జనాభాలో...
- హిందువులు వాటా 1950-84.68% 2015-78.06% తగ్గుదల 7.82%
- ముస్లింల వాటా 1950-9.84 % 2015-14.09% పెరుగుదల 43.15%
ఈ సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం రిజర్వేషన్ల గురించి దేశంలో పెద్ద చర్చ తీసుకురావడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఆర్జేడీ విశ్వప్రయత్నం చేశాయి. ఇండీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ ఢంకా బజాయిస్తున్నాయి.
ఇందుకు విరుద్ధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తామని బీజేపీ తన విధానంగా ప్రచారం చేసుకుంది. ప్రతిపక్షాలు మైనార్టీ బుజ్జగింపులకు పాల్పడుతూ, వారిని అల్పసంఖ్యాకులుగా అభివర్ణిస్తున్న నేపథ్యంలో వెలువడిన మతపరమైన గణాంకాలు వాటి గొంతుకల్లో పచ్చి వెలక్కాయ పడేటట్టు చేశాయి. ఈ గణాంకాల ప్రకారం 1950-2015 మధ్య కాలంలో మెజారిటీ హిందూ జనాభా వృద్ధి 7.8శాతం తగ్గగా, ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగింది. మొత్తం 167 దేశాలకు సంబంధించి మతపరమైన జనాభా వృద్ధి, తరుగుదలను విశ్లేషించిన ప్రధానమంత్రి ఆర్ధిక సలహా మండలి (ఇఎసి-పిఎం) సభ్యులు ప్రచురించిన పత్రంలో ఈ అంశాలు వెలుగు చూశాయి. ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ జనాభా తగ్గిన దేశాలలో భారత్ రెండవ స్థానంలో ఉందని ఆ పత్రం తేల్చింది. దాదాపు 10శాతం క్షీణతతో మయన్మార్ తొలి స్థానంలో ఉంది. ఈ పత్రాన్ని ఇఎసి-పిఎం సభ్యులు షమిక రవి, ఇఎసి-పిఎం కన్సల్టెంట్ అపూర్వ కుమార్ మిశ్ర, ఇఎసి-పిఎం ప్రొఫెషనల్ అబ్రహాం జోస్ రూపొందించారు.
‘‘భారతదేశం 1950-2015 నుంచి మెజారిటీ మతస్థుల వాటాలో 7.8 శాతం తగ్గుదలను (84.68శాతం నుంచి 78.06 శాతానికి) చూపింది. ముస్లిం జనాభా వాటా 1950లో 9.84 ఉండగా, 2015 నాటికి 14.09కి (మార్పు) పెరిగింది. ఇది వారి వాటాలో 43.15శాతం పెరుగుదల. దక్షిణా సియాలో పొరుగునే ఉన్న దేశాలలో మయన్మార్ తర్వాత భారత్‌లోనే మెజారిటీ జనాభా పెరుగుదలలో క్షీణత కనిపించింది,’’ అని ఆ పత్రం పేర్కొంది.
‘‘పలు వర్గాల నుంచి వినిపించే, పక్కదోవ పట్టించే వాదనలకు భిన్నంగా, అత్యంత జాగ్రత్తగా విశ్లేషించిన డాటా ప్రకారం, భారత్‌లో మైనార్టీలకు రక్షణను ఇవ్వడమే కాదు, వారు అభివృద్ధి చెంది పురోగమిస్తున్నారు. దక్షిణాసియాలో పొరుగున గల దేశాలలో మెజారిటీ మతస్థుల వాటా పెరుగగా, మైనార్టీ జనాభా ఆందోళన కలిగించే విధంగా క్షీణించింది. ముఖ్యంగా బాంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, అఫ్ఘానిస్తాన్‌లలో మైనార్టీల సంఖ్య గణనీయంగా తగ్గింది,’’ అని పత్రం పేర్కొంది.
