Gyan vapi is not a mosque. Vishwanath temple: CM Yogi Adityanath |
జ్ఞాన్వాపి మసీదు కాదు.. విశ్వనాథ దేవాలయం : సీఎం యోగి
జ్ఞాన్వాపి అనేది మసీదు కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అది మసీదు కాదని, అది సాక్షాత్తూ కాశీ విశ్వనాథుని దేవాలయమని తెలిపారు. జ్ఞాన్వాపిని ముస్లింల ప్రార్థనా స్థలంగా పిలవడంపై యోగి అభ్యంతరం తెలిపారు.
ఈ అంశం జాతీయ ఐక్యత, సమగ్రతకు అడ్డంకిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనదయాళ్ గోరఖ్ పూర్ యూనివర్శిటీలో జరిగిన సామరస్య సమాజ నిర్మాణంలో నాథ్ పంథ్ సహకారం అనే అంశంపై అంతర్జాతీయ సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి మాట్లాడుతూ.. ఆది శంకరుల పాత్రను ప్రముఖంగా, సవివరంగా ప్రస్తావించారు. సాధువులు, మహర్షుల సంప్రదాయం దేశాన్ని, సమాజాన్ని కలిపి వుంచే సంప్రదాయమని వివరించారు. వారి సాహిత్యం కూడా అదే కోవలోనిదని తెలిపారు. కేరళలో జన్మించిన ఆదిశంకరులు దేశంలోని నాలుగు మూలల్లో దేశ రక్షణ కోసం, వైదిక మతం వృద్ధి కోసం నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారని గుర్తు చేశారు.
ఆదిశంకరులు అద్వైత జ్ఞానంతో నిండిన కాశీకి వచ్చినప్పుడు, భగవంతుడు విశ్వనాథ అతనిని పరీక్షించాలనుకున్నారని తెలుపుతూ.. ఈ సందర్భంగా ఛండాలుని వృత్తాంతాన్ని గుర్తు చేశారు. బ్రహ్మ ముహూర్త సమయంలో ఆదిశంకరులు గంగా స్నానానికి బయల్దేరిన సమయంలో విశ్వనాథుడు ఛండాలుని రూపంలో ఆయన ముందు నిలబడ్డారని, దారి నుంచి తప్పుకోమని శంకరులు కోరారని, అప్పుడు ఛండాలుని రూపంలో వున్న శంకరులు అద్వైత స్థితిలో వున్నపుడు కేవలం భౌతిక రూపాన్ని చూడొద్దని, ఎవర్ని తప్పుకోమంటున్నావ్? బ్రహ్మ సత్యమైతే నీలో వున్నది, నాలో వున్నది కూడా బ్రహ్మ పదార్థమే కదా.ఎవర్ని తప్పుకోమంటున్నావ్?’’ అంటూ ఆది శంకరులను ప్రశ్నించారని తెలిపారు.
ఈ సంభాషణ విని శంకర భగవత్పాదులు ఆశ్చర్యపోయారని, చివరికి ఆ ఛండాలుడు సాక్షాత్తూ శంకరుడేనని తెలుసుకొని, సాష్టాంగం ప్రణామాలు చేశారని గుర్తు చేశారు. రుషులు, సాధువుల సంప్రదాయం మధ్య భేదాలుండవన్నారు. మన రుషులు, మునులు, సాధువులు సమాజంలో సామరస్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, అంటరానితనం నిర్మూలపై కూడా శ్రద్ధ పెట్టారన్నారు. నాథ సంప్రదాయం కూడా అంటరానితనం నిర్మూలనకే కృషి చేసిందన్నారు. అందర్నీ ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నించిందని సీఎం యోగి తెలిపారు.
......vskts