బ్రిటిష్ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన కొండలూ, అడవులూ ఎక్కువే. దక్షిణ భారతదేశంలో మాత్రం అంత ఖ్యాతి ఉన్న గిరిజనోద్యమం విశాఖ మన్యంలోనే జరిగింది. ఆ మహోద్యమానికి నాయకుడు అల్లూరి శ్రీరామరాజు (జూలై 4, 1897 – మే 7, 1924).
శ్రీరామరాజు ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 1745 నాటి చౌర్స్ (బెంగాల్) తిరుగు బాటు భారతభూమిలో తొలి గిరిజనోద్యమం. 1922-24 మధ్య విశాఖ మన్యంలో జరిగినది తుది గిరిజన పోరాటం. కానీ మిగిలిన ఉద్యమాల చరిత్ర మీద ప్రసరించిన వెలుగు రామరాజు పోరు మీద కానరాదు.
చోటానాగ్పూర్, రాంచీ పరిసరాలలో ముండా గిరిజన తెగ బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసింది. దీనినే ఉల్గులాన్ అంటారు. బీర్సా ముండా ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. ఇది 1899-1900 మధ్య కొన్ని నెలలు జరిగింది. బీర్సా జీవితం, ఉద్యమం అద్భుతమైన విషయాలు. కానీ ఆయన ఉద్యమం పది నెలలు మాత్రమే సాగింది. రెండు జిల్లాల పోలీసు యంత్రాంగాన్ని సమీకరించి ఆ ఉద్యమాన్ని బ్రిటిషర్లు అణచివేశారు. కానీ రామరాజు ఉద్యమం ఆగస్ట్ 22, 1922న చింతపల్లి (విశాఖ మన్యం) పోలీసు స్టేషన్ మీద దాడితో మొదలై, మే 7, 1924 వరకు ఉదృతంగా సాగింది. ఆ తరువాత కూడా మరో నెలపాటు రామరాజు ప్రధాన అనుచరుడు గాం గంతన్న ఉద్యమాన్ని నడిపించాడు. కానీ, దీనిని గుర్తించడానికి గొప్ప ప్రయత్నమేదీ జరగలేదు.
విశాఖ మన్య విప్లవం తెలుగు వారి చరిత్రలో, ఆ మాటకొస్తే భారత గిరిజనోద్యమ చరిత్రలోనే అద్భుత ఘట్టం. రామరాజు చరిత్ర, ఉద్యమం తనకు ప్రేరణ ఇచ్చిందని ఆదిలాబాద్ ప్రాంత గోండు ఆదివాసీ ఉద్యమనేత కొమురం భీం (1940) కూడా ప్రకటించాడు. మరణానంతరం రామరాజు ఔన్నత్యాన్ని గాంధీజీ, సుభాశ్‌బోస్, భోగరాజు పట్టాభిసీతారామయ్య, మద్దూరి అన్నపూర్ణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు వంటివారంతా గుర్తించి నివాళులర్పించారు.
వేంకటరామరాజు, సూర్యనారాయణమ్మ దంపతుల తొలి సంతానం అల్లూరి శ్రీరామరాజు. ఆయనకు సోదరి (సీత), సోదరుడు (సత్యనారాయణ రాజు) కూడా ఉండేవారు. శ్రీరామరాజు విశాఖ జిల్లా భీమిలికి సమీపంలో ఉన్న పాండ్రంగిలో అమ్మమ్మ గారింట పుట్టారు. వేంకటరామరాజు స్వస్థలం ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న మోగల్లు. ఆయన పేరు ప్రజలలో సీతారామ రాజుగా స్థిరపడి ఉండవచ్చు. కానీ జాతక చక్రంలో, తరువాత ప్రభుత్వ రికార్డులలో కనిపించేది శ్రీరామ రాజు అనే. ఒక చరిత్ర పురుషుడి అసలు పేరును కూడా అందరికీ తెలిసేటట్టు చేయకపోవడం చరిత్ర అధ్యయనానికి సంబంధించి తప్పిదమే. అందుకే ఈ వివరణ. శ్రీరామరాజు జీవితంలో సీత అనే మహిళ ఉన్నట్టు చెప్పడం కూడా సరికాదు. అందుకు ఆధారాలు లేవు.