అసోసియేషన్ ఆఫ్ రెలీజియస్ డేటా ఆర్కైవ్స్ (ఎఆర్డిఎ) 2019లో ప్రచురించిన దేశ జనసంఖ్యా సంబంధ మతపరమైన లక్ష్యాలకు సంబంధించిన డేటా సెట్ ప్రాజెక్ట్ నుంచి ఈ జనాభా సంబంధ డేటాను వర్కింగ్ పేపర్ ఉపయోగించింది.
అవిభక్త సమూహంగా మైనార్టీల వాటా చెప్పుకోదగినంతగా పెరిగింది. ముఖ్యంగా, భారత్‌లో ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు జనాభాల వాటా పెరుగగా, జైన,పార్సీ జనాభాలో క్షీణత కనిపించింది.
క్రైస్తవ జనాభా 2.24 శాతం నుంచి 2.36 శాతం పెరిగి, 1950-2015 మధ్య కాలంలో వారి జనాభా వాటాలో 5.38శాతం వృద్ధి రేటు చూపింది. ఇక సిక్కు జనాభా 1950లో 1.24 శాతం నుంచి 2015లో 1.85 శాతానికి పెరిగి, వారి వాటాలో 6.58 శాతం పెరుగుదలను చూపింది. బౌద్ధ జనాభాలో కూడా గణనీయమైన పెరుగుదల కనిపించింది. వారి జనాభా 1950లో ఉన్న 0.05 శాతం నుంచి 0.81 శాతం పెరిగింది.
మరొక వైపు, భారతదేశంలో జైనుల జనాభా 1950లో ఉన్న 0.45శాతం నుంచి 2015 నాటికి 0.36 శాతానికి పడిపోయింది. ఇక పార్సీ జనాభాలో 85 శాతం క్షీణత కనిపించింది.1950లో ఉన్న 0.03 శాతం వాటా నుంచి 2015లో 0.004 శాతానికి పడిపోయిందని పత్రం పట్టి చూపింది.
‘‘సమాజంలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు తగిన వాతావరణం ఉందని భారత్ ఆచరణ సూచిస్తోంది. దిగువ నుంచి ఎగువకు అన్న విధానం ద్వారా పెంపొందించే వాతావరణం, సామాజిక మద్దతును అందించకుండా సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మెరుగైన జీవన ఫలాలను సాధించడం, ప్రోత్సహించడం సాధ్యం కాద’’ని పత్రం పేర్కొంది.
మైనార్టీలకు సంబంధించిన చట్టపరమైన నిర్వచనం కలిగి, రాజ్యాంగపరంగా రక్షణ కల్పించే హక్కులను అందించిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. ఈ ప్రగతిశీల విధానాలు, సమ్మిళిత వ్యవస్థల ఫలితాలు భారత్‌లో పెరుగుతున్న మైనార్టీ జనాభాల సంఖ్యల ద్వారా ప్రతిఫలిస్తున్నాయి.
పెరుగుతున్న ముస్లిం మెజారిటీ
దక్షిణాసియా పొరుగుకు సంబంధించిన విస్తృతి నేపథ్యంలో మెజారిటీ మతపరమైన జనాభా వాటా పెరుగగా, బాంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల వ్యాప్తంగా ఆందోళన కలిగించే రీతిలో మైనార్టీల జనాభా తగ్గడం ప్రత్యేకంగా గమనించవలసిన అంశం. ‘‘కనుక, నిర్బంధం పెరిగిన సమయాలలో పొరుగు దేశాల నుంచి మైనార్టీ జనాభా భారత్‌కు రావడం ఆశ్చర్యం కలిగించే విషయం కాదు’’ అని పత్రం పేర్కొంది.
భారత ఉప ఖండంలో అన్ని ముస్లిం మెజారిటీ దేశాలలో వారి మత జనాభా బాహుళ్యం పెరగడానికి సాక్షిగా ఉన్నాయి. మెజార్టీ సమూహం (షఫీఈ సున్నీల) వాటా 1.47 క్షీణించిన మాల్దీవులు మాత్రం వీటి నుంచి భిన్నంగా ఉంది.
