అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఇద్దరు ఐసిస్ నేతలు పట్టుబడ్డారు. వారి టెర్రర్ మాడ్యూల్‌ను కనుగొని, వేగంగా చర్యలు తీసుకున్న రాష్ట్ర పోలీసులను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మప్రశంసించారు.
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందిన ఇద్దరు నాయకులు పొరుగుదేశంలో దాగి ఉన్నారు. అక్కడినుంచి భారతదేశంలోకి చొరబడి, ఇక్కడ హత్యలకు పాల్పడడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఆ మేరకు ధుబ్రి జిల్లా ధర్మశాల ప్రాంతంలోని నిఘావర్గాలు సమాచారాన్ని సేకరించాయి. వారిని పట్టుకోడానికి ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం ఏర్పాటైంది. ఐజీ పార్థసారథి మహంత, ఎఎస్‌పి కళ్యాణ్ కుమార్ పాఠక్ ఆ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులు.
ఆ బృందం భారత్‌లోకి చొరబడిన ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను గుర్తించి అరెస్ట్ చేసింది. వారిలో ఒకవ్యక్తి ఐసిస్ భారతదేశపు అత్యున్నతాధికారి హ్యారిస్ ఫరూఖీ కాగా, రెండో వ్యక్తి అతని సహచరుడు అనురాగ్ సింగ్. వారిద్దరూ ఎప్పటినుంచో ఎన్ఐఏ వాంటెడ్ లిస్ట్‌లో లేరు.
పోలీసుల కథనం ప్రకారం… నిందితులిద్దరూ మార్చి 20 తెల్లవారుజామున 4.15 గంటల సమయంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటి ధుబ్రీ జిల్లా ధర్మశాలలోకి ప్రవేశించినట్లు తెలిసింది. పోలీసులు వెంటనే ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి గువాహతిలోని ఎస్‌టిఎఫ్ కార్యాలయానికి తరలించారు. హారిస్ ఫరూఖీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూఖీ డెహ్రాడూన్‌లోని చక్రాతా ప్రాంతానికి చెందినవారు. దేశంలో ఐసిస్ నాయకుడు. రెండో వ్యక్తి అనురాగ్ సింగ్ పానిపట్‌లోని దివానా ప్రాంతానికి చెందినవారు. అతను ముస్లిం మతంలోకి మారి, తన పేరు రేహాన్ అని మార్చుకున్నాడు. అతని భార్య బంగ్లాదేశీ జాతీయరాలు.
వాళ్ళిద్దరూ భారత్‌లో ఐసిస్ కోసం రిక్రూట్‌మెంట్, నిధుల సేకరణ, ఉగ్రవాద కార్యకలాపాల ప్రణాళికలు రచించడం వంటి పనులకు పాల్పడుతుండేవారు. వారిపై ఢిల్లీ ఎన్ఐఏ, లక్నో ఏటీఎస్, మరిన్ని నిఘా సంస్థల్లో చాలా కేసులు నమోదయ్యాయి. అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్, వారిని తదుపరి విచారణ కోసం ఎన్ఐఏకు అప్పగించనుంది.