Rashtriya Swayamsevak Sangh Sarkaryavah Dattatreya Hosabale |
స్వామి చిన్మయానంద ఓ ఆధ్యాత్మిక విప్లవకారుడు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే
ఆధ్యాత్మిక రంగంలో స్వామి చిన్మయానంద ఓ విప్లవకారుడు అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. స్వామీజీ జ్ఞానాన్ని పంచడం ద్వారా, ఆత్మవిశ్వాసాన్ని నింపడం ద్వారా ప్రజలను శక్తివంతం చేశారని కొనియాడారు. ప్రపంచ హిందూ సంస్థను స్థాపించాలని ఆయన ఆకాంక్షించారని, రామజన్మభూమి ఉద్యమానికి మద్దతు పలికారని తెలిపారు.
స్వామిజీ ఈ రెండు ప్రధాన ఆకాంక్షలను ఆర్ఎస్ఎస్ ద్వారా నెరవేర్చుకోగలిగామని ఆయన చెప్పారు. హిందువుల ఓటు బ్యాంకు ఏర్పాటు గురించి చిన్మయానంద వాదించినప్పుడు చాలామంది ఎగతాళి చేశారని దత్తాత్రేయ గుర్తు చేశారు. కొచ్చిలో చిన్మయ మిషన్ నిర్వహించిన `చిన్మయ శంకరం 2024’లో జరిగిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
స్వామీజీ జీవితం, ఆలోచనలు సముద్రపు లోతు, హిమాలయాల ఎత్తును కలిగి ఉన్నాయని చెప్పారు. “ఆయన ఒక ఆధ్యాత్మిక గురువు. శంకరాచార్య, నారాయణ గురు, చట్టంపి స్వామికల్, మహాత్మా అయ్యంకాళి, మాతా అమృతానందమయి మొదలైన వారి నుండి మొదలుకొని, కేరళ అనేక మంది ఆధ్యాత్మిక గురువుల భూమి. స్వామి చిన్మయానంద వారిలో వెలుగుతున్న తార” అంటూ వివరించారు. యువకుడిగా, బాలకృష్ణ మీనన్ సంప్రదాయ భావజాల ఆలోచనల నుండి ప్రేరణ పొందారు. అదే సమయంలో, ఆయన ఆచారాలను, గుడ్డి నమ్మకాలను ప్రశ్నించారు. తన చిన్న వయస్సులో కూడా, సామాజిక సమస్యలలో చురుకుగా నిమగ్నమై ఉన్నారని తెలిపారు. గీతా జ్ఞాన యజ్ఞాలు జరపడంతో పాటు స్వామీజీ గొప్ప రచనలు జరిపారని, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇతర గ్రంథాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని వివరించారు.
గీతపై ఆంగ్లంలో ఉపన్యాసాలు ఇచ్చారని చెబుతూ చాలా మంది తనను విమర్శించినా తన దృష్టి భారతదేశపు జ్ఞానాన్ని ప్రపంచానికి వ్యాప్తి చేయడం తన ప్రాధాన్యత అని స్వామి చిన్మయానంద తన బోధనలలో స్పష్టం చేశారని తెలిపారు.