రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ సహ ప్రాంతప్రచారక్ ప్రభు కుమార్ వున్నారు. వారి ప్రసంగ పాఠం యథాతథంగా…
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం గత 99 సంవత్సరాలుగా హిందూ సంఘటన ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం కోసం నిత్య శాఖ ద్వారా వ్యక్తి నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తోంది. సంఘం యొక్క లక్ష్యం హిందూ సంఘటనం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడం. కాబట్టి సంఘ కార్యాన్ని ముందుకు తసుకెళ్లడానికి కావాల్సిన స్వయంసేవకుల నిర్మాణం నిత్యశాఖలో జరుగుతుంది. అలాగే శాఖని సరైన పద్ధతిలో నిర్వహించి, ఆ శాఖలో స్వయంసేవకులుగా, రాబోయే రోజుల్లో కార్యకర్తలుగా వారిని నిర్మాణం చేస్తూ.. రాబోయే రోజుల్లో వారు సంఘటకులుగా నిర్మాణం కావడం కోసం ఇలాంటి శిక్షావర్గలు జరుగుతుంటాయి. కాబట్టి సంఘ నిర్మాణం కోసం కార్యకర్తలు అవసరం. వారిని తయారు చేయడమే ఈ సంఘశిక్షావర్గల ముఖ్య ఉద్దేశం. సంఘ శిక్షావర్గలో శారీరక, బౌద్ధిక, మానసిక శిక్షణ ద్వారా ఈ దేశం కోసం తన జీవితాన్ని అంటే తన వ్యక్తిగత జీవితాన్ని కొంత గడుపుతూనే.. సమాజం కోసం, దేశం కోసం పనిచేసేటటువంటి సామర్థ్యం, యోజన అలాంటి ఆలోచన కలిగేటటువంటి ఈ ప్రశిక్షణ ద్వారా కార్యకర్తలు అలా తయారవుతారు. అలా సంఘం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనేక పద్ధతుల్లో సంఘ శిక్షావర్గలు నిర్వహిస్తూ.. కార్యకర్తల నిర్మాణం జరుగుతూ వస్తోంది.
కొన్ని దశాబ్దాలుగా సంఘం చేస్తున్న ప్రయత్నం ద్వారా సమాజంలో చైతన్యం, హిందూ స్పృహ కలుగుతూ వస్తోంది. అలాగే స్వాభిమాన హిందూ సమాజ నిర్మాణం కూడా జరుగుతూ వస్తోంది. సంఘం ప్రారంభ కాలంలో హిందూ సమాజ పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 1925లో పరమ పూజ్యనీయ డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించినపుడే హిందూ సంఘటనం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొస్తానని చెప్పారు. సంస్థను ప్రారంభించే ముందు అనేకమంది వ్యక్తులను కలిసి, సలహాలు తీసుకున్నారు. మార్గదర్శనం కోసం అడిగారు. అలాంటి సమయంలో, అప్పటి పరిస్థితుల్లో ఈ దేశంలో హిందువులను సంఘటితపరచడం చాలా కష్టమైన, అసాధ్యమైన పని అని చెప్పారు. అలాగే డాక్టర్జీ ఈ ఆలోచల్లో వున్నప్పుడు, దేశంలో ఎవరైనా తాము హిందువు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే సందర్భం. ఇది స్పష్టంగా కనిపించింది. అలాగే హిందువు హిందువుగా చెప్పుకోవడం, జీవించడం అనే పరిస్థితి అక్కడ కనిపించలేదు. కాబట్టి హిందూ సమాజం సంఘటితం కావడం అనేది అసాధ్యమని నాటి స్వాతంత్ర యోధులందరూ చెప్పారు. సంఘ ప్రారంభం తర్వాత కూడా సమాజంలో అలాంటి పరిస్థితే వుంది.
