గణేష్ ఉత్సవాల్లో కాంగ్రెస్ కావాలనే కుట్ర చేసింది : ఏబీవీపీ నేత ఝాన్సీ
ఉస్మానియా యూనివర్సిటీలో గత 30 సం.లుగా విద్యార్థులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే గణేష్ ఉత్సవాలను జరగకుండా అడ్డుకొని శోభయాత్రపై ఉద్దేశపూర్వకంగా దాడిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీ వత్తాసు పలకడం సిగ్గుమాలిన చర్య అని ఏబీవీపీ మండిపడింది. కాంగ్రెస్ నాయకులే స్వయంగా గాంధీ భవన్ నుండి FIR లో ఏ సెక్షన్ ఉండాలో సూచించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
గణేష్ నిమజ్జనం సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ ఓయూలోని అన్ని హాస్టల్ విద్యార్థులు నిమజ్జన కార్యక్రమంలో ఎంతో ప్రశాంతంగా, భక్తి శ్రద్దలతో శోభాయాత్ర జరుపుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి, ఉద్దేశపూర్వకంగా ఎలాగైనా శోభాయాత్ర జరగకుండా అడ్డుకొవాలనే కుట్రతో శోభాయాత్ర జరుపుతున్న ఆర్ట్స్ కళాశాల వద్దకు వచ్చి ఇష్టానుసారంగా గణేష్ శోభాయాత్ర ఫ్లెక్స్ ని చించి గణనాథుడిని మరియు విద్యార్థులను దుర్భాషలాడుతూ శోభాయాత్రని అడ్డుకొని విద్యార్థులపై దాడిచేయటం హేయమైన చర్య. విద్యార్థులు ఎంత వారించినా వినకుండా ఆకతాయిలు అమ్మాయిలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య బాధ్యులు శోభాయాత్రపై దాడి చేసిన దుండగులకు మద్దతుగా నిలుస్తూ దుండగుల అరాచకాలను అడ్డుకున్న విద్యార్థులపైనే హత్యాయత్నం కేసులు పెట్టేలా రాజకీయ ప్రమేయంతో పోలీసులను ప్రేరేపించడం ముమ్మాటికి అధికార దుర్వినియోగమే అని ఆమె అన్నారు.
మద్యం మత్తులో వచ్చి ఉత్సవాలను అడ్డుకుంటూ, ఓయూ విద్యార్థులపై అసభ్యకరంగా ప్రవర్తించిన దుండగులపై కేసులు నమోదు చేసి వెంటనే రిమాండ్ కి తరలించాలి. ఓయూ విద్యార్థులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణపతి ఉత్సవాల శోభయత్రను అడ్డుకొని విద్యార్థులపై దాడి చేసిన వారికి మద్దతుగా నిలిచి రాజకీయ ప్రమేయంతో పోలీసులపై ఒత్తిడి చేసి అక్రమ కేసులు బనాయించేలా ప్రేరేపించిన కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ హరిప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కళ్యాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్షిత, నగర కార్యదర్షులు దివ్యాలత, ఆకాశ్, సాయితేజ, ప్రణీత్, నవీన్, యోగేష్, మనీష్, మహాత్మ, శివ, అనిల్, పద్మజ, సహస్ర, అంజలి, దివ్య తదితరులు పాల్గొన్నారు.