జాతిలో ఆత్మవిశ్వాసమే డాక్టర్‌జీ జీవిత సందేశం
సంవత్సరాది నాడు రాబోయే సంవత్సరంలో పొందబోయే సుఖాలను ఊహించుకుని మనిషి ఆనందపడతాడు. మనసులో నవోత్సాహం పొంగుతూ ఉంటుంది. తన వయసు ఒక సంవత్సరం పెరిగిందన్న దురభిమానం కూడా ఉంటుంది. కాని మృత్యువు మరొక సంవత్సరం దగ్గరైందన్న ఆలోచన రాదు. నిజానికి ఈ విషయాన్నే దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న జీవితంలో చేసే కార్యాలకు మరింత శక్తిని, బుద్ధిని, వేగాన్ని జోడించడం అవసరం.
ఆజీవన కార్యం
మన అంతఃకరణలలోని ఉదాత్త భావనలు అక్కడే ఉండిపోకూడదు. అవి కాస్తంత ఇతరులకూ అందాలి. సంఘకార్యాన్ని జీవితాంతము చేస్తూనే ఉంటామని మనం నిశ్చయం తీసుకున్నాం. ఫలానా సమయం వరకూ హిందూ రాష్ట్రాన్ని సేవిస్తానని, ఆపైన విశ్రాంతి తీసుకుంటానని ఏ స్వయం సేవకుడూ ఎప్పుడూ అనుకోడు.
సంఘకార్యానికి దోహదం
ఈనాటి శుభసందర్భంలో మనం మన నిశ్చయాన్ని మళ్లీ ప్రకటించుకొని, ముదుకు సాగాలని సంకల్పిస్తున్నాం. సంఘకార్యం పట్టణాల జనాభాలో ముడు శాతానికి, గ్రామాల జనాభాలో ఒక శాతానికి విస్తరించడం అవసరమని కొన్ని సంవత్సరాల క్రితం పూజనీయ డాక్టర్ హెడ్గేవార్ చెప్పి ఉన్నారు. ఆ పరిమితిని అందుకునేందుకై మనం కృషిచేయాలి.
మరొకరకంగా కూడా ఈ శుభదినం మనకు మహత్వపూర్ణమైనది. సంఘం అనే భావనకు రూపాన్ని ఇచ్చిన ఆద్య సర్‌సంఘచాలక్ పూజనీయ డా।। హెడ్గేవార్ జన్మించినది ఈనాడే. ఈ భూమిలో జన్మించిన అనేకమంది మహాత్ముల, అవతార పురుషుల జన్మదినాలను ఉత్సవాలుగా జరుపు కుంటున్నారు. అయితే ఆ సందర్భంగా ఆ మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని వాటికి అనుగుణంగా జీవించే ఉద్దేశం ఎందరికి కలుగుతోంది?
పూజనీయ డాక్టర్‌జీ పుట్టిన రోజును జరుపు కుంటున్న మనం ఈ సందర్భంలో భావిస్తూన్న, చెబుతూన్న విషయాలను అక్షరాలా ఆచరణలో పెట్టడం అవసరం. అడ్డంకులను పట్టించుకోకుండా ముందుకే సాగాలి. విశ్రాంతి గురించి ఆలోచించ కూడదు. సంఘకార్యాన్ని విస్తరించడానికి డాక్టర్‌జీ ఎన్ని కష్టాలను ఓర్చుకొన్నారో, తన నెత్తురు, చెమటను ఏకం చేసిన తీరును గుర్తు చేసుకోవాలి. ఏ మహా కార్యాన్ని ఆ మహాపురుషుడు బీజరూపం నుంచి మహావృక్షంగా పెంపొందజేశారో, దేని కొరకు ఆయన భగీరథ ప్రయత్నం సాగించారో, చివరకు ఆయన తనను తాను దేనిలో విలీనం చేసుకున్నారో ఆ మహాయ్ఞంలో మనం పూర్తి స్థాయిలో పాలు పంచుకోవాలి.