మన దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ హిందుత్వం గురించి మాట్లాడుతూ.. “నన్ను గాడిద అనండి.. హిందువు అని మాత్రం అనకండి” అని అన్నారు. నేను (నెహ్రూ) ప్రమాదవశాత్తు హిందువుగా పుట్టానన్నారు. అంటే.. దేశానికి మార్గదర్శకత్వం చేసే వ్యక్తుల్లో కూడా ఇలాంటి ఆలోచన వుండేది. అలాగే సంఘ ప్రారంభం తర్వాత కూడా హిందూ సంఘటన ఎన్ని కిలోలు అయ్యింది? అంటూ డాక్టర్జీని హేళన చేసిన సందర్భాలూ వున్నాయి. కప్పలన్నింటినీ తక్కెడలో జోకడం ఎలాగో హిందూ సంఘటన కూడా అలాంటి పనే అని చెప్పేవారు. అసలు హిందూ సమాజం సంఘటితం కాలేదని చాలా మంది అనేవారు. కానీ నేడు సంఘం చేస్తున్న పనితో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎవరైనా దాడి చేయడానికి వస్తే… అందరమూ మేల్కొని వుందామని, సంఘటింతో ఎదుర్కొందామన్న స్థాయికి, మనల్ని మనం రక్షించుకుందాం.. అన్న స్థాయికి నేడు హిందూ సమాజం చేరుకుంది. అలాంటి స్థితి సంఘం ద్వారా నిర్మితమైంది. కేవలం ఈ మాట మనం మాత్రమే చెప్పడం లేదని, సంఘంతోనే హిందూ సమాజం స్వాభిమాన స్థితిలో వుందని సాధారణ పౌరులు కూడా చెబుతున్నారు. అలాగే హిందూ అన్న పదం పలకడమే నీచత్వం అన్న స్థితి నుంచి… నేను హిందువునని గర్విస్తున్నాను అన్న స్థాయికి సంఘం తీసుకొచ్చింది.
సంఘం నిరంతర ప్రయత్నం ద్వారా అనేక కార్యకర్తల యొక్క జీవిత బలిదానాల ద్వారా సంఘ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు హిందూ సమాజం కోసం ఏ విషయం కోసమైతే కట్టుబడి వుందో.. ఎన్ని కష్టాలు వచ్చినా, సంఘాన్ని ఇబ్బందులు పెట్టినా.. తన లక్ష్యాన్ని, ధ్యేయాన్ని నమ్ముకొని, నిరంతరం పనిచేసిన కారణంగా నేడు హిందూ సమాజం.. స్వాభిమాన, సంఘటిత హిందూ సమాజం నిర్మాణమైంది. సంఘం నిరంతర శ్రమ ద్వారా ఇది సాధ్యమైంది. అలాగే ఏ దేశమైనా… శక్తిమంతమైన దేశమే ప్రపంచంలో గౌరవింపబడుతుంది. ఇది సృష్టి నియమం. కాబట్టి శక్తి లేని సమాజం, శక్తిలేని వ్యక్తి.. అందరికీ బలహీనులుగా కనిపిస్తారు. కాబట్టి ఏ సమాజమైనా సరే.. శక్తిమంతమైన సమాజం నిర్మాణం కావాలి. ఈ మాట మన హిందూ సమాజానికి కొత్తకాదు. ఈ సంస్కృతిలో, సంప్రదాయంలో మన వారసులు శక్తి ఉపాసకులే. మనది శక్తి ఉపాసనా దేశం.
వెయ్యి సంవత్సరాల బానిసత్వం కారణంగా మన సహజ లక్షణాలు కోల్పోయిన కారణంగా… సమాజం శక్తిమంతం కావడానికి 99 సంవత్సరాలు ఆలోచించాం. మన 33 కోట్ల దేవీ దేవతలందరూ శక్తిఉపాసన దేవతలు. కాబట్టి దేవీ దేవతలందరి చేతుల్లోనూ శస్త్రాస్త్రాలుంటాయి. ధర్మ సంరక్షణ కోసం వుంటాయి. ధర్మ సంరక్షణ కోసం శక్తిని ఉపాసన చేసే దేవీ దేవతలుండే దేశం. అలాంటి ఉపాసకులం మనమందరం. అందుకే ‘‘శక్తి సహితం శివం..శివం.. శక్తి రహితం శవం శవం’’ అని చెబుతుంటారు. స్వామి వివేకానంద కూడా నిద్ర పోతున్న హిందూ సమాజానికి ఒక కరెంటు షాక్‌లాగా చెప్పారు, అదేమిటంటే.. ‘‘బలమే జీవనం.. బలహీనతే మరణం’’. కాబట్టి వెయ్యి సంవత్సరాల బానిసత్వంలో ఇలాంటి స్వాభావిక గుణాలు కోల్పోయిన సమాజంలో శక్తి నిర్మాణంకావాలి. ఎప్పుడైతే శక్తి గల దేశమవుతుందో ప్రపంచ దేశాలు వింటాయి. స్వాతంత్రోద్యమ సమయంలో పాల్గొన్న వారందరూ జ్ఞానవంతులే. జగదీశ్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగోర్ జపాన్ దేశానికి వెళితే.. బానిసత్వంలో ఉన్న దేశం నుంచి వచ్చిన వారి మాటలను తాము వినేదిలేదని అన్నారు. అప్పట్లో జ్ఞానం వుంది కానీ.. శక్తి లేదు. మనం స్వాతంత్రం తీసుకోలేం. బ్రిటీష్ వారికి లొంగిపోయాం. అందుకే శక్తి రహిత సమాజాన్ని గౌరవించదు.
