Former BJP MLA Krishnanand Rai (L), Mukhtar Ansari (R) |
ఒక క్రైమ్ కధ అను 'డాన్' కధ
గత 40 సం. లుగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు గమనిస్తూ ఉన్నవారికి 1980-2017 మధ్య కాలంలో ఎలా వుండేవో సులభంగా అర్ధం అవుతుంది. రాష్ట్రం మొత్తం కొందరు మాఫియా డాన్స్ చేతిలో ఉండిపోయింది. ఒక్కో ప్రాంతంలో ఇద్దరు లేక ముగ్గురు పెద్ద పెద్ద మాఫియా డాన్స్. ఆ ప్రాంతాల్లో వారి మాటే చెల్లుబాటు.
అది ఉత్తరప్రదేశ్ లో ఘాజీపూర్ జిల్లాలో ఒక గ్రామం. ఆ రోజు 2005 సం. నవంబర్ 29వ తేదీ. చలి కాలం. అందువల్ల మధ్యాహ్నం అయినా సాధారణం కంటే చలి ఎక్కువగా ఉంది. ఎందుకంటే అంతకు ముందే ఆ ప్రాంతంలో చినుకులు కూడా పడ్డాయి. అయితే ఆ రోజు అక్కడ జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలకు వెన్నులో చలి పుడుతుంది..
అసలు ఏం జరిగింది ఆ రోజు ?
ఆ ప్రాంతంలో ముక్తార్ అన్సారీ అనేవాడు ఒక మాఫియా డాన్. వీడు మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ కి మేనల్లుడు వరుస అవుతాడు. ఆ ప్రాంతంలో ఏ కాంట్రాక్టు అయినా వాడికి దక్కవలసిందే. అయితే వాడికి పోటీగా బ్రిజేష్ సింగ్ అనేవాడు కూడా ఎదిగాడు. ఇద్దరూ ఎవరి ప్రాంతాలు వారు మార్క్ చేసుకొని వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నా అప్పుడప్పుడు ఇరు వర్గాల మధ్య గొడవలు ఉండేవి.
2002 యూపీ ఎన్నికలప్పుడు కృష్ణనంద్ రాయ్ అనే బ్రాహ్మణ అభ్యర్థి మోహమ్మడాబాద్ స్థానం నుండి అన్సారీ సోదరుడి పై గెలిచాడు. ఈ రాయ్ కి బ్రిజేష్ సింగ్ పరోక్ష మద్దత్తు ఉంది. అయితే సోదరుడి ఈ ఓటమిని అన్సారీ జీర్ణించుకోలేకపోయాడు. ఈ ఓటమి తన పరువు ప్రతిష్టలకు సంబంధించినదే కాదు, తన అక్రమ వ్యాపారాలకు గండి పడుతుంది అని భయపడ్డాడు. కృష్ణానంద్ రాయ్ ప్రాణాలకు అన్సారీ నుండి ముప్పు ఉంది అని యూపీ పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం పలుసార్లు హెచ్చరించడంతో, రాయ్ బులెట్ ప్రూఫ్ కారులోనే తిరిగేవాడు. గతంలో 'మౌవా' ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలకు వీడిదే బాధ్యత అని అన్సారీ ని 2005లో జైల్లో పెట్టారు. అయితే ముఖ్యమంత్రి ములాయం సింగ్ మద్దతు తో వీడు జైలు నుండే నిరాటంకంగా వాడి పనులు చక్కబెట్టుకునే వాడు. కృష్ణానంద్ రాయ్ ని లేపేయ్యడానికి బులెట్ ప్రూఫ్ కారుని ఛేదించగల AK 47 వంటి తుపాకీ కోసం ప్రయత్నాలు చేసాడు.
AK 47 తుపాకీతో అన్సారీ |
2004లో పోలీసు ఇంటెలిజెన్స్ టాప్ చేసిన కాల్ ప్రకారం ఈ అన్సారీ ఆర్మీ నుండి పారిపోయిన ఒక సిపాయి దగ్గర కోటి రు.లు ఇచ్చి లైట్ మెషీన్ గన్ కొన్నాడు అని తెలిసింది. ఈ సమాచారం ఆధారంగా అప్పటి డి ఎస్ పి శైలేంద్ర సింగ్ ఒక ప్రాంతంలో దాడి చేసి ఈ మెషిన్ గన్ మరియు 200 బుల్లెట్లు స్వాధీనం చేసుకుని ఈ అన్సారీ పై టెర్రర్ ఆక్ట్ 'పోటా' క్రింద కేసు బుక్ చేసాడు. అయితే తనతో సంప్రదించకుండా అన్సారీ పై కేసు బుక్ చేసినందుకు మండి పడ్డ ములాయం శైలేంద్ర సింగ్ ని సస్పెండ్ చేయడమే కాక ఒక ఫేక్ కేసులో బుక్ చేసి అరెస్ట్ చేయించాడు. ఆ టార్చర్ తట్టుకోలేక DSP శైలేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేసి బయటపడ్డాడు.