శ్రీరామరాజు 1917, శ్రావణ మాసంలో విశాఖ జిల్లాలోని కృష్ణదేవిపేట వచ్చారు. అక్కడ చిటికెల భాస్కరనాయుడు అనే చిన్న భూస్వామి ఇంట చాలా కాలం ఉన్నారు. అక్కడ ఉండగానే గిరిజనులు పడుతున్న ఇక్కట్లు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రధానంగా రోడ్డు నిర్మాణంలో చింతపల్లి, లంబసింగి వద్ద జరుగుతున్న ఘోరాలు తెలిశాయి. గూడెం డిప్యూటీ తహసీల్దారు అల్ఫ్ బాస్టియన్ గిరిజనులను దోపిడీ చేస్తూ రోడ్డు పని చేయించాడు. ఈ బాధలకు తోడు అడవిని రిజర్వు చేయడం గిరిజనుల ఉనికికే ప్రమాదకరంగా పరిణమించింది. మన్యం మునసబులను, ముఠాదారులను, గ్రామ పెద్దలను లొంగ దీసుకోవడం, మోసగించడం బాస్టియన్‌కు నిత్యకృత్యం. గాంగంతన్న బట్టిపనుకుల మునసబు. అలాగే పెద్ద వలస ముఠాదారు ఎండుపడాలు. ఈ ఇద్దరినీ కూడా బాస్టియన్ మోసగించాడు. ఈ మొత్తం అసంతృప్తి ఆగ్రహంగా మారి, ఆపై ఉద్యమ రూపం దాల్చింది. దీనికి ఇరుసుగా పనిచేసిన వారే శ్రీరామరాజు.
గూడెం ముఠా (ఒక రెవెన్యూ ప్రాంతం), పెద్దవలస ముఠా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచాయి.
ఉద్యమం ఆరంభానికి ముందు శ్రీరామరాజు గిరిజనులలో సంస్కరణలు తెచ్చారు. కొన్ని దురలవాట్ల నుంచి, అనైక్యత బారి నుంచి వారిని కాపాడారు. అందరితో కలసి ఆయన ఉద్యమానికి పథక రచన చేశారు. ఆంగ్లేయుడితో పోరాటం సాంప్రదాయిక ఆయుధాలతో సాధ్యం కాదు. సాంప్రదాయిక ఆయుధాలతో పాటు, ఆధునిక ఆయుధాలు కూడా అవసరమని గుర్తించారు రామరాజు. గిరిజనుల దగ్గర ఉండేవి కేవలం నాటు తుపాకులు, విల్లంబులు, బరిసెలు, బాణాలు. అప్పటికి 303 రైఫిళ్లు ఆధునిక ఆయుధాలు. వీటిని సేకరించడానికి ఆయన పోలీసు స్టేషన్లను ఎంచుకున్నాడు. నిజానికి సాంప్రదాయిక ఆయుధాలను వాడుతూ బ్రిటిష్ దమనకాండకు వ్యతిరేకంగా పోరాడడం విశాఖ మన్యానికి కొత్త కాదు. అక్కడ 1790 తరువాత అలాంటి పరిణామాలు జరిగాయి. పోలీసు స్టేషన్లను దగ్ధం చేయడం కూడా ఉండేది. ద్వారబంధాల చంద్రారెడ్డి (1875 ప్రాంతం) ఇందుకు ప్రసిద్ధుడు. మన్యంలో పాత పద్ధతులను రామరాజు యథా తథంగా తీసుకోక పోయినా కొన్నింటిని అనుసరించారు.
ఆగస్టు 19, 1922న శబరి కొండ మీద అమ్మ వారికి అభిషేకం చేయించి రామరాజు ఉద్యమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆగస్టు 22న చింతపల్లి స్టేషన్ మీద దాడి చేసి తుపాకులు ఎత్తుకు రావడంతో ఉద్యమం వాస్తవంగా మొదలైంది. 23వ తేదీన కృష్ణదేవిపేట, 24వ తేదీన రాజవొమ్మంగి స్టేషన్‌ను రామరాజు లక్ష్యంగా చేసుకున్నారు. మొత్తం 21 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే మద్రాస్ ప్రెసిడెన్సీని గడగడలాడించింది. ఇరవై ఒక్క తుపాకులు కలిగి ఉండడమంటే దాదాపు ఒక ఆధునిక పోలీసు పటాలం తయారైనట్టే.
మొదటి ప్రపంచ యుద్ధంలో విజేతలుగా నిలిచిన బ్రిటిష్ జాతికి కొండవాళ్ల సాహసాన్ని జీర్ణించు కోవడం సాధ్యం కాలేదు. అందుకే మూడురోజుల లోనే మన్యాన్ని పోలీసు బలగాలతో నింపేశారు బ్రిటిష్ అధికారులు. నర్సీపట్నంతో పాటు, కృష్ణదేవి పేట, చింతపల్లి, లంబసింగి, అడ్డతీగల, కొయ్యూరు, కోటనందూరు, మల్కన్గిరిల దగ్గర పోలీసు శిబిరాలు వెలిశాయి.
ఏజెన్సీ పోలీస్ సూపరింటెండెంట్ సాండర్స్ కొద్దిమంది విశాఖపట్నం రిజర్వు పోలీసు బలగాలను వెంటపెట్టుకుని హుటాహుటిన నర్సీపట్నం వచ్చాడు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ హ్యాండర్సన్, పోలీసు సూపరింటెండెంట్ మార్టిన్ కూడా చేరుకున్నారు, వెనకే రిజర్వు దళాల ఇన్స్పెక్టర్, యాభయ్ మంది బలగాలు వచ్చాయి.
నార్తరన్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ జార్జి ఆదేశాల మేరకు విశాఖపట్నం రిజర్వుదళాలు కృష్ణదేవిపేట చేరాయి. ఇవి సాండర్స్ నాయకత్వంలో పనిచేయాలని ముందే నిర్ణయించారు. పార్వతీపురం రిజర్వు దళాలను చింతపల్లి పంపించారు.
అడ్డతీగలలో మోహరించవలసిందంటూ రాజమండ్రి రిజర్వు దళాలకి ఆదేశం వెళ్లింది. కాకినాడ రిజర్వు దళాలు వచ్చి తుని దగ్గరలోనే కోటనందూరులో విడిది చేశాయి. కృష్ణా రిజర్వు దళాలను మల్కన్‌గిరికి చేర్చారు.
పత్రికలలో ఈ నాలుగు రోజుల నుంచి వెల్లువెత్తిన వార్తలు వాళ్లని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఒక్క పెద్దాపురం గ్రామంలో అనే ఏముంది? అటు విజయనగరం మొదలు, ఇటు నెల్లూరు, మద్రాసు వరకు ఆ వార్తలతోనే పత్రికలు హోరెత్తిస్తున్నాయి.
‘ఏజెన్సీలోని కొండగ్రామాల ప్రజలు ఏవేవో కారణాలతో తిరుగుబాటు లేవదీశారని ప్రజలు చెప్పుకుంటున్నారు. నాలుగు లేదా ఐదు పోలీసు స్టేషన్ల మీద దాడులు చేశారట. ఆయుధాలు, మందుగుండు దోచుకుని వెళ్లారట. ఈ దోపిడీలను అరికట్టడానికి కృష్ణా, గోదావరి జిల్లాల నుంచి రిజర్వు బలగాలను పంపించారట..’
రాజమండ్రి నుంచి వెలువడుతున్న మాసపత్రిక ‘కాంగ్రెస్’లో ఆగస్టు 28న వచ్చింది వార్త. ఐదారు మాసాల క్రితమే మొదలైన ‘కాంగ్రెస్’ సైక్లోస్టయిల్ పత్రిక. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకుడు. ఆయన మీద అందరికీ గౌరవమే. కానీ అస్పష్టంగా ఉన్న అక్షరాలతో, రూఢీగా లేని ఆ కథనం పట్టణవాసులని పెద్దగా కదిలించలేదు.