శక్తి సహిత సమాజాన్నే గౌరవిస్తుంది. ఈ 99 సంవత్సరాల కాలంలో మన దేశం ఎంతో శక్తిమంతమైంది. ఈ శక్తిమంతమైన దేశాన్ని ప్రపంచ దేశాలు ఇప్పుడు గౌరవిస్తున్నాయి. ఈ శక్తి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ద్వారా హిందూ సమాజానికి అందుతోంది. హిందూ సమాజ సర్వాంగీణ వికాసం కోసం స్వయంసేవకులు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. శాఖ ద్వారా నిర్మితమైన వ్యక్తులు ఎవరైతే వున్నారో.. ఆ వ్యక్తులు అనేక రంగాల్లో పనిచేస్తున్నారు. గత 50, 60 సంవత్సరాలుగా సమాజంలో అనేక రంగాలలో స్వయంసేవకులు పనిచేస్తున్నారు. దేశహితం కోసమే మనం అన్న లక్ష్యాన్ని ఆ రంగంలో తీసుకెళ్లడానికి స్వయం సేవకులు పనిచేస్తున్నారు. కార్మిక రంగంలో భారతీయ మజ్దూర్ సంఘ్ ఉంది. అక్కడ సంఘ విద్రోహకర శక్తులుండేవి. ఆ రంగంలోకి స్వయం సేవకులు వెళ్లి, ఆ కార్మికుల హితం, పరిశ్రమ నడిపిస్తున్న వారి హితం, దేశ హితం కోసం పనిచేసే కార్మికులను తీర్చిదిద్దేందుకు పనిచేసింది. ఎర్రజెండా స్థానే పరమ పవిత్ర భగవాధ్వజ్ ఎగిరింది. లాల్ సలామ్ స్థానంలో భారత్ మాతాకీ జై అన్న నినాదం వచ్చింది. ఆ రంగంలో స్వయంసేవకులు వెళ్లిన తర్వాత ఆ పరిణామం కార్మిక రంగంలో కనిపించింది. ఈ రోజు ఆ సంస్థ లక్షలు, కోట్లు సభ్యత్వమున్న సంస్థ.
అలాగే విద్యారంగంలో సరస్వతీ విద్యాపీఠం… విద్యార్థుల్లో జాతీయ విద్యావిధానంతో దేశభక్తులను తయారు చేయడం కోసం దేశమంతా విస్తరించిన సంస్థ. 13,000 పాఠశాలల్లో, 35 లక్షల మంది విద్యార్థులు అందులో చదువుతున్నారు. విద్యా రంగానికి ఓ మార్గం చూపించింది ఆ సంస్థ. విద్యార్థి రంగంలో విద్యార్థి పరిషత్. జ్ఞానం, శీలం, ఏకత అన్న నినాదంతో విద్యార్థులను దేశహితం కోసం పనిచేసే విధంగా తయారు చేస్తోంది. అలాగే రైతాంగం కోసం భారతీయ కిసాన్ సంఘ్. రైతుల క్షేమం ఆశిస్తూనే.. ఆ రైతులే దేశం కోసం, సమాజం కోసం నిలబడాలని తయారు చేస్తోంది. ఇలా… స్వయం సేవకులు ఏ రంగంలో వున్నా… ఆ రంగాన్ని దేశహితం కోసం పనిచేసే సంస్థగా తయారు చేసే పరిస్థితి వుంది. ఇలా అనేక రంగాల్లో వుంది. స్వయంసేవకులు ఆ రంగాన్ని ప్రభావితం చేస్తూ.. ఆ రంగం దేశహితం కోసం పనిచేసే విధంగా చేస్తోంది. ఈ పరిణామాన్ని సమస్త హిందూ సమాజం చూస్తూ వస్తోంది.
