Narendra Modi |
కేంద్రంలో నరేంద్ర మోదీ సారథ్యంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈసారి మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో మగ్గురు బీజేపీ నాయకులు కాగా.. మరో ఇద్దరు ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీకి చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు నుంచి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు.
తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి. కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ కుమార్ ఉన్నారు. వీరిలో పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తొలిసారి ఎంపీలుగా గెలిచి.. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వరుసగా రెండోసారి ఎంపీలుగా గెలిచారు. మోదీ 2.0 ప్రభుత్వంలో కిషన్ రెడ్డికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.