కానీ మరునాడే ‘ఆంధ్రపత్రిక’ ప్రచురించిన వార్త కలకలం సృష్టించింది.
ఉరుములేని పిడుగులాంటి వార్త – పెద్దాపురం విలేకరి రాసినది.
‘ఒక క్షత్రియ యువకుని నాయకత్వంలో వందలాదిమంది ఏజెన్సీ ప్రజలు పోలీసు స్టేషన్లను దోచుకున్నారు. చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి స్టేషన్లలో ఆయుధాలు, మందుగుండు తీసుకుపోయారు. కానీ ఆందోళనకారులు ఎవరినీ హింసించలేదు..’
ఆ తరువాత రోజే మరో వార్త, అంటే ఆగస్టు 31 సంచికలో-‘ఆ క్షత్రియ యువకుడు పాతికేళ్ల వాడు. పేరు అల్లూరి శ్రీరామరాజు. సాత్వికాహారమే తీసుకుంటాడు. అహింసను ప్రబోధిస్తాడు. అతీతశక్తులు కలిగినవాడని చెబుతారు. ఆయనను తూటాలు కూడా గాయపరచలేవని అక్కడి ప్రజల నమ్మకం. స్టేషన్లను కొల్లగొట్టే ముందు ఆ సమాచారాన్ని కోయల ద్వారా తెలియచేస్తాడు. దాడి ఏ సమయంలో చేసేదీ కూడా చెబుతాడు. రాజు ఎక్కడ ఉన్నాడని ఆ సమాచారం తెచ్చిన కోయను అడిగితే తనకు ఏమీ తెలియదని అతడు చెబుతాడు. తాను రాజాజ్ఞ పాలిస్తున్నానని మాత్రమే చెబుతాడు. వాళ్లిచ్చే నాలుగు అణాల కోసం ఈ పని చేస్తున్నానని అంటాడు’.
‘న్యాయదీపిక’ మద్రాసు నుంచి వెలువడుతుంది. సెప్టెంబర్ 4న ‘రంప దాడులు’ పేరుతో వార్త ఇచ్చింది.
‘గోదావరి పత్రిక’, ‘హితకారిణి’ పత్రికలు కూడా మన్యం అలజడులను గురించి పాఠకులకు వార్తలు అందించాయి.
‘ఆర్యప్రభ’ విజయనగరం నుంచి వెలువడుతుంది. ‘మన్యం అలజడులకి గూడెం ఫితూరీ’ అని పేరు పెట్టి కారణాలు తెలియచేసింది. చాలా తక్కువ మందికే తెలిసిన గరమండ మంగరాజు పేరును ప్రస్తావించి అందరినీ ఆశ్చర్య పరిచింది. మంగరాజు 1916 నాటి లాగరాయి ఫితూరీలో పనిచేశాడు. కృష్ణదేవిపేటలో ఇప్పటికీ చాలామందికి అతడు గుర్తే.
‘గూడెం డిప్యూటీ తహసీల్దార్ రోడ్డు పని మొదలు పెట్టి, అందుకోసం కొండ ప్రజలను రప్పించు కున్నాడు. కూలీ ఇవ్వలేదు. పైగా విపరీతంగా హింసించాడు. అడవిలోకి అడుగు పెట్టే అవకాశం లేని కొండవాళ్లు ఆకలితో అలమటిస్తున్నారు. అందుకే అంత కష్టమైనా రోడ్డు పనికి వచ్చారు. అలాంటి బక్క ప్రాణులను బాస్టియన్ హింసించడంతో ఉద్యమం మొదలైంది..’ కారణాలు కూడా మొదటిసారి బయటి ప్రపంచానికి తెలియచెప్పింది.
ఆంధ్రపత్రికలో ఇంకోరోజు –
‘మా కాకినాడ విలేకరి ఇలా తెలియచేశారు. రామరాజు చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లతో పాటు నాతవరం, మాడుగుల స్టేషన్లు కూడా కొల్లగొట్టాడు’. సెప్టెంబర్ 5వ తేదీన ఈ వార్తను కొంచెం సవరించింది – ‘రామరాజు మాడుగుల స్టేషన్‌ను కొట్టలేదు’.
