Veera Shivaji |
వివేచన, శౌర్యం రెండిటి కలయిక వీరశివాజీ
1674వ సంవత్సరం జ్యేష్ట శుద్ధ త్రయోదశి నాడు ‘హిందూ రాజ్యం ఏర్పడదు అనే భావన పటాపంచలైంది. ‘డిల్లీశ్వరోవా జగదీశ్వరోవా’ అనే ఆలోచన ముగిసింది. పరిమిత సాధనాలతోనే హిందువు శ్రేష్ఠ, స్వతంత్ర పాలకుడయ్యాడు. హిందువుల పౌరుష పరాక్రమాలు లోకానికి తేటతెల్లమైన చత్రపతి శివాజీ పట్టాభిషేకమైన రోజు. అదే హిందూ సామ్రాజ్య దినోత్సవం.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్ష తదియనాడు పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో శంబాజీ జిజాభాయి పుర్వాదంపతులకు జన్మించాడు. తల్లి బాల్యంలో శివాజీకి మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమకలుగునట్లు విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాధలు చెప్పి వీరత్వం మొలకింపచేసింది. తన తండ్రి పొందిన పరాజయాలను అద్యయనం చేసి అనతి కాలంలోనే శివాజీ యుద్ధ తంత్రాలలో నిష్ఠాతుడయ్యాడు. హిందూ సామ్రాజ్య స్థాపన యుద్ధం చేసి బీజాపూర్‌కు చెందిన ‘తోరణ’ దుగ్గాన్ని స్వాధీనం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన అధీనంలో ఉంచుకున్నాడు.
శివాజీ మెరపుదాడులు, గెరిల్లా యుద్ధ పద్దతులు తెలుసుకొన్న అప్జల్‌ఖాన్ శివాజీని అంత మొదించటానికి ప్రయత్నించినపుడు వ్యూహాత్మ కంగా తను దర్శించిన పులిగోర్లతో అప్జల్‌ఖాన్ పొట్ట చీల్చి సంహరించాడు. శివాజీ విజయాలతో మొఘల్ పాలకుడు ఔరంగజేబుకు సైతం శివాజీ అంటే భయం పుట్టింది. ఔరంగజేబు తన మేనమామ ‘పహిస్తాఖాన్‌ను శివాజీపై దాడికి పంపినా పరాజయంతో వెనుతిరగవలసి వచ్చింది. 1666లో ఔరంగజేబు కుట్రచేసి శివాజీని ఆగ్రాలో బందించినపుడు చాలా చాకచక్యంగా తప్పించుకొన్నాడు. 1674 నాటికి శివాజీ లక్ష సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు నావికాదళాన్ని ఏర్పాటు చేశాడు. వ్యక్తి నిర్మాణం ద్వారా సామాన్య వ్యక్తులలో అసాధారణ ప్రతిభను జాగృతం చేసి వారిని కుశలురైన నాయకులుగా తీర్చిదిద్దటం ఎలాగో చత్రపతి శివాజీ చూపించాడు. విజయమే మన ఆదర్శం కావాలని శివాజీ జీవితం తెలియజేస్తుంది.
హిందూ జీవన విధానంలో ఏ విషయాన్ని వివరించకుండా వదిలివేయలేదు, అది ఆహారం కావచ్చు విహారం కావచ్చు చివరికి యుద్ధం కావచ్చు. ప్రపంచంలో ఏ జాతికి యుద్ధ నియమాలు లేవు! మూకుమ్మడిగా దాడి చేసి, శత్రువును లొంగదీసు కోవడమే వారికి తెలిసిన ‘నీతి’. కాని కేవలం హిందువులు మాత్రమే సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు యుద్ధం చెయ్యాలి, వెన్ను చూపి పారిపోతున్న వ్యక్తిని చంపకూడదు, ముసలివారు, పిల్లలు, స్త్రీలను చంపకూడదు మొదలైన నియమాలను పాటించారు.
ఐతే ఈ నియమాలను ఎవరి విషయంలో పాటించాలి అన్న అంశంలో స్పష్టత లోపించడం వల్ల పృధ్వీరాజ్ చౌహాన్ 16 సార్లు ఘోరీని యుద్ధంలో ఓడించినప్పటికీ చంపకుండా వదిలివేసాడు. కానీ ఒకే ఒక్కసారి ఘోరీ గెలిచి నప్పుడు మాత్రం పృధ్వీరాజుని బంధించాడు. అనేక హింసలకు గురి చేసాడు. ప్రజల్ని హింసించాడు, దోచుకున్నాడు.
హిందూ జాతికి తురుష్కుల నుంచి వచ్చిన ఆపదను అర్థం చేసుకోవడం, ఆ ఆపదను ఒక విస్పష్టమైన పద్ధతిలో ఎదుర్కోవడం వల్ల అత్యంత క్లిష్టపరిస్థితులలో శివాజీ కూడా హిందూ సామ్రాజ్యాన్ని విజయవంతంగా నిర్మించగలిగాడు.
ఆలోచనాపరమైన ఈ వ్యత్యాసం నేటికీ హిందూ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఏ మతం ఏమి చెపుతోందో, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తరచి చూసుకోకుండా అన్ని మంచినే బోధిస్తాయి, అవి అన్నీ ఒకటే అన్న విపరీత ధోరణి వల్ల వాటినుంచి వస్తున్న దాడులను అర్థంచేసుకుని, ఎదుర్కొనడంలో హిందూ సమాజం విఫలమవుతోంది.
ఈ రకమైన వివేచనారహిత ఆలోచనా విధానం స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగింది. ఐతే రామజన్మభూమి ఉద్యమం తరువాత హిందువులలోని ఈ ఆత్మహత్యాసదృశమైన ఆలోచనా ధోరణిలో చాలా మార్పు వచ్చింది.దాని ఫలితం మనం చూస్తూనే ఉన్నాము. కాని పూర్తి మార్పు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చిన రోజునే శివాజీకి నిజమైన వారసులమని చెప్పుకోగలం. దీనిని సాధించడానికి ప్రతి వ్యక్తి తనంత తానుగా సమయం, శక్తిసామర్థ్యాలను ఉపయోగించాలి. అప్పుడే ‘స్వరాజ్యం’, ‘సురాజ్యం’ సాధ్యమవుతాయి.
Source : VSK, Telangana