పాస్టర్ ఫిర్యాదుతో పురాతన ఆలయం కూల్చివేత... బాగుచేసి పూజలు నిర్వహించిన హిందువులు
ఓ క్రిస్టియన్ పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో 60 ఏళ్ల పురాతనమైన దత్తాత్రేయ మందిరాన్ని పూణేలో అధికారులు కూల్చేశారు. పూణె ఎరంద్వానేలోని సత్యం ఎస్టేట్ సమీపంలో ఈ పురాతన దత్తాత్రేయ ఆలయం వుంది. పురాతన ఆలయాన్ని కూల్చేయడంపై స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు దేవాలయాన్ని ఎందుకు కూల్చారు? అర్ధరాత్రి కూల్చాల్చిన అవసరం ఏముంది? అంటూ అధికారులను సూటిగా నిలదీశారు. అయితే.. హిందువులు ఇన్ని ప్రశ్నలు వేసినా... ఆగ్రహం వ్యక్తం చేసినా.. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ విషయం తెలియగానే విశ్వహిందూ పరిషత్ నాయకులు కూల్చివేతను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు భారీగా చేరుకొని, వారిని అడ్డుకున్నారు.
అధికారులు విచక్షణారహితంగా కూల్చేశారని, ఎలాగైనా తాము అక్కడే ఆ మందిరాన్ని పునర్నిర్మిస్తామని స్థానిక హిందువులు శపథం చేశారు. అన్నట్లుగానే హిందువులందరూ సంఘటితమై.. ఆలయాన్ని తిరిగి బాగు చేశారు. అక్కడే దత్తాత్రేయ మూర్తిని మళ్లీ ప్రతిష్ఠించారు. హారతి కూడా ఇచ్చి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. పూణె ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన మసీదులు, సమాధులు కూడా వున్నాయని, మరి వాటిని ఎందుకు కూల్చేయరని ప్రశ్నించారు. శివాజీ మహారాజ్ చారిత్రక కోటలపై అక్రమంగా మసీదులు, సమాధులు నిర్మించారని, మరి వాటి సంగతి ఏంటని మండిపడుతున్నారు. ఒకే ఒక్క పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఎలా కూల్చేస్తారంటూ హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు.