ఆర్ఎస్ఎస్ |
ఆ కేసు వల్లే ఆర్ఎస్ఎస్లో ప్రభుత్వోద్యోగుల చేరికపై నిషేధం ఎత్తివేత!
ప్రభుత్వోద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనరాదని 58 ఏళ్ళ క్రితం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ జారీచేసిన ఉత్తరువును తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో రాజకీయ దుమారం చెలరేగింది.
ఇటీవల ఎన్నికల్లో అనుకున్న విధంగా ఫలితాలు సాధింపలేక పోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆర్ఎస్ఎస్ను ప్రసన్నం చేసుకునేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీచేసిందని అంటూ రకరకాల వాఖ్యానాలు మీడియాలో వెలువడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. అయితే ఈ ఆదేశాలను స్వాగతించిన ఆర్ఎస్ఎస్, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ముందు ఎటువంటి ప్రతిపాదనను ఉంచలేదని స్పష్టం అవుతుంది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాజకీయ కారణాలతో ఈ ఉత్తర్వు జారీచేయలేదని తెలుస్తున్నది. కేవలం మధ్యప్రదేశ్‌లో ఉద్యోగ విరమణ చేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు ఆర్ఎస్ఎస్ కార్యక్రలాపాలలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతూ మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఉత్తరువును జారీ చేయాల్సి వచ్చింది.
ఈ పిటిషన్ పై తన అభిప్రాయం తెలపాలని మధ్యప్రదేశ్ హైకోర్టు జారీచేసిన ఆదేశాలకు బదులుగా జులై 10న కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో ఓ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దానిని దాఖలు చేసేముందు ఆర్ఎస్ఎస్ను రాజకీయ సంస్థల జాబితా నుండి తొలగిస్తూ ఉత్తరువు జారీచేయడం ద్వారా గతంలో జారీ చేసిన నిషేధపు ఉత్తరువు ఆర్ఎస్ఎస్కు వర్తింపకుండా కేంద్రం వ్యవహరించింది.
ఇండోర్‌కు చెందిన రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ అధికారి పురుషోత్తం గుప్తా సెప్టెంబర్ 2023లో ఈ విషయమై హైకోర్టు తలుపులు తట్టాడు. ఆర్ఎస్ఎస్లో చేరకుండా తనను నిరోధించే నియమాలు తన ఆకాంక్షలు తీర్చుకోవడానికి ఆటంకం కలిగిస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. గుప్తా తన పదవీ విరమణ తరువాత, “తన జీవితంలో మిగిలిన సంవత్సరాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో క్రియాశీల సభ్యునిగా చేరాలని భావిస్తున్నట్లు” తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్ చేపట్టే సామాజిక, సాంస్కృతిక, ధార్మిక పరమైన కార్యక్రమాల్లో సమగ్రంగా భాగస్వామి కావాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అయితే, కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ గతంలో (ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో) జారీ చేసిన ఉత్తరువు తనకు ప్రతిబంధకంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన తరపు న్యాయవాది మనీష్ నాయర్ వాదించారు, గుప్తా ఆర్ఎస్ఎస్లో చేరడాన్ని నిషేధించే నిబంధనలు ఆయన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని వాదించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్వేచ్ఛ ఉన్నందున వివక్ష ఉందని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే నిషేధించారని గుప్తా న్యాయవాది వాదించారు. ఈ పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడంతో కేసు పెండింగ్‌లో ఉండటంపై విచారణ సందర్భంగా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు రికార్డుల ప్రకారం, ఈ కేసును ఆరు పర్యాయాలు విచారించారు. ప్రతిసారీ, యూనియన్ ఆఫ్ ఇండియా తన సమాధానం దాఖలు చేయడానికి మరింత సమయం కోరుతూ వచ్చింది.
మే 22న, భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు కార్యదర్శి మనోజ్ కుమార్ ద్వివేది, హోం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ వశిష్టలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. నాలుగు వారాల వ్యవధిలో సమాధానం దాఖలు చేస్తామని వారు కోర్టుకు హామీ ఇచ్చారు. దానికి కోర్టు అనుమతించింది. “జూలై 10న, కేంద్ర ప్రభుత్వం తన ఆంక్షలను ఎత్తివేసిందని, ఆర్ఎస్ఎస్ను ఆ ఉత్తరువు నుండి తొలగించిందని తెలియజేస్తూ మేము కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేశాము” అని ఆ న్యాయవాది తెలిపారు.
“మా సమాధానంలో, ప్రభుత్వం ఆంక్షలను తొలగించిందని, ఆరోపించిన ఉత్తరువు నుండి ఆర్ఎస్ఎస్ పదాన్ని కేంద్రం తొలగించిందని మేము తెలియచేసాము” అని వివరించారు. ప్రభుత్వ అధికారులు పాల్గొనడంపై నిషేధం ఉండే ఓ రాజకీయ సంస్థ జాబితా నుండి ఆర్ఎస్ఎస్ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించిందని స్పష్టం చేశారు.