ఇంట్లో కూర్చొని ఆలోచనలలో మునిగి పోయినంత మాత్రాన సంఘకార్యం నెరవేరిపోదు. మనం స్వయంగా పరిశ్రమించాలి. అవసరమై నప్పుడు వాళ్లే మనని పిలుస్తారని బాధ్యత ఇతరులపై వదిలివేసి ఊరుకోవడం వల్ల కూడా లాభం లేదు. సంఘకార్యంలో లీనమైపోయి, దానిని జీవన కార్యంగా స్వీకరిస్తేనే ఏమైనా ఉపయోగం.
యావచ్ఛక్తినీ వినియోగించాలి
‘‘పరాయివారు మనకు సహాయకారులు కాలేరు’’ అనేది సంఘకార్యంలో ఒకే మౌలిక సిద్ధాంతంగా చెబుతారు. పరాయివారి సహాయాన్ని అపేక్షించడం మనకు హితకరం కాదు. ప్రతి సమాజమూ తన అవసరాలను తనే తీర్చుకోవాలి. మన సమాజానికి స్వయంగా మనమే ఔన్నత్యాన్ని ఆర్జించుకోవాలి. దాని బలహీనతలను మనమే చక్కదిద్దుకోవాలి. స్వాభిమానం గలవాడు పరుల సహాయాన్ని యాచించి వైభవాన్ని పొందడం కన్నా ఎండురొట్టెలు తింటూ తన బ్రతుకు తాను బ్రతకడమే మంచిదని భావిస్తాడు. మన పూజనీయ డాక్టర్‌జీ ఈ భావాన్ని శక్తిమంతమైన స్వరంతో సమాజం ముదుంచాడు. మనం అదే విషయాన్ని సమాజానికి మళ్లీ మళ్లీ చెబుతూ వచ్చాం. సమాజపు ఔన్నత్యానికి సంఘటన ఏకైక మార్గమని చరిత్ర చెబుతూంది. ఈ విషయంలో ఏ సందేహము పెట్టుకోకుండా ముదుకు సాగడంలోనే పురుషార్థం ఉంది.
మనకు ఈనాటి వికృత పరిస్థితి అర్థం కాకపోలేదు. కాని మన మార్గం నిశ్చితమైపోయింది. ఆ మార్గంలో నడవడం మనకు అభ్యాసమైంది కూడా. మనం ఇతర విషయాలన్నిటినీ పక్కనపెట్టి సంపూర్ణశక్తిని సంఘకార్యంలో వినియోగించాలి. ఎంత కష్టమైనా సంఘకార్యాన్ని తప్పనిసరిగా ముదుకు తీసుకుపోవాలి.
దేహం అశాశ్వతమైనది. దైహిక సుఖాలకై ఆశించడం నిరర్థకం. లోభివాని వలె శరీరాన్ని సంరక్షించుకోవడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ముందుముందు ఎప్పుడో ఉపయోగపడుతుందన్న ఆశతో లోభి ధనాన్ని పోగుచేస్తాడు. కాని చివరకు ఆ సంపదను వదిలిపెట్టి చనిపోతాడు. దానిని తాను స్వయంగా ఉపయోగించుకోలేడు. అటువంటిది ఎందుకొచ్చిన జీవితం?
కోరుకున్నప్పటికీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చిరంజీవులు కాలేరు. కనుక సత్కార్యాలలో వినియోగం కావడమే ఈ శరీరానికి సార్థకత. ‘చితిపైన కాలిపోవడంలో లేదు శరీర పరమార్థం. సమాజ హితకరమైన పనులు చేస్తూ క్రమక్రమంగా తనను తాను జ్వలింపచేసుకోవడంలో ఉంది’. ఒక ఇంగ్లీషు కవి ఈ విధంగా అన్నాడు.
