Mocking Hindus has become fashionable... PM Modi |
హిందువులను పరిహసించడం ఫ్యాషన్‌గా మారిపోయింది... వందల ఏళ్లు గుర్తుంటాయ్!
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపైన, హిందూమతంపైన తప్పుడు ఆరోపణలు చేయడం తీవ్రమైన విషయమని, ఆయనను దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు మోదీ మంగళవారం (జూన్ 02) సాయంత్రం లోక్‌సభలో బదులిస్తూ "హిందువులను హింసాత్మకులు అంటారు.. ఇవేనా మీ విలువలు? ఇదేనా మీ వ్యక్తిత్వం? ఇదేనా ఈ దేశ హిందువులపై మీకున్న ద్వేషం?" అని ప్రశ్నించారు. హిందువులపై రాహుల్ వ్యాఖ్యలను ఈ దేశం వందల ఏళ్ల పాటు మర్చిపోదన్న ప్రధాని... హిందూ ఉగ్రవాదమనే పదాన్ని వాడటం, హిందూ మతాన్ని డెంగ్యూ, మలేరియా మొదలైనవాటితో పోల్చడం, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు చెయ్యడం తీవ్రమైన కుట్ర అన్నారు. ఈ అవమానం యాదృచ్చికమా లేక డిజైన్‌లో భాగమా? అని ప్రధాని మోదీ నిలదీశారు.
హిందూమతం గొప్పదనం, వైభవం గురించి ప్రపంచ మేథావుల సమక్షంలో స్వామి వివేకానందులు 131 ఏళ్లకు ముందు అమెరికాలోని షికాగోలో వివరించారని, హిందువులు సహనశీలురు కనుకనే మన దేశంలో వైవిధ్యం నడుమ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని ప్రధాని మోదీ తెలిపారు. హిందూమతాన్ని, భారతీయ సంస్కృతిని అవమానిస్తూ, హిందువులను పరిహసించడం ఫ్యాషన్‌గా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులను హింసావాదులనడం సంస్కారమేనా... అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ సోమవారం లోక్‌సభలో బిజెపిపై దాడి చేస్తూ “హిందువులమని చెప్పుకునే వారు హింస… ద్వేషం… 24 గంటలూ అసత్యం మాట్లాడతారు” అని దుమారం రేపారు. ఆ వ్యాఖ్యలపై ఈ విధంగా తీవ్రస్థాయిలో ప్రధానమంత్రి ప్రతిస్పందించారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను రాజకీయాలకు ఆయుధంగా మార్చుకుందని విమర్శించారు.
“అగ్నివీర్పైన, ఎంఎస్‌పిల గురించి కూడా సభకు అబద్ధాలు చెప్పారు. సభ గౌరవం దెబ్బతినడం సభ దురదృష్టం. 60 ఏళ్లుగా ఇక్కడ కూర్చుని ప్రభుత్వ పనితనం తెలిసిన పార్టీ ఎప్పుడూ అయోమయ మార్గాన్ని ఎంచుకుంటుంది. దేశం ప్రమాదకరమైన దిశలో పయనిస్తోందనడానికి ఇది రుజువు” అంటూ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. ఇది దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసిన మన స్వాతంత్ర్య సమరయోధులను అవమానించడమే అని ప్రధాని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి పథాన్ని ఎంచుకుంటున్నా కాంగ్రెస్ మాత్రం గందరగోళం చెలాయించడమే పనిగా పెట్టుకుందని మోదీ ధ్వజమెత్తారు.
“వారు (కాంగ్రెస్ పార్టీ) దక్షిణాదిలో ఉత్తరాదికి వ్యతిరేకంగా, ఉత్తరాదిలో పశ్చిమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మతం ఆధారంగా విభజించడానికి ప్రయత్నించారు. దేశ విభజనను సమర్థించిన వారికి ఎన్నికల టిక్కెట్లు కూడా ఇచ్చారు. వారు ఆర్థిక గందరగోళాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వారు దేశాన్ని ఆర్థిక సంక్షోభం వైపుకు తీసుకువెళుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి, దేశంలో అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు” అంటూ ప్రధాని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రతి మహిళకు నెలకు రూ.8,500 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామన్న కాంగ్రెస్ ప్రచార హామీని మోదీ ఎండగడుతూనే, ఈవీఎంలు, రాజ్యాంగం, రిజర్వేషన్లు, రాఫెల్, హెచ్ఏఎల్, ఎల్ఐసీ, బ్యాంకుల గురించి కూడా కాంగ్రెస్ అబద్ధాలు చెప్పిందని మండిపడ్డారు.
అందరికీ న్యాయం అందించడమే తమ మంత్రమని, ఎవరినీ బుజ్జగించబోమని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పరిపక్వతతో కూడిన తీర్పు ఇచ్చారని అంటూ దేశ ప్రజలంతా తమవైపే ఉన్నారని భరోసా వ్యక్తం చేశారు. అబద్ధాలతో మభ్యపెట్టాలని చూసిన వారిని ప్రజలు ఓడించారని, తమ పదేళ్ల పాలన చూసి తమకు మరోసారి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. గత పదేళ్ల ప్రభుత్వంలో 25 కోట్ల మంది పేదలకు దారిద్య్రం నుంచి విముక్తి కల్పించామని, అవినీతిరహిత పాలన అందించామని మోదీ చెప్పారు. ప్రజలు తమ పాలన, ట్రాక్ రికార్డు చూశారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దశాబ్దంలో భారత్ ఖ్యాతి మరింత పెరిగిందని మోదీ వివరించారు.
రాష్ట్రపతి ప్రసంగంలో వికసిత్ భారత్ లక్ష్యాలను వివరించారని, ఈ దిశగా తమ ప్రస్ధానం సాగుతుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. "నేషన్ ఫస్ట్" అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు ఎంపీలు తమ అభిప్రాయాలను వెల్లడించారని, వీరిలో కొందరు తొలిసారి ఎంపీలు అయినవారు కూడా ఉన్నారంటూ... వీరు పార్లమెంట్ నిబంధనలను అనుసరిస్తూ, అనుభవం కలిగిన పార్లమెంటేరియన్లలా వ్యవహరించడం సంతోషకరమన్నారు. వీరు తొలిసారి చట్టసభలకు ఎన్నికైనప్పటికీ... సభ హుందాతనాన్ని పెంచేలా ప్రవర్తించారని ప్రశంసించారు. వారి అభిప్రాయాలతో చర్చను మరింత ఫలప్రదం చేశారని పేర్కొన్నారు.
లౌకిక వాదం అంటే సామాజిక న్యాయం పాటించడమని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలు తమపై భరోసా ఉంచారని పేర్కొంటూ వికసిత్ భారత్‌తో ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పథకాలు సామాన్యులకు చేరుతున్నాయని చెప్పారు. ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకున్న విపక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాల నిరసనల మధ్యే తన ప్రసంగాన్ని కొనసాగించారు. మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష సభ్యులు పదేపదే అడ్డుతగిలారు. విపక్ష సభ్యుల తీరుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులను వెల్‌లోకి పంపేలా విపక్ష నేతలు వ్యవహరించడం సరైంది కాదని హితవు పలికారు.
__VSK Telangana