'నిక్ ఫెర్రిస్' అనే యూకే కి చెందిన జర్నలిస్టు. ఇతను ముఖ్యంగా 'ఎనర్జీ' అంటే అన్ని రకాల ఇంధనాలు గురించి డాటా ఆధారంగా వివిధ అంతర్జాతీయ పత్రికలలో వ్యాసాలు రాస్తూ ఉంటాడు. ఇతను ప్రస్తుతం ఎనర్జీ మానిటర్లో సీనియర్ డేటా జర్నలిస్ట్.
ఈయన 'ఫ్యూచర్ రైల్' అనే మేగజైన్ కి భారతీయ రైల్వే ఎలెక్టరీఫికేషన్ గురించి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం తెలుగులో క్లుప్తంగా:
" కేవలం ఐదేళ్లలో భారతదేశం తన రైల్ నెట్‌వర్క్‌లో 45% విద్యుద్దీకరణ చేసింది" అంటూ నిక్ ఫెర్రిస్ రైల్ ట్రాక్ విద్యుదీకరణలో ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలను భారతీయ రైల్వే ఎలా అధిగమించిందో వివరిస్తూ వ్యాసం రాసాడు.
ఎలక్ట్రిక్ రైలు రవాణా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1925లో ముంబయి శివారు ప్రాంతాల నుండి నగరంలోకి త్వరితగతిన సబర్బన్ సేవలను అందించడానికి 16 కి.మీ. రైల్వే విభాగం విద్యుద్దీకరించబడింది.
1980ల వరకు, రైల్వే నెట్వర్క్ ఎక్కువగా ఆవిరితో నడిచేది. ఆధునికీకరణ ప్రయత్నాలు డీజిల్ లోకోమోటివ్ను ప్రవేశపెట్టాయి - అయితే డీజిల్ ఇంజిన్స్ వాడుక ఇంధన భద్రతకు సంబంధించిన కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఎందుకంటే ముడి చమురు కోసం భారత దేశం 80% దిగుమతులపై ఆధారపడుతుంది.
2014కి ముందు అన్ని సంవత్సరాలలో కలిపి అంటే 1947 నుండి 2014 వరకు అంటే 67 సం. లలో 21,801 కి.మీ ట్రాక్ విద్యుద్దీకరణ చేయబడితే... 2014 నుండి 2023 కి అంటే 9 సం. లలో దాదాపు 40,000 కి.మీ విద్యుదీకరించబడింది. 1 జనవరి 2024 నాటికి దేశంలో 94% లైన్లు విద్యుదీకరించబడ్డాయి
భారతీయ రైల్వే డేటా ప్రకారం, 2014 నుండి రైల్వే విద్యుదీకరణపై మొత్తం వ్యయం INR4.65 లక్షల కోట్లు కంటే ఎక్కువ. డీజిల్ లోకోమోటివ్‌లు పూర్తిగా ఉపసంహరించడానికి వాటిని ఎలక్ట్రిక్ సమానమైన వాటితో భర్తీ చేయడానికి కొంత సమయం పడుతుంది, కానీ ఇప్పటికే గణనీయంగా మారింది. డిసెంబర్ 2023 నాటికి 10,238 ఎలక్ట్రిక్ మరియు 4,543 డీజిల్ లోకోమోటివ్‌లు ఉన్నాయి.
ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు నెట్వర్క్ని కలిగి ఉన్న USలో విద్యుదీకరణ నత్త నడక వేగంతో జరుగుతోంది, ప్రస్తుతం US ట్రాక్‌లలో కేవలం 1% విద్యుదీకరించబడింది. 2045 సం.టార్గెట్ గా పెట్టుకుంది అమెరికా.
UKలో 2050 సం.టార్గెట్ గా పెట్టుకుంది. యూకే లో ప్రస్తుతం 38% ఎలక్ట్రిక్ వద్ద ఉంది. నెట్వర్క్ రైల్ ఏడాదికి 448కిమీ ట్రాక్‌ను విద్యుదీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే 2022లో కేవలం 2.2కిమీ మాత్రమే విద్యుదీకరించగలిగింది.
ఇంత పెద్ద రైల్వే నెట్ వర్క్ కల భారత్ లో ఇంత త్వరితగతిన విద్యుద్దీకరణ చేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అని ఢిల్లీకి చెందిన పరిశోధనా సంస్థ అయిన ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో అసోసియేట్ డైరెక్టర్ ఆయిన షరీఫ్ కమర్ చెప్పారు. ఈ విద్యుదీకరణ విజయానికి కీలకం నిధులు అందించడం, వేగంగా అనుమతులు ఇవ్వడం, వేగవంతమైన సేకరణ, నిర్మాణం కాకుండా మరియు ఖర్చు విషయం లోనూ నిర్ణయాలు తీసుకునే విషయం లో అధికారాల వికేంద్రీకరణ వల్లే ఇది సాధ్యపడింది అని షరీఫ్ కమార్ చెప్పారు అని నిక్ ఫెర్రిస్ వ్యాసం లో రాసాడు.
హై వే నెట్ వర్క్ వేగంగా పెంచుతున్నా లేదా రైల్వే విద్యుద్దీకరణ వేగంగా చేస్తున్నా వీటి వెనుక ముఖ్య ఉద్దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించి తద్వారా దేశ బడ్జెట్ పై భారం తగ్గించడం.
మోదీ ఆధ్వర్యంలో దేశంలో గత 10సం. లలో అన్ని ముఖ్య రంగాల్లో ఎంత వేగంతో పనులు జరుగుతున్నాయో మన మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రత్యేకంగా పేర్కొనడం లేదు, ముఖ్యంగా ప్రాంతీయ పత్రికలు అసలు పట్టించుకోవడం లేదు. అందుకే సామాన్య జనాలకు తెలియడం లేదు.
....చాడా శాస్త్రి.