అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం తర్వాత కూడా ఈ పవిత్రక్షేత్రం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓటమి పాలైందంటూ లోక్‌సభ 2024 ఎన్నికల అనంతరం వ్యాప్తి చేస్తున్న దుష్ప్రచారాన్ని అయోధ్య వాసులు తిప్పికొట్టారు.
అయితే వాస్తవానికి 2014కి ముందు అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట కాదు. అంతేకాదు అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ ఆధిక్యంలోనే ఉంది. కానీ కులరాజకీయాలు, ముస్లింల ఏకీకరణ వల్ల మిగిలిన నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు, ఫైజాబాద్ లోక్ సభ స్థానాన్ని బీజేపీ కోల్పోవడానికి దారి తీశాయి. ఈ విషయంపై అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర ఆవేదనను సైతం వ్యక్తం చేస్తున్నారు. కానీ అయోధ్య రామమందిరం కట్టేటప్పుడు, ఈ పవిత్ర నగరాన్ని సుందరీకరించే సమయంలో ఒకప్పుడు అక్కడున్న స్థానికులు తమ ఆస్తులను కోల్పోయారనీ, వారికి సరైన పరిహారం ఇవ్వలేదని, అందుకే బీజేపీ ఓడిపోయిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ ఇదంతా అబద్దం. పవిత్ర అయోధ్యా నగరాన్ని సుందరీకరించే సమయంలో ప్రజల ఆస్తులు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం వారికి తగిన పరిహారం అందించిందని, అంతేకాక వారి ఆస్తిని పునరుద్ధరించిందని స్థానికులు తెలిపారు. అదే సమయంలో, జూన్ 4, 2024వ తేదీన లోక్‌సభ ఫలితాలు వెలువడిన తర్వాత కూడా భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదనడానికి ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుండటమే నిదర్శనం అని వారన్నారు.
Ayodhya |
ఇక తాజాగా అయోధ్యలోని రామ్‌లల్లా ఆలయ గర్భగుడిలో నీటి లీకేజీ అంటూ వార్తలు వెలువడగా... అలాంటిదేమీ లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం పూర్తి వివరాలతో స్పష్టం చేయడంతో ప్రతిపక్షాల మరో నకిలీ కథనం బట్టబయలైంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతుందన్న వార్తల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయాన్ని పూర్తిగా పరిశీలించి ఈ ప్రకటన చేశారు. ఆలయ గర్భగుడిలో కరెంట్ తీగలను అమర్చడానికి ఏర్పాటు చేసిన పైపుల నుండి వర్షపు నీరు వచ్చిందని పేర్కొన్న కథనాలన్నీ అబద్దమని స్పష్టం చేశారు. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థసేవ ట్రస్ట్ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. దేవాలయం, పార్క్ కాంప్లెక్స్‌లో వర్షపు నీటి పారుదల కోసం మంచి ఏర్పాట్లు చేయబడ్డాయని, ఆ పని ఇంకా పురోగతిలో ఉందని ఆ ప్రకటన తెలిపింది. ఆలయ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీటి నిర్వహణకు అనుగుణంగా నిర్మితమైందని, అందువల్ల నీరు లీకేజీకి అవకాశమే లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది. వర్షపు నీటిని నిలుపుకోవడానికి క్యాంపస్‌లో రీఛార్జ్ పిట్లను నిర్మిస్తున్నారని కూడా వివరించారు.
Ayodhya |
అయోధ్య స్థానికుడు, రామమందిరంలో స్వచ్ఛందంగా పనిచేస్తూ భక్తుల పాదరక్షల సంరక్షణ చేస్తున్న వికాస్ సోనీ మాట్లాడుతూ, దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ సోషల్ మీడియాతో పాటు అనేక ఇతర ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని చెప్పాడు. లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ చేతిలో బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ 54,567 ఓట్ల తేడాతో ఓడినప్పటికీ, ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై అపారమైన ప్రేమ, బీజేపీ పట్ల విశ్వాసం ఉన్నాయని అన్నారు. 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం తెలుస్తుందనన్నారు. రామమందిర నిర్మాణం తర్వాత ఏర్పడిన ఉపాధి అవకాశాలను సోనీ కొనియాడుతూ గతంలో ప్రజలు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తే, ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు రావడంతో ఆ మొత్తం మూడు నుండి ఐదు వేలకు పెరిగిందన్నారు. అంతేకాక స్థానికులకు పరిహారం విషయంలో వస్తున్న బూటకపు కథనాలపైనా మండిపడ్డారు. ప్రజలకు తగిన పరిహారం అందిందన్నారు. గతంలో షాపుల అద్దె చాలా తక్కువగా ఉండేదని, దుకాణదారులు రోజుకు వెయ్యి రూపాయల వరకు మాత్రమే సంపాదించేవారని అన్నారు. అయితే ఇప్పుడు ఆదాయం గణనీయంగా పెరిగిందని చెప్పారు.
అక్కడే ఉండే మిఠాయి దుకాణం యజమాని అయిన అంగత్ తివారీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "పరిహారం మొత్తం గురించి స్థానిక దుకాణదారులలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, పర్యాటకులు వస్తూ వీరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ కాలక్రమేణా ఇది తగ్గిపోతుంది" అన్నారు. మెడికల్ స్టోర్ యజమాని భరత్ కనోజియా మాట్లాడుతూ అయోధ్య స్థానిక ప్రజలకు పరిహారం ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలన్నీ తప్పుడు వాదనలేనని అన్నారు. ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన హక్కు పత్రాలను కలిగి ఉన్న వ్యక్తులందరికీ ప్రభుత్వం నుండి తగిన పరిహారం అందిందని అన్నారు.
అయోధ్య ధామ్ అభివృద్ధిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల వల్ల నష్టపోయిన స్థానికులకు మొత్తం రూ.1,253.06 కోట్లు పరిహారంగా ఇచ్చామని అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నితీష్ కుమార్ స్పష్టంగా తెలిపారు. అయోధ్యలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ గతంలో అక్కడున్న భవనాలు, భూములు, దుకాణాల యజమానులతో చర్చించిన తర్వాతే జరిగాయని చెప్పారు. బాధిత ప్రజలకు వారి దుకాణాల పరిమాణాన్ని బట్టి నష్టపరిహారం అందించారని, దుకాణాలు మారడం వల్ల వ్యాపారం దెబ్బతిన్న ఒక్కో దుకాణదారుకు లక్ష నుంచి 10 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు కుమార్ తెలిపారు.
అయోధ్యలో రామమందిరాన్ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టిందా?.. అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని అయోధ్య ప్రజలు ఏకాభిప్రాయంగా చెప్పారు. విధుల్లో ఉన్న కొంతమంది భద్రతా అధికారులు మాట్లాడుతూ, రామ్ లల్లా దర్శనం కోసం ప్రతిరోజూ భక్తజన సముద్రం ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తోందని చెప్పారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ ఓడిపోవడంతో భక్తుల సంఖ్య తగ్గినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని అన్నారు. అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్‌సభా స్థానానికి జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయినప్పటికీ, ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సుందర స్వప్నం నెరవేరినందుకు, అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగినందుకు స్థానికుల ఆనందానికి అవధులు లేవు.
vskteam