Contents of The Vedas should be told to the common man: Mohan Bhagwat |
సమాజంలో ఆధ్యాత్మిక నిర్మాణాన్ని కొనసాగించడానికి సమకాలీన సందర్భాలలో పురాతన గ్రంథాలను పునరుద్ధరించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.
ప్రస్తుత సమాజంలో విశ్వాసం అన్న దానిని సజీవంగా వుంచాలంటే వేదాల్లో వున్న అత్యాధునిక విషయాలను సామాన్యులకు కూడా తెలియజేయాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు. పూణెలోని బాలగంధర్వ మందిర్ లో జరిగిన వేద సేవకుల సన్మాన సభలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేదాలలో పొందుపరిచిన లోతైన జ్ఞానాన్ని నొక్కిచెప్పారు. వాటిని కేవలం పురాతన గ్రంథాలుగా మాత్రమే కాకుండా, జీవితంలో లోతైన అంతదృష్టిని అందించే భారత దేశ ఆధ్యాత్మిక వారసత్వానికి పునాదిగా చూడాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం వేదాలలో వున్న జ్ఞానాన్ని ప్రపంచానికి సరికొత్త రూపంలో అందించాల్సిన అవసరం వుందని అభిప్రాయపడ్డారు.
పురాతన సంప్రదాయాల కారణంగా భారత్ ఇప్పటికీ బలంగా వుందని మోహన్ భాగవత్ అన్నారు. ఇక... పురాతన సంప్రదాయాల్లో ఒకటైన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కుటుంబ వ్యవస్థ నాశనమవుతోందని, కానీ.. భారత్ లో మాత్రం కుటుంబ వ్యవస్థ బలంగా వుందన్నారు. వేదంలో కూడా ఈ వ్యవస్థ గురించి పుష్కలంగా వుందన్నారు.మరోవైపు అంటరానితనాన్ని రూపుమాపాలని నొక్కి చెప్పారు. వేదాలలో అంటరానితనానికి స్థానం లేనప్పుడు, సమాజంలో ఇది ఎందుకు వుండాలి? అంటూ ప్రశ్నించారు.
ప్రపంచ వ్యాప్తంగా దుష్టశక్తులు పెరిగిపోతున్నాయని అన్నారు. కానీ... ఆ శక్తులు భారత్ లోకి వస్తే మాత్రం క్షీణిస్తాయని, ఇక్కడ వాటికి తాము అంత్యక్రియలే నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దుష్ట శక్తులకు ఎలాంటి కోచింగ్ అవసరం లేకుండానే ఎప్పుడూ క్రియాశీలకంగా, ఐకమత్యంగా వుంటాయన్నారు. మనం ఎల్లప్పుడూ సద్గురువులను దర్శిస్తూ.. వారి మార్గదర్శనం తీసుకుంటూ వుంటామని, కానీ దుష్టశక్తులకు అలాంటి శిక్షణేదీ అవసరం వుండదని పేర్కొన్నారు.
దుష్ట శక్తులు ప్రపంచ వ్యాప్తంగా వున్నాయని, వారి దుష్ట పనులు ప్రపంచమంతా వ్యాప్తి చెంది వున్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ కేసు మొదటిది కాదని, అమెరికా మొదటి కేసు అని వివరించారు. ఓ అమెరికన్ రచయిత రాసిన ‘‘కల్చరల డెవలప్ మెంట్ ఆఫ్ అమెరికా’’ అనే పుస్తకాన్ని తాను చదివానని, గత 100 సంవత్సరాలలో అమెరికాలో సాంస్కృతిక అధోగతి ఎలా జరుగుతుందో అందులో వివరిస్తారని తెలిపారు. ఈ క్షీణత పోలాండ్ లో పునరావృత్తమైందని, అరబ్ దేశాలకు వ్యాపించిందని, ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిందని సోదాహరణంగా వివరించారు.
ప్రపంచంపై తమ ఆధిపత్యాన్ని పెంచుకొని, తాము నమ్మేదే సరైనదని చెప్పేవారు. ఇతరులది తప్పు అనే వారు కేవలం తమ స్వలాభం కోసం విభజన ధోరణునుల ప్రోత్సహిస్తున్నారని మోహన్ భాగవత్ విమర్శించారు. కానీ ఇలాంటి ధోరణులు విపత్తులకు, దేశాల పతనానికి దారితీస్తాయన్నారు. ఇలాంటి ధోరణులను మనమందమరమూ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూనే వుండాలని, ఈ ధోరణులు పెరిగి పెరిగి భారత్ కి చేరుకున్నా... వారికి అంతిమ సంస్కారాలు చేయాలని, అప్పుడు మాత్రమే అవి తగ్గుముఖం పడతాయని చరిత్ర చెబుతోందని అన్నారు.