చెట్టు వలె ఆకారంలో పెద్దగా పెరగడం వల్లనో, లేక మూడు వందల సంవత్సరాలు బ్రతికి చివరకు ఎండిపోయి, ఆకులు రాలి, నల్లబడి, ఒక దుంగవలె పడిపోయే ఓక్ వృక్షం వలె జీవించి ఉండడం వల్లనో మనిషికి శ్రేష్ఠత్వం రాదు. మే నెలలో ఒక్కరోజు మాత్రమే విరిసి, ఆ రాత్రే రాలిపోయే లిల్లీ పువ్వు అంతకన్నా చక్కగా ఉంటుంది. ఆ మొక్క జీవితం, ఆ పువ్వు జీవితం ఉజ్జ్వలమైనవి. సరైన అందాలు చిన్న పరిమాణాలలోనే కనిపిస్తాయి. చిన్న ప్రమాణాల లోనే జీవితం పరిపూర్ణత గలదై ఉండవచ్చు.
ఈ విధమైనదే డాక్టర్జీ జీవితం మన ముందుంది. అదే మనకు ఆదర్శం. శరీరాన్ని, ధనాన్ని లెక్కచేయ కుండా మన పూజనీయ డాక్టర్‌జీ జీవితాన్ని అనుసరించి జీవిస్తామని ఈనాడు సంకల్పించు కొందాం.
సంకటకాలంలో పరీక్ష
సంఘంపై నిషేధం విధించిన తర్వాత రెండు సంవత్సరాలు ఉగాది ఉత్సవాన్ని చెరసాలలోనే జరుపుకోవలసి వచ్చింది. మనవారు చాలామంది దైనందిన కార్యాల నుంచి విరామం పొంది, సుఖంగా జైలులోనే కూర్చోవలసి వచ్చింది. అ•తే మంచి రోజులైనా, చెడ్డరోజులైనా వస్తూ పోతూనే ఉంటాయి. తాను గడచిపోయి సూర్యోదయాన్ని తీసుకురాని రాత్రి లేనేలేదు. అదే విధంగా ఆ రోజులూ గడిచాయి. కష్టాలతో సహవాసం ఏర్పడింది. ఆ కష్టాలు కొన్ని పాఠాలను నేర్పి వెళ్లాయి. ఈ పాఠాలు మన దృష్టితో చూస్తే చాలా ప్రాముఖ్యం గలవి. సంఘ స్వయంసేవ కుడు నలుదెసలా జరుగుతున్న సంఘటనలను గమనించి తర్కించుకుంటాడు. తద్వారా మన కార్యప్రణాళిక ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత ఉపయోగకరమైనదో, అందులో ఏమేమి లోపాలు ఉన్నాయో పరీక్షించుకుంటాడు.
గడచిన రెండు సంవత్సరాలలో మనదేశంలో జరిగిన వేరువేరు సంఘటనలను పరిశీలిస్తే అతిప్రాచీనమైన మన హిందూ రాష్ట్రం తన ప్రాచీన పరం పరను నేటివరకు అఖండంగా కొనసాగిస్తూ చిరంజీవియై నిలచి ఉందని చెప్పక తప్పదు. అ•తే ఇప్పుడు ఈ సమాజంలో కొన్ని విచిత్రమైన సిద్ధాంతాలు, భావాలు చోటు చేసుకున్నాయి. పరంపరాగతమైన సాంస్కృతిక ధారను తిరిగి వేగవంతం, చైతన్యవంతం చేయకపోతే ఈ దేశం ఉన్నతిని పొందే దారి కనిపించదు. సమాజంలో ప్రవేశించిన దోషాలను ఎంచితే చాలాపెద్ద జాబితా తయారవుతుంది. ఔన్నత్యాన్ని సాధించాలంటే మన సమాజంలో ప్రవేశించిన దోషాలను ప్రయత్నపూర్వకంగా దూరం చెయ్యడం తప్పనిసరి.
