Bajrang dal |
చిలుకూరు బాలాజీ దేవాలయ పవిత్రతను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు : బజరంగ్ దళ్ హెచ్చరిక
చిలుకూరు బాలాజీ దేవాలయ పవిత్రతను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు వుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బజరంగ్ దళ్ తీవ్రంగా హెచ్చరించింది. చిలుకూరు బాలాజీ పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును తొలగించాలని బజరంగ్ దళ్ తేల్చి చెప్పింది. చిలుకూరు రెవెన్యూలో ఓ భూమిని వక్ఫ్‌భూమి అని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, చిలుకూరు బాలాజీ దేవాలయానికి 2 కిలోమీటర్ల పరిసర ప్రాంతాలలో అన్యమతాలకు సంబంధించిన ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని డిమాండ్ చేస్తూ బజరంగ్ దళ్ మెరుపు ధర్నాకి దిగింది. ఈ సందర్భంగా బజరంగ్ నేతలు మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును తొలగించాలని డిమాండ్ చేశారు. ముస్లిం పక్షపాత కాంగ్రెస్ ప్రభుత్వ దమన నీతిని ఎండగడతామని హెచ్చరించారు. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రభుత్వం దిగివచ్చి, అక్రమ కట్టడాలను తొలగించింది.
అయితే.. ప్రైవేట్ స్థలాన్ని వక్ఫ్ భూమి అంటూ తప్పుడు నివేదిక అందించిన స్థానిక తహశీల్దార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు డిమాండ్ చేశారు. ముస్లిం ఎమ్మెల్సీకి తలొగ్గి, ఆ స్థలంలో బోరు వేయించడం, పోలీసులే దగ్గరుండి స్థానికులను భయ భ్రాంతులకు గురిచేసి, నిర్మాణాలను చేపట్టడం దుర్మార్గమన్నారు. మరోసారి కుట్రలకు పాల్పడితే హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు.
మరోవైపు చిలుకూరు బాలాజీ ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో అన్యమతాలకు సంబంధించిన ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని పద్ధతే ఇక్కడా అమలు అవుతోందన్నారు. తిరుమలలోని వేంకటేశ్వర స్వామి చిలుకూరులో స్వయంభువుగా వెలిశారని, అందువల్ల.. అక్కడ ఎలాంటి నియమాలు వున్నాయో... చిలుకూరు దేవాలయానికి కూడా అవే వర్తిస్తాయని తెలిపారు. ఈ పద్ధతిని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు, రెవిన్యూ ఇతర శాఖలపై వుందన్నారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే దృష్టి సారించి 2 కిలోమీటర్ల పరిధిలో అన్యమతాలకు చెందిన ప్రార్థనా నిర్మాణాలను ఆపేయాలని కోరారు. లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.