అర్చకుల సంక్షేమానికి కృషి చేయండి
అర్చకుల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని అర్చక సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. ధూపదీప నైవేద్య పథకం (డీడీఎన్ఎస్), డెత్ గ్రాట్యూటీ కోసం అర్చకులు ఎదురు చూడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం అనంతపురంలోని మొదటిరోడ్డులో ఉన్న కాశీవిశ్వేశ్వర కోదండరామాలయం వేదికగా జిల్లా అర్చక సమాఖ్య సమావేశం జరిగింది.
ఉమ్మడి జిల్లాల అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. డీడీఎన్ఎస్ కింద ఉమ్మడి జిల్లాలోని 898 దేవాలయాల్లో అర్చనలు కొనసాగుతున్నా… పలు కారణాలతో పథకం లబ్ధి అందకుండా పోయిందని తెలిపారు. రెండేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా అదనంగా 475 దేవాలయాలను ధూపదీపనైవేద్యం పథకానికి ఎంపిక చేశారని, అయితే అనేక కారణాలను చూపుతూ ఆర్థిక సహకారం నిలిపి వేయడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఎండోమెంట్ సిబ్బంది కొరతను సాకుగా చూపి ఆలయాలపై పర్యవేక్షణ లేకుండా చేయడాన్ని తప్పుబట్టారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డిపల్లి రాజేష్, మారుతీప్రసాద్, ముచ్చుకోట ప్రసాద్, భక్తరహళ్లి వేణుగోపాలస్వామి, రెండు జిల్లాలకు చెందిన అర్చకులు పాల్గొన్నారు.