అలాగే వనవాసులు, గిరివాసులకు విద్యా వైద్యం అందించడానికి, వారు కూడా సర్వాంగీణ వికాసం చెందడానికి వనవాసీ కల్యాణ పరిషత్ పనిచేస్తోంది. అలాగే దారిద్య్ర రేఖకు దిగువున వున్నవారి కోసం సేవాభారతి పనిచేస్తోంది. ఇలా అనేక రంగాల్లోకి మనం విస్తరించాం. సంఘం ఎదుగుదలను చూసి భరించలేనివ్యక్తులు ఆ రోజు నుంచి నేటి వరకూ దేశంలో పనిచేస్తూనే వున్నారు. మొన్నటికి మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ దుష్ప్రచారం చేశారు. రిజర్వేషన్లకు సంఘం వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేశారు. ఇలా దుష్ప్రచారం చేసే వారికి కూడా వారు చేసేది తప్పని తెలుసు. అందరి సర్వాంగీణ వికాసం కోసం సంఘం పనిచేస్తుందని వారికి బాగా తెలుసు. కానీ.. రాజకీయ, స్వలాభం కోసం దుష్ప్రచారం చేస్తున్నారు. దీంతో సమాజంపై ప్రభావం పడుతోంది. 1981 లో జరిగిన అఖిల భారత ప్రతినిధి సభలో రిజర్వేషన్లపై సంఘం ఓ తీర్మానం పాస్ చేసింది. అప్పటి నుంచి అయిదారు సంవత్సరాలకోసారి రిజర్వేషన్లపై స్పష్టత ఇస్తూనే వస్తున్నారు. పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ మొన్నటి మొన్న తెలంగాణకి వచ్చి, సామాజికంగా అట్టడుగు వర్గాల వారు సామాజికంగా ఎప్పటి వరకైతే దూరంగా వుంటారో.. అప్పటి వరకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని, రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులనూ సంఘం సమర్థిస్తుందని, దాని కోసం నిరంతరంగా కృషి చేస్తోందని స్పష్టంగా చెప్పినా… ఈ సమాజంలో అనేక విద్రోహకర శక్తులు సంఘంపై దుష్ప్రచారం చేస్తూనే వస్తున్నాయి.
అలాగే దేశాన్ని ఎలాగైతే సంఘ ఆలోచన ద్వారా సమాజం ఉన్నత స్థితికి వెళ్తుందో.. అలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత.. ప్రస్తుత రాజకీయ పరిపాలకులు వున్నారో.. వారు కూడా భారతీయ అస్తిత్వానికి ఆధారంగా వుంటున్నారు. గతంలో విదేశీయులు పర్యటనకు వచ్చినపుడు ఈ దేశ అస్తిత్వానికి చిహ్నాలుగా వుండే వాటిని దర్శించేవారు కాదు. కానీ.. నేడు భారతీయత కొట్టొచ్చే విధంగా, వారికి అర్థం చేయించే పరిస్థితి చేరుకున్నాం. కొన్ని రోజుల క్రితం మన దేశానికి జపాన్ ప్రధాని వస్తే.. కాశీలోని గంగాహారతి చూపించారు. భగవద్గీతను కానుకగా ఇచ్చారు. అలాగే జీ20 సమావేశంలో వసుధైక కుటుంబం అన్న మన ధ్యేయవాక్యాన్ని ఆధారం చేసుకున్నారు. ఇలా హిందూ సమాజంలో సంఘటితం భావంనిర్మాణం చేసిన కారణంగా పరిపాలకుల్లో కూడా మార్పు వస్తోంది.