సహాయ నిరాకరణోద్యమంలో పోలీసుల చేతిలో ఎంతో హింసను చవిచూసిన మైదాన ప్రాంతాల ప్రజలకి శ్రీరామరాజు సాహసం అద్భుతం అనిపిస్తోంది. ఈ వార్తలు ఏవో లోకాలకు తీసుకువెళ్లి పోయాయి.
రామరాజు ఉత్తరం
మూడు పోలీసు స్టేషన్ల మీద విజయం తరువాత రామరాజు ఒంజేరి దగ్గర బ్రిటిష్ బలగాలను ఓడించారు. ఆ తరువాత మైదాన ప్రాంతాల నుంచి మన్యంలోకి ఉద్యమకారులను రప్పించాలని ప్రయత్నం ప్రారంభించారు. ఇందుకు ఉదాహరణ ఈ ఉత్తరం. తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన పేరిచర్ల సూర్యనారాయణరాజుకు రామరాజు ఆ ఉత్తరం రాశారు. ఆ ఇద్దరు బాల్యమిత్రులు. సెప్టెంబర్ 16న రాసిన ఉత్తరమది. కానీ ఆ మరునాడే దొరికిపోయింది.
‘మిత్రమా!
నేను యుద్ధమును ప్రారంభించితిని. ఇంతవరకు నాలుగు ప్రదేశములలో మన సైన్యము బ్రిటిషు సైన్యమును ఓడించినది. ప్రతి పోరాటమునను భగవానుని దయవలన జయము మన పక్షమునకే లభించినది. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకుని నీవు బయలుదేరి రావలెను. మృత్యువు జననమును వెన్నంటియే యుండును. ప్రతి మానవుడు వాని వంతు వచ్చినప్పుడు మరణించ వలసిందే. కర్మ పరిపక్వమై, కాలము సమీపించిన, ఎక్కడున్నను ఏ మానవుడు మరణించడు? ఎంతో శ్రద్ధతో ఈ శరీరమును పెంచి పోషించినను ఒకరోజున అది నాశనము కావలసిందే. మానవ శరీరములు శాశ్వతములు కావు. కానీ, కీర్తి, అపకీర్తి శాశ్వతములు. మంచిచెడ్డలు చిరకాలము నిలుస్తాయి. క్షత్రియులకు యుద్ధము సహజము. ఎవరైతే జయాపజయాలను, కష్టసుఖములను, చీకటివెలుగులను సమభావముతో చూడగలరో వారే ఆత్మ సాక్షాత్కారము పొందగలరని భగవద్గీత బోధించు చున్నది. మనకు యుద్ధములో విజయము లభించిన ఎడల భౌతికానందము పొందగలము. యుద్ధములో మనము మరణించిన ఎడల మనము వీరస్వర్గము నలంకరించి అనందించగలము. అందువలన ఈ విషయములన్నింటిని నేను జాగ్రత్తగా ఆలోచించి, దేశ క్షేమము కొరకు యుద్ధము అనివార్యమని పూర్తిగా విశ్వసించి ఈ సమరమును ప్రారంభించినాను. ఈ ఉత్తరము చేరిన వెంటనే నీవు తప్పక బయలుదేరి వస్తామని పూర్తిగా నమ్ముచున్నాను. ఇంకను ఎవరైనా వస్తే నీతో తీసుకుని రావలెను. ఒకసారి నీవు బయలుదేరి వచ్చి ఇచ్చట నేను పోరాటమును సాగించుటకు చేసిన ఏర్పాట్లను చూడవలెను. అవి నీకు నచ్చకపోయిన ఎడల తిరిగి వెళ్లిపోవచ్చును. మన పూర్వ స్నేహమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. అక్కడ పేకేటి వారి అబ్బాయి ఉంటే తప్పక నీతో తీసుకొని రావలెను. మిత్రులకు నా అభినందనలు.
అల్లూరి శ్రీరామరాజు’.
