బంగ్లాదేశ్.. భారత్ మద్దతుతో ఏర్పడిన దేశం. ఇండియాతో అత్యంత సుదీర్ఘమైన భూసరిహద్దును కలిగి ఉన్న దేశం. వాణిజ్యావసరాలకు మనపైన ఆధారపడమే కాకుండా గతంలో భారత ఉపఖండంలో భాగంగా ఉండి సాంస్కృతికంగానూ భారత్‌కు ఎంతో దగ్గరైన దేశం. అలాంటి దేశంలో ఇప్పుడు ‘బాయ్‌కాట్ ఇండియా’ నినాదం బయల్దేరింది.
బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా జనవరిలో 5వ సారి అధికారంలోకి వచ్చాక.. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకుంది. బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో భారత్ జోక్యం చేసుకుంటోందని, తమ సొంత ప్రయోజనాల కోసం షేక్ హసీనానే మళ్లీ ప్రధాని అయ్యేలా గత ఎన్నికల్లో అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిందని ఐరోపా, అమెరికా దేశాల్లో ఉంటున్న ప్రవాస బంగ్లాదేశీలు తొలుత ‘బాయ్‌కాట్ భారత్’ ఉద్యమానికి పిలుపునిచ్చారు. భారత్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను కొనవద్దని, వాడవద్దని బంగ్లాదేశ్ ప్రజలను కోరారు. ప్రస్తుతం పారి్‌సలో ప్రవాస జీవితం గడుపుతున్న బంగ్లాదేశీ వైద్యుడు పినాకీ భట్టాచార్య ఈ ఆన్‌లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
ప్రవాసీ బంగ్లాదేశీల పిలుపునకు బంగ్లాదేశ్‌లో కొన్ని వర్గాల నుంచి మద్దతు రావడంతో ప్రతిపక్ష బీఎన్‌పీ ఈ ‘బాయ్‌కాట్ భారత్’ నినాదాన్ని అందిపుచ్చుకొంది. షేక్ హసీనా భారతదేశ అవసరాల కోసం పనిచేస్తున్నారని ఆరోపిస్తోంది. ఈసారి బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు అత్యంత వివాదాస్పదమైనప్పటికీ, ప్రతిపక్షాలు ఈ ఎన్నికలను బహిష్కరించినప్పటికీ.. హసీనా ప్రధాని అయిన వెంటనే భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలుపడం, మద్దతు ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. అయితే, బంగ్లాదేశ్‌లో ‘బాయ్‌కాట్ భారత్’ ఉద్యమం జనం నుంచి పుట్టలేదని, కేవలం రాజకీయ ఎజెండానే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది సోషల్ మీడియాలోనే ట్రెండింగ్‌లో ఉంది తప్ప, వాస్తవంలో అంతగా జనాదరణ లేదన్నారు.
వాటన్నింటినీ కాల్చివేస్తారా?
‘బాయ్‌కాట్ భారత్’ నినాదంపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అత్యంత తీవ్రంగా స్పందించారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులను బాయ్‌కాట్ చేయాలంటే ప్రతిపక్ష బీఎన్‌పీ నేతలు ముందుగా తమ భార్యల చీరలను వారి నుంచి లాగేసుకొని కాల్చేయాలన్నారు. ‘‘బీఎన్‌పీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతల భార్యలు ఇండియాకు వెళ్లి భారీ సంఖ్యలో చీరలు కొనుక్కొని రావడం, వాటిని బంగ్లాదేశ్‌లో అమ్మడం చూశాను. వాటన్నింటినీ కాల్చివేస్తారా’’ అని హసీనా ప్రశ్నించారు. ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటున్న మసాలాలు, ఉల్లిగడ్డం, అల్లం, వెల్లుల్లి ఇవేవీ లేకుండా ఆహారం వండుకొని తినాలన్నారు. కాగా, రంజాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు 50వేల టన్నుల ఉల్లిగడ్డలను పంపాలని భారత ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.