాలికమైందని, ప్రార్థనలు బయట చేసేవారని, దీంతో ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.దీంతో విరాళాలు సేకరించామని, మసీదు నిర్మాణం ప్రారంభమైందని వివరించాడు. ఈ భూమి వక్ఫ్ బోర్డుకు సంబంధించిందని తెలిపాడు.
ఇంత వివాదం రేగడంతో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుఖు స్పందించారు. శాంతిభద్రతలను కాపాడడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ప్రకటించారు.అయితే శాంతియుతమైన నిరసనల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. తాము అన్ని వర్గాలను గౌరవిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ఎవ్వరు ప్రయత్నించినా అనుమతించమన్నారు. అక్రమ మసీదు నిర్మాణం విషయంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
Courtesy : vskts