శ్రీరామ |
సుఖశాంతిమయ జీవితయాత్రకు చిత్తశుద్ధి- విజ్ఞాన సంవద (తపఃస్వాధ్యాయాలు) రెండూ అవసరమే. చిత్తశుద్ధితో కూడిన విద్యా సంస్కారం జీవిత వికాసానికి మూలకందమనే సందేశాన్ని ప్రబోధిస్తూ రామాయణం ప్రవృత్త మయింది.
ఇలాంటి విద్యాసంపత్తి సద్గురు ప్రబోధం లేకుండా సిద్ధించదు. తపస్వి అయిన వాల్మీకి మహర్షికి కూడా నారదరూపంలో సద్గురు ప్రబోధం ఆవశ్యకమైంది. అలాంటి గురు ప్రబోధంతో ప్రబుద్ధుడై వాల్మీకి క్రమంగా కవితాశాఖను అధిరోహించి రామచరితాన్ని మధురంగా గానంచేసి ‘కోకిల’గా జగత్ప్రసిద్ధి పొందారు.
యస్య దేవే పరా భక్తిః యథా దేవే తథా గురౌ
తస్యైతే కధితా హ్యర్థాః ప్రకాశస్తే మహాత్మనః’
అనే శ్వేతాశ్వతర శ్రుతి సందేశాన్నే రామాయణ ఆరంభాన్ని సూచిస్తోంది. ఈ శ్రుత్యర్థాన్నే మహాకవి విశ్వామిత్ర పాత్ర ద్వారా వివరించాడు.
యథా రాజా తథా ప్రజా కనుకనే ఆచార్యుడై విశ్వామిత్ర మహర్షి కాబోవు ప్రభువగు శ్రీరాముని విషయంలో ప్రత్యేక శ్రద్ధ అడుగడుగున చూపాడు. లక్ష్మణుడు శ్రీరాముని అనుచరుడు. శ్రీరాముడు కర్తవ్య నిర్వహణకు పూనుకుంటే లక్ష్మణుడు తనంతటతానే రాముని అనుసరిస్తాడు. ప్రజా పాలకులకే క్రమశిక్షణ ముందు అవసరం. కనుకనే విశ్వామిత్రుడు శ్రీరాముని విషయంలో శ్రద్ధ చూపాడు. భావి ప్రజా పాలకులకు గురుముఖంగా క్రమశిక్షణ అనేది అనాది సిద్ధమైన భారతీయ సంప్రదాయం కదా! తుదకు రాజపుత్రుని వివాహం కూడా తానే జరిపించి ‘యత్రధాతా గ్రహీతా చ స్వయం కుశిక వందనః’ అనే ఖ్యాతిని గడించాడు. కాబట్టి ప్రజా పాలకులకు చిన్నతనము నుండి కర్తవ్య నిర్వహణలో క్రమశిక్షణ- ఉత్తమ విద్యా సంపత్తి (తపః స్వాధ్యాయములు) ఎంత అవసరమో ఈ ఆదికావ్యం ప్రబోధిస్తోంది.
శ్రీమద్ రామాయణాన్ని కొనేందుకు ఇక్కడ నొక్కండి : HinduEShop