Jamaat-e-Islami |
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఊహించని నిర్ణయాన్ని తీసుకుంది. మతతత్వ పార్టీ జమాత్ -ఇ- ఇస్లామీ, దాని అనుబంధ సమూహాలపై నిషేధాన్ని ఎత్తేసింది.
ఈ మార్పు భారత్ తో సంబంధాలపై గణనీయమైన మార్పు తీసుకొస్తుంది. నిజానికి మాజీ ప్రధాని షేక్ హసీనా జమాత్ ఇ ఇస్లామీపై నిషేధాన్ని విధించింది. ఉగ్రవాద కార్యకలాపాలలో జమాతే ఇస్లామీ ప్రమేయం వున్నట్లు నిర్దిష్టమైన ఆధారాలేవీ లేవని తాత్కాలిక ప్రభుత్వం పేర్కొనడం అత్యంత గర్హనీయం. మరోవైపు జమాత్ ఇ ఇస్లామీ రిజిస్ట్రేషన్ రాజ్యాంగ విరుద్ధమని భావించి 2013 లో కోర్టు ఎన్నికలలో పోటీ చేయకుండా సమర్థవంతంగా నిషేధించింది.
చట్టవిరుద్ధమని, న్యాయవిరుద్ధమని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం అత్యంత ఆవశ్యకమని భావించిన పార్టీ, తిరిగి తన రిజిస్ట్రేషన్ ను పునరుద్ధరించాలని ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తోంది. రాజకీయ కారణాలతోనే జమాతే ఇస్లామీపై హసీనా ప్రభుత్వం నిషేధం విధించిందని, అందుకే తాము ఎత్తేస్తున్నామని యూనుస్ ప్రభుత్వం పేర్కొంది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమలులోకి వస్తుందని బంగ్లాదేశ్ హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. మరోవైపు జమాతే అనుబంధ విద్యార్థి సంఘం ఛాత్ర్ శిబిర్ పై కూడా వేటును ప్రభుత్వం ఎత్తేసింది.
నిజానికి రాడికల్ మరియు టెర్రరిస్ట్ సంస్థలకు ఆశ్రయం కల్పించడంలో జమాతే ఇస్లామీ పేరు గాంచింది. ఇస్లామిస్ట్ గ్రూపులు చురుగ్గా వున్న మన దేశంలోని ఈశాన్య ప్రాంతంలో యాక్టివ్ అవుతున్న నేపథ్యంలో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ లో హిందూ వ్యతిరేక దాడులలో జమాతేనే కీలక పాత్ర పోషించింది.