ఇంత మార్పు జరుగుతున్నా.. దేశాన్ని విచ్ఛిన్నకరం చేయడానికి, స్వాభిమానం కోల్పోడానికి కొంత మంది అనేక కుట్రలు చేస్తున్నారు. మిషనరీల పేరుతో మతమార్పిళ్లు చేస్తున్నారు. అలాగే ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయిస్తున్నారు. జనాభా అసంతులం పేరుతో… హిందూ సంఖ్యని తగ్గించడానికి లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ పేరుతో పనిచేస్తున్నారు. దాంతో పాటు కమ్యూనిస్టులు కూడా పనిచేస్తున్నారు. కుట్రలతో పనిచేస్తున్నారు. కమ్యూనిజం, కల్చరల్ మార్క్సిజం పేరుతో పనిచేస్తున్నారు. మన హిందూ సంప్రదాయాలపై దాడులకు దిగుతున్నారు. ఇలా… దేశంలో ఓ విచిత్ర పోకడ నడుస్తోంది. ఈ మూడు శక్తులు దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. మరో వైపు మార్కెట్ శక్తులు కూడా పనిచేస్తున్నాయి. కానీ.. నేడు హిందూ సమాజం మేల్కొంది. నిరంతర హిందూ సమాజాన్ని సంఘటిత పరిచి సమాజాన్ని జాగృతం చేయడానికి సంఘం ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు సంఘ శతాబ్ది మనముందుంది. దాని ఉద్దేశం, లక్ష్యం ఏమిటంటే… ఏదైతే వ్యక్తి నిర్మాణం ద్వారా శాఖ జరుగుతుందో… దాని ద్వారా స్వయం సేవకుల నిర్మాణం జరగడం సంఘ మూల కారణం. దీనిని చిన్న చిన్న పల్లెల్లోకి, కాలనీలోకి తీసుకెళ్లాలి. అప్పుడే సర్వాంగీణ వికాసంతో కూడిన హిందూ సమాజం నిర్మితమవుతుంది. అందుకే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం అంతా గ్రామ గ్రామానికి సంఘాన్ని విస్తరించాలి. లక్షకి పైగా గ్రామాల్లో శాఖలు నడవాలి. ఇందుకు ఈ లక్ష్యాన్ని అర్థంచేసుకొని, అత్యధిక సమయం ఇవ్వాలి. ఈ సంఘ విస్తరణతో పాటు పంచపరివర్తన్ పేరుతో మనం పనిచేయాల్సి వుంది. సమాజంల సమరసత లోపించింది. అందరమూ సమానమే అన్న స్థాయికి తీసుకొచ్చేలా పనిచేయాలి. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. దేశ హితం కోసం పనిచేసే వాతావరణం హిందూ కుటుంబంలో రావాలి. కుటుంబంలో విలువలు నేర్పాలి. కేవలం విలువైన వస్తువులే కాదు.. విలువైన సంస్కృతిని కూడా ఇవ్వాలి.అలాగే పర్యావరణం కూడా ముఖ్యమే.
భగవంతుడు సృష్టించిన ఈ పర్యావరణాన్ని సరియైన పద్ధతిలో రేపటి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై వుంది. మన చింతన ప్రకృతికి, పంచభూతాలకు దగ్గరగా వుండే సంస్కృతి. పంచభూతాలకు అనుగుణంగా, భగవంతున్ని కొలుస్తూ జీవించే సమాజం మనది. దీనిని మనం మరిచిపోతున్నాం. మన జీవన విధానంలో పర్యావరణ పరిరక్షణ విలువలున్నాయి. వాటిని మనం ఆచరిస్తే.. పర్యవరణ పరిరక్షణ జరుగుతుంది. ఇలాంటి పరివర్తన ద్వారా మనం ఇంకా ముందుకు సాగాలి. అందుకే పంచపరివర్తన ద్వారా ముందుకు సాగాలి. మరోవైపు జనాభా పెరుగుదల. తన సృష్టి సరైన దిశలో సాగాలంటే కొన్ని పౌర నియమాలుంటాయి. ఈ పౌర నియమాలను అందరూ పాటించాలి. అప్పుడే మన సమాజం ముందుకు వెళ్తుంది. ఒకవేళ పాటించకపోతే.. సమాజానికే నష్టం. కాబట్టి సామూహిక జీవనంలో ఏది అవసరం వుంటుందో అది సమాజంలో నిర్మాణం చేయాలి.
శతాబ్ది సమయంలో ఐదు కార్యక్రమాల ద్వారా మనం సమాజంలో పరివర్తనం చేయడానికి స్వయం సేవకులు సమయం ఇచ్చి పనిచేయాలి. సజ్జన శక్తిని జాగృతం చేయడం ద్వారా సమాజాన్ని ఇంకా శక్తిమంతం చేయాలి. సంఘ కార్యాన్ని గ్రామ గ్రామానికీ తీసుకొని వెళ్లాలి.దీని కోసం నిరంతరం పనిచేయాలి. అలాగే స్వయం సేవకులు క్రమంగా సమాజానికి ఇచ్చే సమయాన్ని కూడా పెంచాలి. అత్యధిక సమయాన్ని కేటాయించి స్వయం సేవకులు పనిచేయాలి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తగా నమీద అత్యంత గురుతర బాధ్యత వుంది. దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడాని ఈ సంకల్పం చేస్తూ… పరమ పవిత్ర భారత మాత మనందరికీ ఆశీస్సులు ఇస్తుందని కోరుకుంటూ నా వాణిని ముగిస్తున్నాను.
Courtesy: vsk telangana