ఆత్మవిశ్వాసం ఉండాలి
ఒక పెంపుడు కుక్క ఉంది. దాని అవసరాలు, సరదాలు అన్నీ చక్కగా తీరుతున్నారు. ఆ కుక్క నిండు జీవితాన్ని చూసిన ఒక తోడేలుకు తనకు కూడా అటువంటి జీవితం లభిస్తే బాగుండునని పించింది. అదే విషయం ఆ పెంపుడు కుక్కతో చెప్పింది. ఆ కుక్క తన యజమాని అప్పుడప్పుడు తనను గొలుసుతో కట్టేసి ఉంచుతాడని చెప్పింది. అది వినగానే తోడేలు మనసు మారిపోయింది. ‘‘అడవిలో స్వేచ్ఛగా తిరుగుతాను. తినడానికి ఏమీ దొరక్కపోతే అక్కడే చచ్చిపోతాను గాని, నా మెడలో పట్టీ తగిలించుకునేందుకు మాత్రం ఒప్పుకోను’’ అని చెప్పి అడవికి తిరిగి వెళ్లిపోయింది. ఇప్పుడు కోరికల నుంచి (Freedom from wants) విముక్తి కోసం గొంతుచించుకుంటూన్న వాళ్లకి ఆ తోడేలు పాటి బుద్ధి సంపద కూడా లేదనిపిస్తుంది.
రాష్ట్రీయ శీలం ఔన్నత్యానికి ఇటువంటి ప్రబలమైన మనస్తత్వం అవసరం. జీవితమే నశించి పోయినా సరే; మన సమస్త శక్తిని, బుద్ధిని, ప్రతిష్ఠను, సంపదను రాష్ట్ర స్వాతంత్య్ర రక్షణకు, రాష్ట్రం ఔన్నత్యం కోసం బలి ఇద్దామన్న స్థిర సంకల్పం ఉండాలి. ఈ బలీయమైన ప్రవృత్తిని ఒక చెరగని సంస్కారంగా ప్రతి ఒక్క హృదయంలోను ముద్రవేసి ఆ హృదయాలన్నిటినీ సంఘటనా సూత్రంతో కలిపి కట్టినట్లైతే ఒక దేశవ్యాప్తమైన శక్తి నిర్మాణమౌతుంది.
సమాజానికి సంఘకార్యాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని కొందర నుకుంటారు. కాని మన సంఘకార్యాన్ని అర్థం చేసుకొనే యోగ్యత సమాజంలో లేనట్లయితే ఈ పని ముందుకు సాగదు; దీనికి లోకంలో మన్నన లభించదు. ఒక్క వ్యక్తి ద్వారా ప్రారంభమైన సంఘకార్యం ఇపుడు సర్వత్రా వ్యాపించిన విషయాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం.
మన చుట్టూ రకరకాల సిద్ధాంతాలు కోలాహలం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఆడిందే ఆటగా ఉంది- చిన్నచిన్న వ•ఠాలు చురుకుగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కలిసి చాలా పెద్ద హడావిడి కనిపిస్తోంది. ఇందువల్ల మనం మన పద్ధతిలో పని చేయడం ఇక సాధ్యం కాదేమోనన్న అభిప్రాయం కూడా కలగవచ్చు. కాని ఆ అభిప్రాయం సరియైనది కాదు. చుట్టూ ఎంత కోలాహలం ఉన్నా, సఫలత మాత్రం కేవలం మనకే లభిస్తుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి, అంతే. ఆత్మవిశ్వాసం కారణంగానే ఇప్పటివరకూ పనిచేయగలిగాం. ఆ పని ఫలించదని చెప్పడం తప్పు.
