We are looking for a way to distribute those piles of notes to the poor: PM Modi - |
అక్రమార్కుల నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు వెలికి తీస్తున్న సొమ్ముపై ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల హయాంలో కొంతమంది అక్రమార్కులు పేదల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఈడీ దాడులలో బయటపడుతున్న నోట్ల కట్టల గుట్టలన్నీ పేద ప్రజల సొమ్మేనని, దానిని తిరిగి పేదల వద్దకే చేర్చేందుకు మార్గం వెతుకుతున్నామని వివరించారు. ఇందుకోసం అవసరమైతే చట్టాలను మార్చే ఏర్పాట్లు చేస్తామన్నారు.
దీనిపై న్యాయ బృందం సలహా కోరతామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడించారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థలను ఎన్డీయే సర్కారు దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా మారిన ఈడీకి తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. దీంతో ప్రస్తుతం కేంద్ర దర్యాఫ్తు సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు.