Khalistani terrorists recreated Indira's assassination scene in Canada |
ఇందిర హత్య దృశ్యాన్ని కెనడాలో రిక్రయేట్ చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదులు
1984 జూన్ 6న అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అమృతసర్‌లోని స్వర్ణమందిరాన్ని ఆక్రమించుకున్న పంజాబీ వేర్పాటువాది భింద్రన్‌వాలేను తుదముట్టించడానికి ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరిట పోలీసు చర్య నిర్వహించింది. 40 ఏళ్ళ నాటి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఖలిస్తానీ వేర్పాటువాదులు కెనడాలో ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరాగాంధీ హత్య ఘట్టాలను పునఃసృష్టించారు.
పంజాబ్‌ను భారతదేశం నుంచి విడగొట్టి ఖలిస్తాన్ అనే ప్రత్యేకదేశంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమించిన ఉగ్రవాది జర్నెయిల్ సింగ్ భింద్రన్‌వాలే. నిజానికి ఇందిరాగాంధీయే తన రాజకీయ ప్రయోజనాల కోసం భింద్రన్‌వాలేను పెంచి పోషించింది. ఐతే భింద్రన్‌వాలే దేశాన్నే ముక్కలుచేసే ఉగ్రవాదిగా మారేసరికి అతన్ని తుదముట్టించింది. ఆ తర్వాత కశ్మీర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం పెరగడంతో ఖలిస్తానీ వేర్పాటువాదం వెనుకంజ వేసింది. ఆ తర్వాత ఇద్దరు సిక్కులు ఇందిరాగాంధీని ప్రధాని పదవిలో ఉండగానే హత్య చేసారు.
కొన్నేళ్ళుగా, కెనడాలో స్థిరపడిన సిక్కుల్లో కొందరు వేర్పాటువాదులుగా భారత్‌కు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆ క్రమంలోనే గురువారం జూన్ 6నాడు కెనడా దేశం వాంకూవర్ నగరంలోని భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ వేర్పాటువాదులు పేట్రేగిపోయారు. ఇందిరాగాంధీ హత్య సంఘటనను రిక్రియేట్ చేసారు. సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ అనే ఇద్దరు గార్డులు ఇందిరను తుపాకులతో కాల్చి చంపిన దృశ్యాన్ని పునఃసృష్టించారు.విచిత్రమేంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకూ ఈ ఘటనను కనీసం ఖండించలేదు.
పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరంలో స్వర్ణమందిరం వద్ద కూడా అటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.