ఆత్మవిశ్వాసభరితమైన మాటల ప్రభావం
ఒక బైఠక్‌లో చదువుకున్నవారు, సుశిక్షితులు కూర్చొని ఉన్నారు. సాధారణంగా బైఠక్‌లలో జరిగే విధంగానే సంఘం మౌలిక భావాలను ప్రస్తా వించడం జరిగింది. ‘‘హిందుస్థాన్ హిందువులది. ఈదేశపు బాధ్యత అన్ని విధాలా హిందువులదే’’ అనేసరికి అక్కడ కొందరికి కష్టంగా తోచింది. తమను హిందువులు అనేసరికి వారికి మరణవేదన వంటి వేదన కలిగింది. మన సమాజంలో ఇతర సుగుణాలు ఏమైనా ఉన్నా లేకపోయినా వాదించే శక్తి మాత్రం కావలసినంత ఉంది. వితండవాద ధోరణిలో వారు ఆ బైఠక్‌లో రకరకాల సందేహాలు వ్యక్తం చేశారు. సాధ్యమైనంత వరకు వాళ్ల ప్రశ్నలకు శాంతంగా సమాధానాలు చెప్పారు. చాలామందికి ఎదుటివారు చెప్పేదాన్ని కాదనడంలోనే సమాధానం దొరుకుతుంది. బుద్ధిపరమైన కసరత్తులో వాళ్లు నిపుణులై ఉంటారు. ఒకాయన ఆవేశంగా ‘‘హిందుస్థాన్ హిందువులది అని ఎవరంటారు?’’ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు డాక్టర్‌జీ ఆత్మవిశ్వాసంతో ‘‘నేను, కేశవ బలిరామ్ హెడ్గేవార్‌ను చెబుతున్నాను. హిందూస్థాన్ హిందువులదే’’ అన్నారు. ఆయన దృఢమైన స్వరంతో అలా చెప్పగానే ప్రశ్నవేసిన వ్యక్తి నిశ్శబ్దం వహించాడు. వితండవాదం అంతటితో సమాప్తమైంది.
10, 15 సంవత్సరాలకు పూర్వం ఆ ప్రతికూల పరిస్థితులలో సంఘకార్యం వృద్ధి కావడానికి పనికివచ్చిన ఆత్మవిశ్వాసం ఈనాడు పనికిరాదా? ఏ పనులైనా ఆత్మవిశ్వాస బలం వల్లనే నెరవేరు తాయి. అది లేనిదే పనులు జరగవు. ప్రజలు ఈరోజు మనమాట మన్నించకపోతే అందుకు కోపగించనక్కర లేదు, బాధపడనక్కర లేదు. కాని అహర్నిశలూ శ్రమించి వారు సత్యాన్ని గుర్తించి అంగీకరించేలా చేయగలమన్న ఆత్మవిశ్వాసం మనకి ఉంటేనే కార్యం నెరవేరుతుంది.
ఆత్మ సమర్పణ వల్ల సఫలత
చాలామందికి పని పూర్తికావాలన్న తొందర ఉంటుంది. ‘మనచుట్టూ ఇంత హింసాకాండ జరుగుతోంది కదా, మనం దక్ష-ఆరమ చేస్తూ కూర్చుంటే ఏమి లాభం’ అని వాళ్లకు అనిపిస్తుంది. ఈ పద్ధతిలో పని చెయ్యడంలో వాళ్లకు నీరసం, విసుగు కలుగుతాయి. డాక్టర్‌జీ ఈ కార్యం కోసం తన యావజ్జీవితాన్ని వెచ్చించారు. అహోరాత్రాలు దీన్నిగురించే ఆలోచించారు. ఎటువంటి శ్రమకు ఆయన వెనుదీయలేదు. తన హృదయంలో ఒక అగ్నిపర్వతాన్ని ధరించి పని సాగించారు. ఏనాడూ తన ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వలేదు. అదే ప్రగాఢమైన ఆత్మవిశ్వాసంతో మనం ఆత్మసమర్పణ పూర్వకంగా పనిచేస్తే సాఫల్యం లభించి తీరుతుంది. అంతా బాగానే ఉంది; ఆత్మవిశ్వాసంతో పనిచేసే వారే తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీనిని అర్థం చేసుకొని ఏకసూత్ర బద్ధులు, ఏకాత్మభావ యుక్తులు, అనుశాసనపరులు అ•న లక్షలాది వ్యక్తులను పోగుచెయ్యాలి. అందరి హృదయాలలోను ఏకత్వాన్ని స్థాపించి సమష్టిరూపంలో హృదయనిర్మాణం చెయ్యాలి. అందులోనే అన్ని సందేహాలకు సమాధానం లభిస్తుంది.
‘శ్రీగురూజీ సమగ్ర గ్రంథావళి దిశానిర్దేశనము’ నుండి - జాగృతి సౌజన్యంతో…