జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘర్ వాపసీ కార్యక్రమం జరిగింది. దాదాపు 120 మందికి పైగా ప్రజలు తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చారు. బద్కఖుర్ద్ పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన 67 కుటుంబాల్లో వుండే 120 మంది యజ్ఞం నిర్వహించి, తిరిగి హిందూ మతాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి స్వామీజీలు, విశ్వహిందూ పరిషత్ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. క్రైస్తవం నుంచి తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చిన వారి పాదాలను పవిత్రమైన గంగాజలంతో కడిగి, స్వాగతించారు.
గతంలో తాము క్రిస్టియన్ మిషనరీల ప్రభావంలో పడి, సనాతన ధర్మానికి దూరమయ్యామని, ఇది తప్పు అని గ్రహించామని, స్థానిక హిందూ కార్యకర్తల సాయంతో తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించామని, చాలా ఆనందంగా వుందని ప్రకటించారు. స్థానికుల కథనం ప్రకారం క్రైస్తవాన్ని స్వీకరిస్తే వివిధ సౌకర్యాలు కల్పిస్తామని, డబ్బులిస్తామని మిషనరీలు మతమార్పిళ్లు చేశారని తెలిపారు. అంతేకాకుండా అనేక రకాల ప్రలోభాలు చూపించారన్నారు. కానీ.. కొన్ని రోజుల తర్వాత తాము అసలు విషయాన్ని గ్రహించి, పశ్చాత్తాపపడుతున్నామని, అందుకే తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేశామన్నారు.
ఈ పరిణామాలను విశ్వహిందూ పరిషత్ సాదరంగా స్వాగతించింది. వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ స్పందించారు. జార్ఖండ్‌లో ప్రబలమైన మతమార్పిళ్లు జరుగుతున్నాయన్నారు. మిషనరీల ప్రాబల్యం పెరుగుతోందని, చర్చిలు కూడా పెరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో చట్టవిరుద్ధమైన మతమార్పిళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఓ వైపు అక్రమ బంగ్లాదేశీ చొరబాట్లు, మరో వైపు మిషనరీల దాడి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం డీ-లిస్టింగ్ డిమాండ్‌ను సమీక్షించాల్సిందేనని బన్సల్ డిమాండ్ చేశారు.