హనుమజ్జయంతి |
దేశవ్యాప్తంగా వైభవంగా హనుమజ్జయంతి
శ్రీరామజన్మభూమిలో బాలరాముడికి నూతన ఆలయం నిర్మించిన తర్వాత అయోధ్య కొత్త కళ సంతరించుకుంది. ప్రతీ పండుగా కన్నులపండువగా జరుగుతోంది. ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా అయోధ్యలోని హనుమాన్ గఢీ దేవాలయాన్ని వేలాది భక్తులు దర్శించుకున్నారు. మంగళవారం కూడా కావడంతో భక్తుల ఆనందోత్సాహాలకు కొదవ లేదు.
ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ మందిరం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో బారులు తీరారు. ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసారు. ధైర్యం, బలం, భక్తికి ప్రతీక అయిన హనుమంతుణ్ణి అర్చించుకున్నారు.
భారతదేశంలోని పలు ప్రాంతాల్లో చైత్రపూర్ణిమ నాడు హనుమజ్జయంతి నిర్వహిస్తారు. ఆ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శోభాయాత్రలు సైతం నిర్వహిస్తారు.
ఢిల్లీలోని మార్గాట్‌వాలేబాబా హనుమాన్ మందిర్ సమితి ఇవాళ హనుమజ్జయంతి సందర్భంగా సుందరకాండ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని స్థానిక ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా చాలాప్రాంతాల్లో చైత్రపూర్ణిమ నాడు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్ సహా పలు ప్రదేశాలలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
___VSKANDHRA