రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ ప్రధాన సూత్రధారి, ఇస్లామిక్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరీ భారత్ టార్గెట్ గా ఓ సంచలన వీడియోను విడుదల చేశాడు. దీంతో భారత ప్రభుత్వం, నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.
భారత్ లోని రైళ్లపై దాడులు చేయాలని, రైళ్లే లక్ష్యంగా విధ్వంసానికి దిగాలని పిలుపునిచ్చాడు. అంతేకాకుండా హిందూ నేతలే టార్గెట్ గా బీభత్సానికి దిగాలని కూడా ఆ ఆడియోలో భారత్ లోని స్లీపర్ సెల్స్ కి సూచించాడు. రైళ్లు, పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు, ప్రెజర్ కుక్కర్లను ఉపయోగించి పేలుళ్లు జరపాలని కూడా పేర్కొన్నాడని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాక్ లో వుంటున్న ఫర్హతుల్లా ఘోరిపై భారత్ కొన్నేళ్లుగా నిఘా పెడుతోంది. రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ లో ప్రధాన సూత్రధారి అని నిఘా వర్గాలు పేర్కొన్నాయి కూడా. మరోవైపు ఈడీ, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ఆస్తులను జప్తు చేసిందని వీడియోలో పేర్కొన్నాడు. భారత ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా, తమ నెట్ వర్క్ కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడంలో విజయం సాధిస్తుందని వ్యాఖ్యలు చేశాడు.
అబూ సుఫియాన్, సర్దార్ సాహబ్, ఫరూ వంటి అనేక మారు పేర్లతో ఫర్హుతల్లా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తుంటాడు. అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తాడు.
1. 2002 లో అక్షరధామ్ ఆలయంపై దాడి చేయడంలో పాత్ర వున్నట్లు సందేహాలున్నాయి. ఈ దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 80 మందికి పైగా గాయాలపాలయ్యారు.
2. 2005 హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై దాడి : పోలీసు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని, జరిగిన ఆత్మాహుతి దాడిలో కూడా ఫర్హతుల్లా పాల్గొన్నాడు.
పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తో సన్నిహిత సంబంధాలను కలిగి వున్నాడు. చాలా సంవత్సరాలుగా ఫర్హతుల్లా భారత నిఘా సర్వీసుల రాడార్ లో వున్నాడు. మార్చి 1 న రామేశ్వరం కేఫ్ పేలుడు విషయంలో ఎన్ఐఏ ఇప్పటికే చురుగ్గా దర్యాప్తు చేస్తోంది. మరోవైపు ఫర్హతుల్లా ఘోరీ వీడియోపై ఎన్ఐఏ అప్రమత్తమైంది. వీడియోను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.