DSP శైలేంద్ర సింగ్ |
ఇది ఇలా ఉండగా, కృష్ణానంద్ రాయ్ వారణాసి కి దగ్గరలో ఉన్న తన స్వగ్రామం లో ఒక పెళ్లికి, అక్కడ నుండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి వెళ్ళాడు. అది ఇంటికి దగ్గరే కావడంతో బుల్లెట్ ప్రూఫ్ కారు కాకుండా సాధారణ రెండు కారుల్లో వెళ్లి తిరిగి వస్తూ ఉండగా 6గురు అన్సారీ అనుచరులు AK47 తుపాకులు తీసుకుని అతని కార్లకు అడ్డంగా పెద్ద SUV కారుతో వెళ్లి వాటిని ఆపి ఆ కార్లపై ఆటోమాటిక్ తుపాకీలతో గుళ్ళ వర్షం కురిపించారు. అన్సారీ ముఖ్య అనుచరుడు శైలేష్ అనేవాడు కృష్ణానంద్ రాయ్ కారు బాయ్ నెట్ పై నిలబడి కృష్ణానంద్ పై విండ్ షీల్డ్ నుండి గుళ్ల వర్షం కురిపించి, అతను చనిపోయాడు అని నిర్ధారించుకుని, గెలుపు గుర్తుగా రాకేష్ పాండే అనే అనుచరునితో అతని శిఖ (పిలక) కత్తిరింపించి తీసుకు పారిపోయాడు. (2020లో ఫోన్ టాప్ చేసినప్పుడు అన్సారీ కి మరో డాన్ అభయ సింగ్ కి జరిగిన సంభాషణల్లో ఈ విషయం బయట పడింది.) అయితే, ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడానికి ఆహ్వానం మరియు మామూలు కారులో వెళ్ళడానికి ప్రోత్సహించింది కూడా హత్యకు ప్లాన్ చేసిన ముఠానే ప్లాన్ చేసింది అని పోలీసుల విచారణ లో తేలింది.
నేరస్థలం నుండి 400 బుల్లెట్ షెల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు (మూలం: హిందూస్తాన్ టైమ్స్) |
మొత్తం 500 బుల్లెట్లు పేల్చగా చనిపోయిన 7గురు శవాల నుండి 60 బుల్లెట్లు తీయగా ఒక్క కృష్ణానంద్ బాడీ నుండి 21 బుల్లెట్లు తీశారు. ఈ సంఘటన ముఖ్టార్ అన్సారీ జైల్లో వుండగానే జరిగింది అంటే ప్రభుత్వం లో ఎంత పలుకుబడి ఉండేదో ఊహించండి. ఈ సంఘటన తో ఆ గ్రామ ప్రజలు గజ గజ వణికారు.
ఈ కేసు విచారించడానికి ఎంత మంది పోలీసు ఉన్నతాధికాలను నియమించినా అందరూ బెదిరింపుల భయంతో కేసు విచారణ నుండి తప్పించమని ప్రభుత్వాన్ని వేడుకుని విచారణ మధ్యలోనే తప్పుకోవడం చేశారు. దాంతో కేసు విచారణ ముందుకు సాగకపోవడంతో కృష్ణానంద్ రాయ్ భార్య కేసు విచారణను సిబిఐ కి అప్పచెప్పాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టు కి వెళ్లగా హైకోర్టు 2006లో సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే, సాక్షులు అందరూ మాట మార్చడం కానీ చనిపోవడం కానీ జరగడంతో కేసు సాగి సాగి చివరకు అన్సారీ హత్య చేయించాడు అని నిర్ధారించి మార్చి 2023లో 10సం. ల జైలు శిక్ష విధించారు.
ఈ అన్సారీ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉండగానే మొన్న మార్చ్ 28న గుండెపోటుతో మరణించాడు. మా వాడిని జైల్లో విషం పెట్టి చంపేశారు అని అన్సారీ సోదరులు ఆరోపించడంతో ప్రభుత్వం మేజిస్ట్రేరియల్ విచారణకు ఆదేశించింది. ఆ రాత్రి కృష్ణానంద్ గ్రామ ప్రజలు టపాకాయలు పెద్ద ఎత్తున కాల్చి పండుగ చేసుకున్నారు.
కృష్ణానంద్ భార్య 2017 లో అదే మొమ్మదాబాద్ స్థానం నుండి అన్సారీ మూడో సోదరుడిని ఓడించి గెలిచి, 2022లో మళ్ళీ అదే స్థానం అన్సారీ మరో సోదరుడి పై ఓడిపోయింది.భారతదేశంలో ఒక రాజకీయ హత్యకు AK47 తుపాకులు ఉపయోగించడం అదే మొదటిసారి. వీడి మరణం వల్ల హత్య చేయబడ్డ ఎమ్మెల్యే కృష్ణానంద్ కుటుంబమే కాదు, అప్పటి మాజీ DSP శైలేంద్ర సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య పలు చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో అప్పట్లో యూపీలో పోలీసు డిపార్ట్మెంట్ లో పనిచేయడం ఎంత కత్తి మీద సామో తెలిపారు.
2017లో యోగి వచ్చిన దగ్గర నుండి ఈ డాన్స్ కి ఉన్న రాజకీయ పార్టీల తో ఉన్న సంబంధాలు, మతంతో ఉన్న సంబంధాలు పట్టించుకోకుండా ఈ అన్ని మాఫియా ముఠాలపై ఉక్కు పాదం మోపి కొందరిని ఎన్కౌంటర్ చేసి, కొందరిని జైల్లో పెట్టడం, వాళ్ళ కోట్ల ఖరీదు చేసే ఆస్తులు జప్తు చేయడం, అనధికార కట్టడాలను కూల్చడం, కబ్జా చేసిన ఆస్తులు స్వాధీనం చేసుకుని బీదవాళ్లకు పంచడం వంటి చర్యలతో ఈ మాఫియా ముఠా ఆగడాలు చాలా వరకు తగ్గాయి. 2022లో యోగి మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలవడానికి ఈ మాఫియా పై ఆయన పోరాటం కూడా ఒక కారణం.
....చాడా శాస్త్రి 🖉