దామనపల్లి అనేచోట రామరాజు దళం చేసిన సాహసం అసాధారణమైనది. అక్కడ కవర్ట్, హైటర్ అనే ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులను రామరాజు దళం చంపింది. వారి సమాధులు ఇప్పటికీ నర్సీపట్నంలో ఉన్నాయి. దీనితో మద్రాస్ ప్రెసిడెన్సీ హోం కార్యదర్శి కల్నల్ నాఫ్ విశాఖ మన్యానికి వచ్చాడు. ఆ తరువాత పోలీసులు చేసిన పని, స్టేషన్లన్నింటినీ ఖాళీ చేయడమే. రామరాజు సేనకీ, ఆంగ్లేయ పోలీసులకు మధ్య 62 పర్యాయాలు కాల్పులు జరిగాయని చెబుతారు. స్థానిక బలగాలు పనిచేయలేకపోవడంతో మలబార్ పోలీసులను పిలిపించారు. వారు కూడా విఫలం కావడంతో అస్సాం రైఫిల్స్‌ను రప్పించారు. కుకీల తిరుగుబాటును అణచిన సైన్యమిది. దీని అధిపతి మేజర్ గూడాల్.
Alluri Seetha Ramaraju
1924 ఏప్రిల్‌లో రూథర్‌ఫర్డ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించి, చినుకు పడే లోపున ఉద్యమం అణచాలని మద్రాసు ప్రెసిడెన్సీ పెద్దలు ఆదేశించారు. రూధర్ఫర్డ్ వచ్చిన తరువాత అకృత్యాలు మరిన్ని పెరిగిపోయాయి. చివరికి రామరాజు దొరికిపోయాడు. ఆయనను మంప దగ్గర అరెస్టు చేసి, కొయ్యూరు తీసుకువచ్చారు. అక్కడ క్యాంప్ వేసి ఉన్న మేజర్ గూడాల్ రామరాజును కాల్చి చంపాడు. కానీ రామరాజును సజీవంగా పట్టి తేవాలని ప్రభుత్వ ఆదేశం. చివరికి రామరాజు భౌతిక కాయాన్ని కృష్ణదేవిపేట తీసుకువెళ్లి శవపరీక్ష చేయించి, అంత్యక్రియలు నిర్వహించారు.
రామరాజు వెంట నడిచిన గిరిజనులు ఎందరో ఉన్నారు. గాం గంటన్న, గాం మల్లుదొర, ఎండు పడాలు, గోకిరి ఎర్రేసు వంటి వారు ఉన్నారు. రామరాజు ఉద్యమంలో అరెస్టయిన వారిని విచారించేందుకు అర్హంట్ అనే న్యాయాధికారి న్యాయమూర్తిగా విశాఖలో ప్రత్యేక కోర్టు ఏర్పాటయింది. ఆ కోర్టు 250 మందికి పైగా ఉద్యమకారులను విచారించి శిక్షలు వేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామరాజు వర్ధంతిని అధికారికంగా జరుపుతోంది. కానీ ఆయన జీవిత చరిత్రకు అక్షరరూపం ఇచ్చే చిన్న ప్రయత్నం కూడా చేయడంలేదు. చరిత్రను తిరగ రాస్తూ ఉండాలంటుంది హిస్టరియోగ్రఫీ. కానీ మైదాన ప్రాంతాల చరిత్ర, కొన్ని కుటుంబాల చరిత్రనే మళ్లీ మళ్లీ రాసుకుంటున్నారు. నిజానికి 1924లో రామరాజు మరణించిన తరువాత ఇంతవరకు ఆయన గొప్పతనాన్ని ఆవిష్కరించే, ఆ ఉద్యమ పరిధినీ, స్థాయినీ, అందులోని తాత్వికతనీ వివరించే యత్నం జరగలేదు. తెలుగువారికి రామరాజు పట్ల ఉన్న గౌరవం దష్ట్యా ఈ అంశాలను వెలుగులోకి తేవడం ఎంతో అవసరం.
– గోపరాజు నారాయణరావు - (జాగృతి సౌజన్యం తో) - This article was first published in 2020