ప్రపంచంలో హిందూ ధర్మంపై జిజ్ఞాస పెరుగుతోంది
ప్రజలందరూ ఆత్మ గౌరవంతో బతికిన రోజు ప్రపంచం మొత్తం కూడా వారందర్నీ గౌరవిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జార్ఖండ్ ప్రాంత సహ కార్యవాహ అలోక్ కుమార్ అన్నారు. మొదట మన దేశ ప్రజల్ని మనం గౌరవించాలన్నారు. నేడు ప్రపంచంలో అందరూ హిందుత్వాన్ని, హిందుత్వ సంప్రదాయాన్ని గౌరవిస్తున్నారని, హిందూ సంస్కృతిపై జిజ్ఞాస కూడా పెరుగుతోందన్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వికాసవర్గ ప్రథమ శిక్షా వర్గ సమారోప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సేవాశ్రమ సంఘ్ కార్యదర్శి స్వామి భూతేశానంద విచ్చేశారు. ఈ సందర్భంగా అలోక్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కూడా సంఘం అవసరానికయ్యే అనేక హితమైన పనులు చేసిందని, దేశ ఐక్యత, సమగ్రత కోసం సంఘ్ పనిచేస్తూ వుంటుందని వివరించారు. స్వయంసేవకులందరూ తమ తమ నిత్య జీవితంలో ‘‘పంచ పరివర్తన్’’ ను అవలంబించాని పిలుపునిచ్చారు. సామాజిక సామరస్యం, కుటుంబం, పర్యావరణ అనుకూల జీవనశైలి, పౌర విధులను నిర్వహించడం, స్వదేశీ… ఇలా ఆచరిస్తూ..సమాజం కూడా ఆచరించేలా చూడాలన్నారు. ఓ మనిషిలో సహజంగా సమాజం కోసం సేవ చేసే గుణం వుండాలని, కుటుంబ భావన కూడా పెరగాలన్నారు. రానూ రానూ కుటుంబ వ్యవస్థ ఇబ్బందులు పడుతోందని, ఈ విషయంలో సమాజాన్ని జాగృతం చేయాలని సూచించారు. ప్రపంచంలో ఏ దేశమైనా.. తమ తమ నాగరికత, సంస్కృతి ద్వారానే గుర్తింపు పొందుతుందన్నారు.
ఇక.. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్వామి భూతేశానంద మాట్లాడుతూ.. దేశంలో హిందువులను ఐక్యం చేయడానికి డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ని స్థాపించారని, అదే సమయంలో బెంగాల్లో స్వామి ప్రణవానంద మహారాజ్ భారత్ సేవాశ్రమ సంఘ్ ని కూడా స్థాపించారని తెలిపారు. ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లడమే సంఘ్ లక్ష్యమని, ఈ లక్ష్యాన్ని సాధించడానికే శిక్షా వర్గలు జరుగుతున్నాయని తెలిపారు.