August 14: A fatal historical blunder...a wound of partition that still lingers today |
ఆగస్టు 14: ఘోరమైన చారిత్రక తప్పిదం
(ఆగస్టు 14 – దేశ విభజన విషాద స్మృతి దినం)
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్ర్యం సాధించుకోవడం చరిత్రాత్మకమే. భారత స్వాతంత్ర్యోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం మాత్రం రక్తపుటడుగుల మీదనే వచ్చిందనేది సత్యం. స్వాతంత్ర్యం, దేశ విభజన రెండూ ఏకకాలంలో జరిగాయి.
విభజించి విచ్ఛిన్నం చేయాలనే దుర్బుద్దితో అఖండ భారతాన్ని అశాస్త్రీయంగా భారత్, పాకిస్తాన్‌గా విడగొట్టారు. ఈ విభజన కారణంగా నాటి ప్రజలు పడ్డ బాధలు, విద్వేషాలు, హింసాగ్నిలో లక్షల ప్రజలు నిర్వాసితులు కావడం, మాన ప్రాణాలు కోల్పోవడం హిందుస్థాన్‌లో ఓ మహావిషాదం. మతపరంగా విభజన కోరిన ముస్లింలు పాకిస్థాన్ స్వాతంత్ర్య దినాన్ని ఆగస్టు14న పాటిస్తున్నారు. శవాల విషాదాల పునాదిగా జరిగిన విభజన దేశ చరిత్రలో ఓ చీకటి రోజు. 1947 ఆగస్టు 15 అర్థరాత్రి లభించిన భారత స్వాతంత్ర్యానికి సంబరాలు చేసుకోవాలో, విభజన విష వలలో చిక్కిన అమాయక ప్రాణాలను చూసి దు:ఖించాలో తెలియని దుస్థితి నాటి ప్రతి బాధ్యతగల భారతీయ పౌరుడిది.
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారు విజయం సాధించినా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇక నిలుపుకోలేమని గ్రహించారు…అప్పటికే భారత దేశమంతటా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు, పోరాటాలు పతాక స్థాయికి చేరాయి. ఇలాంటి పరిస్థితిలో భారతదేశాన్ని నిలుపుకోవడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చేశారు. కానీ యధాతథంగా స్వాతంత్ర్యం ఇచ్చేస్తే భారతదేశం నుండి ఏనాటికైనా తమకు ముప్పు అని భయపడ్డారు. ఇలాంటి కుట్రలోనే పురుడు పోసుకున్న విషాద ఘటనే దేశ విభజన.
బ్రిటిష్ వారి కుట్రకు పావులుగా దొరికారు కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులు. మహ్మద్ అలీ జిన్నాను దువ్వి ద్విజాతి సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు. ముస్లింల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయకుండా భారత దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే ఒప్పుకునేది లేదని పట్టుబట్టాడు జిన్నా. ఆయన ఇచ్చిన ప్రత్యక్ష చర్య పిలుపుతో దేశ వ్యాప్తంగా మత కల్లోలాలు చెలరేగి అమాయక ప్రజలు ఎందరో ఊచకోతకు గురయ్యారు. దేశ విభజన కోసం కాంగ్రెస్ నాయకులపై ఒత్తిడి పెరిగింది. అప్పటికే వీరిలో చాలా మంది వృద్ధులు..తమ జీవిత కాలంలో పదవులు అనుభవిస్తామో లేదో అనే బెంగ పట్టుకుంది వీరికి. పైకి ఇష్టం లేనట్లు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే దేశ విభజనకు మొగ్గు చూపారు.
భారతదేశం పట్ల కనీస జ్ఞానం లేని బ్రిటిష్ లాయర్ ‘సర్ సిరిల్ రెడ్‌క్లిఫ్’ అఖండ భారత పటం పై గీసిన దేశ సరిహద్దు గీతలు కోట్ల ప్రజల పట్ల పెనుశాపంగా మారింది. సువిశాల భారత విభజనతో భారత్, పాకిస్తాన్ ఏర్పడ్డాయి. ముస్లిములు అధికంగా ఉన్న పంజాబ్ ప్రాంతాన్ని వెస్ట్ పాకిస్తాన్, ముస్లింలు అధికంగా ఉన్న బెంగాల్ ప్రాంతాన్ని ఈస్ట్ పాకిస్తాన్‌గా వేరు చేశారు. 1947లో జరిగిన మన దేశ విభజన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద హింసాత్మక, రక్తం ప్రవహించిన అర్థరహిత రాజకీయ మానవ వలసగా చరిత్రకారులు పేర్కొంటారు. అశాస్త్రీయ మత రాజకీయాల ఆధారంగా చేసిన దేశ విభజనలో 2 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని 10 నుంచి 20 మిలియన్ల మానవ వలసలు జరిగాయని నాటి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక అంచనా వేసింది. వ్యాపార బుద్ధితో ప్రవేశించి, దేశ సంస్కృతీ వారసత్వాలను నాశనం చేసి, దేశ సంపదను పీల్చేసి, శవాల దిబ్బలను మిగిల్చి బ్రిటీష్ పాలకులు వెళ్ళిన దుర్దినమే ఆగస్టు 14. విభజన కాలంలో జరిగిన హింసాత్మక ఘటనలు, మారణహోమాలు భారతీయులపై చెరగని శాశ్వత మచ్చలుగా మిగిలిపోయాయి.
విభజనకు ముందే పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు జరగవచ్చని అందరూ భావించారు. అయినా కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడమే అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. స్వాతంత్ర్యం కోసం వేలాది మంది విప్లవకారులు తమ సర్వస్వాన్ని వదిలేశారు. బలిదానం చేశారు. జైళ్లకు వెళ్లారు. అటువంటిది 1947లో కాంగ్రెస్, ముస్లిం లీగ్ నాయకులకు ఆంగ్లేయులు ఎలా స్నేహితులు అయ్యారనేది సగటు భారతీయుడిని నేటికీ వేధిస్తూనే ఉంది. జవహర్ లాల్ నెహ్రూకు విభజన అనేది ఒక ఆటగా మారిందా…ఆయన కేవలం జిన్నాను వదిలించుకోవడం కోసమే దేశ విభజనకు ఒప్పుకున్నారా..లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి అవకాశం ఇచ్చాడా..?? అంటే ఔననే సమాధానం చెప్పాలి. ఏదిఏమైనా, దేశ విభజన సమయంలో జరిగిన రక్తపాతం, హింసోన్మాదానికి, అరాచక అకృత్యాలకు బలైన భరతమాత బిడ్డలను స్మరించుకోవాలనే సదభిప్రాయంతో ప్రతి ఏటా ఆగస్టు 14న విభజన విషాద స్మృతి దినం పాటించాలని నిర్ణయించడం సముచితమే కాదు హర్షదాయకం కూడా. భరతమాత బిడ్డలుగా, దేశభక్తి ఉప్పొంగే పౌరులుగా మనందరం ప్రతి ఏటా ఆగస్టు 14న విభజన విషాద స్మృతి దినం పాటించడం మన కనీస కర్తవ్యంగా భావిద్దాం. ముక్కలైన మనదేశం ఒక్కటైయ్యేందుకు కృషి చేద్దాం..అమ్మ భారతి కడుపుకోతను కొంతైనా తీరుద్దాం.
జై హింద్