బంగ్లాదేశ్‌లో మెజారిటీ మత సమూహం 18శాతం పెరిగింది. భారత ఉప ఖండంలో ఇది అతి భారీ పెరుగుదలగా చెప్పుకోవాలి. పాకిస్తాన్లో మెజారిటీ మత వర్గం (హనాఫీ ముస్లిం) 3.75శాతం పెరుగగా, 1971లో బంగ్లాదేశ్‌ను సృష్టించినప్పటికీ మొత్తం ముస్లిం జనాభా 10 శాతం పెరుగుదలను చూపింది. ముస్లిమేతర మెజారిటీ కలిగిన దేశాలలో కేవలం శ్రీలంక, భూటాన్ మాత్రమే 1950 -2015 మధ్యకాలంలో మెజారిటీ మత వర్గంలో పెరుగుదలను చూపాయి.
గత ఆరు దశాబ్దాల కాలంలో చైనా నుంచి తప్పించుకొని వచ్చి భారత్‌ను తమ సౌకర్యవంతమైన నివాసంగా చేసుకున్న టిబెటన్ బౌద్ధులకు ఇక్కడ అనువైన వాతావరణం లభించింది. అలాగే, బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస, అత్యాచారాలను తాళలేక భారత్‌లో ఆశ్రయం పొందిన మతువాలు భారతీయ సమాజంతో సమీకృతమై, కలిసిపోయారు. శ్రీలంక, పాకిస్తాన్, మయన్మార్, అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన శరణార్ధుల జనాభా భారత్‌లో ఉంటున్నారు.
బహుళత్వం, ఉదారవాద, ప్రజాస్వామిక స్వభావం కలిగిన భారత్, గత ఆరు దశాబ్దాలుగా పలు దేశాల నుంచి వచ్చిన పీడిత జనాభాకు ఆశ్రయ మిచ్చే తన నాగరికతా సంప్రదాయాన్ని కొనసా గించింది.
ముస్లిమేతర మెజారిటీ కలిగిన దేశాలలో మయన్మార్, భారత్, నేపాల్‌లలో మెజారిటీ మతవర్గం వాటా క్షీణత కనిపించింది. ఈ ప్రాంతంలో మెజారిటీ మత సమూహం క్షీణత అత్యధికంగా మయన్మార్ లో కనిపించింది. ముఖ్యంగా అధ్యయనంలో ఉన్న కాలంలో తెరవాద బౌద్ధ జనాభా వాటాలో 10శాతం తగ్గుదలతో అత్యంత క్షీణతను చవి చూసింది.
నేపాల్‌లోని ప్రధాన మూడు మతాలలో, మెజారిటీ హిందువుల జనాభా 4శాతం తగ్గగా, బౌద్ధుల జనాభా 3శాతం క్షీణించగా, ముస్లిం జనాభా 2శాతం పెరిగిందని పత్రం పేర్కొంది.
భారతదేశానికి భౌగోళికంగా సామీప్యతతో ఉన్నందున ఈ దేశాలలో జనాభా మార్పుల కూర్పును గమనించడానికి తాము ఆసక్తి చూపామని పత్ర రచయితలు పేర్కొనడం గమనార్హం. కనుక, వారి జనాభాలో వచ్చే ఏవైనా హెచ్చుతగ్గులు భారతదేశ రాజకీయాలు, విధానాలపై విస్తృత ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి తాజాగా ఇచ్చిన వివరాలను వెంటనే సీపీఐ నాయకుడు డి. రాజా, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ వెంటనే తప్పు పట్టారు. ఇది ఆశ్చర్యపడవలసిన అంశమేమీ కాదు. గణాంకాల సాక్షిగా చెప్పినా సరే, ఇదంతా ఆర్ఎస్ఎస్, బీజేపీల కుట్ర అంటూ పెట్రేగిపోతున్న అమాంబాపతు పార్టీల నేతలు ఒక్కసారి ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన టీవీ రాజేశ్వర్ చేసిన హెచ్చ రికలు గుర్తు చేసుకోవాలి. ఈ హెచ్చరికలు, వాటి వెనుక ఉన్న వాస్తవాలు బీజేపీ అధికారానికి ఆమడ దూరంలో ఉన్న కాలంలో చేసినవే. ప్రధానమంత్రి ఆర్థికమండలి తాజాగా ఇచ్చిన లెక్కలే కాదు, దాదాపు మూడు దశాబ్దాల క్రితం నాటి రాజేశ్వర్ వంటి వారి అధ్యయనం ఒకే విషయం చెబుతాయి. అది- ముస్లిం జనాభా పెరుగుదల దేశానికి చేటు చేస్తుంది. జీవన వైవిధ్యానికి హాని చేస్తుంది.