కాగా, 2006లో, శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మధ్యప్రదేశ్ లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఆంక్షలను తొలగించిందని కూడా ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఈ కేసు మధ్య ప్రదేశ్ కోర్టులో ఇంకా పెండింగ్ లో ఉంది. కోర్టు తీర్పు జారీ చేయాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి సంబంధించిన అంశాలను చూసే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి), 1966, 1970, 1980లలో ఈ విషయంలో జారీ చేసిన సూచనలను పేర్కొంటూ, ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంపై జూలై 9న ఉత్తర్వులు జారీ చేసింది. “సమీక్ష జరిపిన అనంతరం ఆ ఉత్తరువు నుండి ఆర్ఎస్ఎస్ పేరు తొలగించాలని నిర్ణయించింది” అని తెలిపారు.
1998 వరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగంగా ఉన్న డిఓపిటి, ఇప్పుడు సంబంధిత క్యాబినెట్ మంత్రిగా నేరుగా ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. యాదృచ్ఛికంగా, ఆర్ఎస్ఎస్ను “రాజకీయ” సంస్థగా గుర్తించే ఆ ఉత్తరువులో ఇంకా జమాత్-ఇ-ఇస్లామీ ప్రస్తావన ఉంది. జులై 9 నాటి ఉత్తరువులో ఆ సంస్థ పేరును తొలగించలేదు.
1964 నుండే ఆంక్షలు ప్రారంభం
1964లో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్ “ఏ ప్రభుత్వోద్యోగి ఏ రాజకీయ పార్టీ లేదా రాజకీయాలలో పాల్గొనే ఏ సంస్థలో అయినా సభ్యుడుగా ఉండకూడదు లేదా సంబంధం కలిగి ఉండకూడదు” అని పేర్కొంది. దీని తరువాత, ఈ నిబంధనల ప్రకారం ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు సంబంధించి వివరణ కోరుతూ అనేక దరఖాస్తులు వచ్చాయి.
1966లో, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సర్క్యులర్ ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్, జమాత్-ఇ-ఇస్లామీ లలో సభ్యత్వం లేదా కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంబంధించి ఈ విధానం గురించి “నిర్దిష్ట సందేహాలు”ను లేవనెత్తారు. “ఈ రెండు సంస్థల కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనడం ప్రవర్తన నియమావళి 5లోని ఉప నిబంధన (1) ప్రకారం అభ్యంతకరమైనదే. అటువంటివారు క్రమశిక్షణ చర్యలకు అర్హులు” అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇంకా, సివిల్ సర్వీసెస్, ప్రభుత్వ పోస్టులకు నియామకం కోసం నియమాల బ్రోచర్ “మత సంస్థల కార్యకలాపాలలో (ఈ రెండు సంస్థలతో సహా) పాల్గొనడం”పై హెచ్చరిస్తూ ఆ విధంగా పాల్గొనేవారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తున్నట్లు తేల్చి చెప్పింది. జూలై 1970లో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజకీయ కార్యకలాపాలపై (ప్రభుత్వ ఉద్యోగుల) ఆంక్షలను పునరుద్ఘాటించింది.
ఎమర్జెన్సీ సమయంలో నిషేధం
1975-77 ఎమర్జెన్సీ సమయంలో, ఆనంద్ మార్గ్, సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ వంటి సంస్థలతో పాటు ఆర్ఎస్ఎస్, జమాతే ఇస్లామీలపై నిషేధం విధించి, ఆయా సంస్థల నేతలను అరెస్ట్ చేశారు. అక్టోబర్ 1980లో, ఇందిరాగాంధీ తిరిగి ప్రధానమంత్రి అయ్యాక, ప్రభుత్వం 1966 ఆంక్షలను పునరుద్ఘాటిస్తూ ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.
అందులో ఇలా పేర్కొంది: “దేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగులపై లౌకిక దృక్పథాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏ మతపరమైన సంస్థకు ఎలాంటి ప్రోత్సాహం అందించకూడదు. ఏదైనా నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్య చర్యగా పరిగణించాలి”.
గత బీజేపీ ప్రభుత్వాలలో ఇటువంటి ఆంక్షలను తొలగించే ప్రయత్నం జరగలేదు. ఆ విధంగా తొలగించాలని ఆర్ఎస్ఎస్ సహితం వత్తిడి తెచ్చిన సందర్భం లేదు.
నవంబర్ 27, 2014న, సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ప్రవర్తనా నియమాలను సవరించి, “ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అన్ని వేళలా రాజకీయ తటస్థతను కొనసాగించాలి” అని స్పష్టం చేసింది.
సంఘ్ కార్యకలాపాల్లో చేరేందుకు ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కోరుతున్నారా? అనే ప్రశ్నలను ఈ సమయంలోనే ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డా. మోహన్ భగవత్ ఎదుర్కొన్నారు. డిసెంబర్ 1, 2014న హర్ద్వార్లో జరిగిన సమావేశంలో భగవత్ ఇలా అన్నారు: “హమ్ సర్కార్ సే కోయి మాంగ్ నహిన్ కర్నే జా రహే. హమ్ అప్నా కామ్ కర్ రహే హై. హమారా కామ్ ఐసే కిసీ అవ్రోధోన్ సే నహిన్ రుక్తా (మేము ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఏమీ డిమాండ్ చేయబోవడం లేదు. మేము మా పని చేస్తున్నాము. మా పని ఎప్పుడూ అలాంటి ఆంక్షల వల్ల ప్రభావితం కాదు).”
__vsktelangana