Adarsh Maharani Ahalya Bai Holkar: Mohan Ji Bhagwat | video |
ఆదర్శ మహారాణి అహల్యా బాయి హోల్కర్: మోహన్ జీ భాగవత్
హిందూ దేవాలయాల జీర్ణోద్ధరణ, నూతన ఆలయాలు, ధర్మశాలలు, నదీ తీరాలలో భక్తుల కోసం ఘాట్ల నిర్మాణం… ఇలా సనాతన ధర్మ వెలుగులను దేశమంతటా వ్యాపింపజేసిన రాజమాత దేవీ అహల్యబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలు నేటి నుంచీ (మే 31, 2024) దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ పరమ పూజ్యనీయ మోహన్ భాగవత్ జాతిని ఉద్దేశించి దేవీ అహల్యా బాయి ధర్మనిరతను తమ ప్రసంగం ద్వారా విశదీకరించారు. ఆ ప్రసంగం యథాతథంగా..
“ఈ సంవత్సరం పుణ్యశ్లోక్ దేవి అహల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె వ్యక్తిత్వం మనకు ఆదర్శం. దురదృష్టవశాత్తు ఆమెకు చిన్నతనంలోనే వైధవ్యం వచ్చింది. ఒంటరి మహిళ అయినా, అంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడమే కాకుండా… విస్తరించడం కూడా చేశారు. కేవలం విస్తరించడమే కాకుండా.. సుపరిపాలన కూడా అందజేశారు. అసలు రాజ్య పరిపాలకురాలు ఎలా వుండాలో అందుకు అహల్యాబాయి ఉదాహరణగా నిలిచారు. ఆమె పేరు ముందు ‘‘పుణ్యశ్లోక’’ అన్న పేరు కూడా చేర్చబడిరది. ప్రజలను దు:ఖం నుంచి, ఆపదల నుంచి విముక్తి చేసినందుకే ఆమె పేరు పక్క ఈ పదం (పుణ్యశ్లోక) చేర్చారు. అప్పట్లో రాజ్యాలను ఆదర్శంగా పాలించేవారేవరైతే వున్నారో.. ఆ జాబితాలో అహల్యాబాయి హోల్కర్ కూడా ఒకరు.
Mohan Ji Bhagwa |
పకడ్బందీగా పరిశ్రమలు…
ప్రజలకు ఉపాధి కల్పించేందుకు దేవి అహల్యాబాయి అనేక పరిశ్రమలను అత్యంత పకడ్బందీగా నెలకొల్పారు. ఎంత పక్కాగా అంటే.. మహేశ్వర్ వస్త్ర పరిశ్రమ అనేది నేటికీ నిరాటంకంగా కొనసాగుతూనే వుంది. నేటికీ అనేకమందికి ఉపాధి కల్పిస్తోంది ఈ పరిశ్రమ. అహల్యా బాయి తన రాజ్యంలోని అన్ని వర్గాల ప్రజలపై దృష్టి సారించారు. ముఖ్యంగా బలహీన, వెనుకబడ్డ వర్గాలపై ఎక్కువ శ్రద్ధ వహించారు. అలాగే తన రాజ్యంలో పన్నుల విధానాన్ని పూర్తిగా అదుపులో వుంచారు. రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీంతో ఆమె రాజ్యం అన్ని రకాలుగా సుభిక్షంగా వుండేది. ప్రజలను తన సొంత పిల్లల్లాగే చూసుకున్నారు. అందుకే ఆమెకు ‘‘దేవి అహల్యా బాయి’’ అన్న బిరుదు వచ్చిందేమో.
నారీశక్తికి ప్రతీక అహల్యా బాయి…
మాతృశక్తి ఎంత శక్తిమంతంగా ఉంటుందో… ఎంతగా పనిచేస్తోందో… అదంతా అహల్యాబాయి చేసి చూపించారు. అహల్యా బాయి జీవితం ఆదర్శప్రాయమైంది. తన జీవితం ద్వారా ఆ ఆదర్శ తత్వాన్ని ఆమె మనకి అందించారు. ఆమె చేసిన పనులన్నీ చాలా ప్రత్యేకమైనవి. ఆనాటి పాలకులందరూ ఆమెను దేవతా స్వరూపంగానే భావించేవారు. అందరితోనూ ఆమె స్నేహ పూర్వక సంబంధాలనే నెరిపారు. తన రాజ్యం మీద ఎలాంటి దాడులు జరగకుండా ఎన్నో ఏర్పాట్లు చేసిన గొప్ప వ్యూహకర్త. యుద్ధ నీతిలో నిపుణురాలిగా పేరు గడిరచారు. మన దేశ సాంస్కృతిక పునాదిని మరింత బలోపేతం చేయడానికి దేశంలోని కొన్ని ప్రాంతాల్లో దేవాలయాలను నిర్మించారు. దేవి అహల్యా బాయి స్వయంగా పాలకురాలైనప్పటికీ ఎప్పుడూ తనను తాను పాలకురాలిగా భావించుకోలేదు. శివుడి ఆజ్ఞ మేరకే తాను పరిపాలన చేస్తున్నానని ఆమె విశ్వసించారు. ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఆమె మనకు ఆదర్శప్రాయురాలు. ఆమెను ఆదర్శంగా తీసుకుంటూ.. ఏడాది పొడువునా స్మరించుకొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా సంతోషించదగ్గ విషయం.