మనం కళ్లు మూసుకుని కూర్చుంటే ఉప ఖండంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పాటు మరొక ముస్లిం రాజ్యం తిష్ట వేస్తుందంటూ రాజేశ్వర్ వెలిబుచ్చిన ఆక్రోశం గమనించదగినది. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు, కమ్యూనిస్టు ప్రభుత్వాలు దొంగ నిద్ర నటించడం వల్ల జరిగిందే మిటో ది హిందూస్తాన్ టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలోను ఆయన ప్రస్తావించారు. మన సరిహద్దు లలో తామరతంపరగా పెరిగిపోయిన ముస్లిం జనాభా గురించి రాజేశ్వర్ లెక్కలు ఇచ్చారు. ఆ వ్యూహాత్మక ప్రాంతాలలో జనాభా సమీకరణాలు పూర్తిగా మారిపోయి భారత సమైక్యతకు భంగం ఏర్పడిన సంగతి గుర్తించాలని ఆయన హెచ్చ రించారు.
తమిళుడైన రాజేశ్వర్ 1949 నాటి ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారు. నిజామాబాద్, రాయ్‌చూర్, గుంటూరులలో పనిచేసినవారే. చిరకాలం హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ (1989-90), ఉత్తరప్రదేశ్ (2004-09) గవర్నర్‌గా కూడా సేవలు అందించారు.
రాజేశ్వర్ ఇచ్చిన లెక్కలు ఇలా ఉన్నాయి: 1951 నాటి భారత జనాభాలో ముస్లిములు 9.9 శాతం. 1971లో 10.8 శాతం 1981లో 11.3 శాతం. 1991లో 12.1 శాతం. ఇవి దేశం మొత్తం మీద ఉన్న శాతాలు. 1991 నాటికి అస్సాంలో 28 శాతం, బెంగాల్లో 25 శాతం. 1991 నాటికే పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలలో ముస్లిం జనాభా ఎలా ఉందో కూడా రాజేశ్వర్ చెప్పారు. దక్షిణ, ఉత్తర పరగణాలలో ముస్లిం జనాభా 54 శాతం. మాల్డా ప్రాంతంలో దాదాపు 52 శాతం. పశ్చిమ దినాజ్‌పూర్‌లోని ఇస్లాంపూర్ సబ్ డివిజన్లో 60 శాతం. 1991 ప్రాంతంలోనే జరిగిన ఒక అధ్యయనం ప్రకారం పశ్చిమ బెంగాల్ సరిహద్దు గ్రామాలలో 20 నుంచి 40 శాతం గ్రామాలు (సరిహద్దులలోని జిల్లాలోనివి ఇవి) ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్న గ్రామాలుగా మారిపోయాయి.
బంగ్లా చొరబాటుదారులతో పాటు ముస్లింలంతా ఒక్కచోటే కేంద్రీకృతం కావడం వల్ల అటు రాజకీయం గాను, ఇటు భద్రతా కోణం నుంచి దేశం బలహీన మవుతుందని కూడా ఆనాడే ఆ అధ్యయనం హెచ్చరించింది. ఇప్పుడు దాని వాస్తవరూపం మనం చూస్తున్నాం. కానీ ఆ పరిస్థితిని అదుపు చేయకుండా మమతా బెనర్జీ వంటి వాళ్లు అక్కడ ముస్లింలను కాపాడుతూ వస్తున్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం సరిహద్దులలోనే కాకుండా పశ్చిమ బెంగాల్లోనే బార్పెటా, నవగావ్, మారిగావ్, దరంగా జిల్లాలకు కూడా బంగ్లా చొరబాటుదారులు పాకిపోయారు. ఈ లెక్కలన్నీ నిఘా వర్గాలు రూపొందించనవే.
అస్సాంలో ముస్లిం జనాభా పెరుగుదల కూడా ఆందోళన కలిగించేదే. 1991 నుంచి 2001 మధ్య అక్కడ ముస్లిం జనాభా 29.3 శాతం పెరిగింది.అదే సమయంలో ముస్లిమేతరుల పెరుగుదల కేవలం 14.8 శాతం.
ముస్లిం జనాభా పెరుగుదలలో అవిద్య, దారిద్య్రాలను చూడాలి తప్ప దేశ భద్రత వంటి విషయాలతో కొలవరాదని నాటి కాంగ్రెస్ నేతలు చెప్పడం విశేషం. నాటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి గిరిజా వ్యాస్ ఇలా అన్నారు: జనాభా పెరుగుదల దేశంలోని అన్ని మతాలలోని పేదలు, నిరక్షరాస్యులు కుటుంబ నియంత్రణ పాటించనందువల్ల సంభవించిన పరిణామమే. దీనితో మతానికి గాని, దేశభక్తికి గాని ఎలాంటి సంబంధం లేదు. కానీ కాస్త కళ్లు తెరవడానికి ప్రయత్నించినవారు అభిషేక్ సింఘ్వి. ఆయన మాత్రం జనాభా అదుపునకు చట్టాలు తేవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. కాంగ్రెస్ భావిస్తున్నట్టు ముస్లిం జనాభా పెరుగుదల కేవలం అవిద్య, దారిద్య్రాలకు సంబంధించినదేనా? దీనికి బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరూ అంగీకరించరు. నిజానికి ముస్లిం జనాభా పెరుగుదల మొత్తం ప్రపంచ వ్యాప్త సమస్య. ది మాన్యుమెంటల్ స్టడీ రెలిజియస్ డెమాగ్రఫి ఆఫ్ ఇండియా (సెంటర్ ఫర్ పబ్లిక్ రిసెర్చ్, చెన్నై) ఆ సంగతి చెప్పింది. ప్రపంచ జనాభాలో ముస్లింల వాటా గణనీయంగా పెరిగింది. 1900 సంవత్స రంలో 12.4 శాతం ఉన్న ముస్లిం జనాభా 1990 నాటికి 18.7 శాతం పెరిగిందని ఆ అధ్యయనం చెప్పింది. అంతేకాదు, ఆ వర్గం మాత్రమే 20వ శతాబ్దంలో అంత భారీగా జనాభాను పెంచుకుందని కూడా కుండబద్దలు కొట్టి చెప్పింది. జనాభ పెరగడం వల్ల ఒనగూడే ప్రయోజనాల పట్ల గట్టి స్పృహ కలిగిన ఏకైక వర్గం ముస్లిములే కూడా. ప్రపంచంలో శరవేగంగా పెరుగుతున్న మతం ఒక్క ఇస్లామ్ మాత్రమేనని వారు సగర్వంగా చెప్పుకుంటారు. దీనికి ఎంచుకున్న మార్గాలు ఎక్కువ మందిని కనడం, మత మార్పిడి, పెళ్లిళ్ల ద్వారా తమ వారి సంఖ్యను పెంచడం. మతమార్పిడిని ఇస్లామ్‌లో పవిత్ర కర్తవ్యంగా భావిస్తారు. మరొక విషయం కూడా ఉంది. భారత ప్రభుత్వం సదా ముస్లిం వాస్తవ జనాభాను దాచి పెడుతుందని చెబుతారు. కొద్దికాలం క్రితం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సభలో దేశంలో ముస్లింలు 25 శాతం ఉంటారని పేర్కొన్నారు. జననాలు కూడా ఇందుకు సాక్ష్యం పలుకుతాయి. ముస్లింలో జననాలు 18.7 శాతం. ఇది ఎక్కువ. అతి తక్కువ జైన్స్‌లో ఉంది. వారి శిశు జననాల శాతం 10.6 శాతం. ముస్లిం జనాభా పెరుగుదల గురించి మాట్లాడడం సెక్యులర్ విలువలకు విరుద్ధమనీ, మెజారిటీవాదాన్ని ప్రోత్సహించడమేననీ చాలా పార్టీలు వాదించవచ్చు. కానీ ఉదారవాదులు అలా మాట్లాడడమంటే ముస్లింలను ఆధునిక ప్రపంచ జీవన విధానం నుంచి దూరం చేయడమే. ఆధునిక యుగంలో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలతోనే కుటుంబాలు ఉంటున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ అయితే సంతాన నిరోధక పద్ధతులు (కండోమ్‌లు) ఎక్కువగా వాడేవారు ముస్లింలేనని ఒక ప్రకటన కూడా ఇచ్చారు. ఇవన్నీ బూటకమని మరొకసారి తేలిపోయింది. ఒక వర్గం జనాభా గణాంకాల గురించి, దాని వెనుక ఉన్న లక్ష్యాలు గురించి, జరుగుతున్న పరిణామాలు, పర్యవసానాల గురించి బాహాటంగా మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు మాత్రమే నివురు గప్పిన నిప్పు గురించి అందరికీ తెలుస్తుంది. ఒక దేశం, అసలు ప్రపంచం ఒకే మతాన్ని ఆచరించడానికి సిద్ధంగా ఉండదు. ప్రజావళి వైవిధ్యాన్ని కోరుకుంటుంది. 21 శతాబ్దంలోకి వచ్చిన ప్రపంచాన్ని మధ్యయుగాలలోకి తీసుకువెళ్లే ప్రయత్నం నిస్సంకోచంగా నిరోధించదగినదే.
——–
జర్మనీని ఖిలాఫత్‌ను చేసి, షరియా అమలు చేయాలట!
ఈ సంవత్సరం ఏప్రిల్ మాసాంతంలో జర్మనీ నుంచి వచ్చిన ఒక వార్త ప్రపంచ దేశాలను ఆలోచింప చేసింది. ఏప్రిల్ చివరిలో జర్మనీలోని హ్యామ్‌బర్గ్, సెయింట్ జార్జ్ పట్టణాలలో ఓ అరుదైన, అదే సమయంలో ప్రపంచానికి హెచ్చరిక అనదగిన రెండు ప్రదర్శనలు జరిగాయి. అల్లాహు అక్బర్ అంటూ హ్యామ్‌బర్గ్ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నవాళ్లు కేవలం కొన్ని వందలు. అంతా కలిపి వేయి వరకు ఉంటారు. సెయింట్ జార్జ్‌లో కూడా అంతే. వాళ్ల నినాదాలు ఇలా ఉన్నాయి: జర్మనీలో ఇస్లామిక్ పాలన రావాలి. ముస్లిం వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక్కటే పరిష్కారం ఖిలాఫత్ (ముస్లిం విశ్వగురు పీఠం) ఆవిర్భావం. షరియాను అమలు చేయాలి. సెయింట్ జార్జ్‌లో జరిగిన ప్రదర్శన రహీమ్ బోటెంగ్ అనేఅతని నాయకత్వంలో జరిగింది. ఇతనికి ముస్లిం ఇంటరాక్టివ్ అనే ముస్లిం తీవ్రవాద సంస్థ మద్దతు ఇచ్చింది. హ్యామ్‌బర్గ్ ప్రదర్శన వెనుక ఉన్నది కూడా ముస్లిం ఇంటరాక్టివ్ సంస్థే. ‘విలువల మీద హక్కుల మీద జర్మనీ నియంతృత్వం ప్రదర్శిస్తు న్నది’, ‘సమాచార యుద్ధంలో పాలస్తీనా విజయం సాధించింది’ వంటి నినాదాలు రాసిన ప్లకార్డులు కూడా వాళ్లు పట్టుకున్నారు. జర్మన్ ప్రభుత్వమే ఇస్లాం వ్యతిరేకి కాబట్టి, ఇజ్రాయెల్ -హమాస్ యుద్ధం గురించి ఈ దేశ మీడియా ముస్లిం వ్యతిరేక ప్రచారం చేస్తున్నదని ఈ ప్రదర్శనకారులు ఆరోపించారు.
ఇక్కడ సెయింట్ జార్జ్ ప్రదర్శనకు నాయకత్వం వహించిన రహీమ్ బెటెంగ్ గురించి కాస్త చెప్పుకో వాలి. ఇతడు జర్మనీ పౌరుడు. కేవలం ఎనిమిదేళ్ల క్రితం ఇస్లాం తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు తానే ఇతడు ఇమామ్‌ను అని చెప్పుకుంటున్నాడు. టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పేరు మోశాడు. ఎంత చిత్రమో చూశారా? ఎనిమిదేళ్ల క్రితం మతం మారితేనే ఇంత మతోన్మాదమా? సొంత దేశమే ఇస్లామిస్టు రాజ్యం కావాలని ఉద్యమం చేయడమా? ఈ విపరీతానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి? ప్రపంచ ఆలోచించి తీరాలి. హ్యామ్‌బర్గ్‌లో కూడా వేయి మందికి పైగా ముస్లింలు ఒక ప్రదర్శన నిర్వహించారు. ఇది జర్మన్ మీడియాలో వచ్చింది. కొన్ని ప్లకార్డులు కూడా వాళ్ల చేతులలో ఉన్నాయి. ఖిలాఫత్ సమస్యకు పరిష్కారం అన్న రాతలతో ఉన్న ప్లకార్డు కూడా అందులో ఉంది. దేశంలో షరియా అమలు పరిస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వారి కోరిక. ఈ ప్రదర్శనలో పాల్గొన్నవారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని జర్మన్ చాన్సలర్ ఒలాఫ్ షుల్జ్ హెచ్చరించారు కూడా. ఖిలాఫత్ కావాలనుకునే వారు జర్మనీలో ఉండలేరని దేశీయ వ్యవహారాల మంత్రి నాన్సీ ఫీజర్ హెచ్చరిం చారు. ఇలాంటి ప్రదర్శనలు ఎందుకు జరుగుతున్నా యంటే ముస్లింలను రక్షించడంలో జర్మనీ ప్రభుత్వం విఫలం కావడం వల్లనేనని చాటించే ఎన్జీవోలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి.
మొత్తం జర్మనీలో షరియా ఎందుకు విధించాలి? అక్కడ ముస్లిం జనాభా ఎంత? కేవలం ఆరు సంవత్సరాలలో (2010-2016) జర్మనీలోని ముస్లిం జనాభా 3.3 మిలియన్ల నుంచి, దాదాపు 5 మిలియన్లకు పెరిగింది. 81 మిలియన్ జనాభాలో ముస్లింలు నాలుగో వంతు. దీనికే అక్కడ షరియా అమలు చేయాలని ముస్లింలు కోరుతున్నారు.
ముస్లింలతో పోలిస్తే జర్మనీలో మిగిలిన వర్గాల జనాభా 77.1 మిలియన్ నుంచి 76.5 మిలియన్‌కు పడిపోయింది. ముస్లిం జనాభా పెరగడానికి కారణమే వలసలు. ఇప్పుడు వలసలు ఆపేసినా ముస్లిం జనాభా పెరుగుతూనే ఉంటుంది. సగటున చూస్తే మిగిలిన వర్గాలలోని యువత, శిశు జననాల కంటే ముస్లింలలో అవి చాలా అధికంగా ఉన్నాయి. మొత్తం ఐరోపా జనాభాలో ముస్లిం జనాభా 2016 నాటికి 4.9 శాతం ఉంది. ఇవన్నీ పిఈడబ్ల్యు సెంటర్ ఇచ్చిన వివరాలు.
Courtesy: jagruti