భగత్ సింగ్ రాసిన లేఖలు - 1
విజయుణ్ణయేలా ఆశీర్వదించండి.
(నాయనమ్మ మనవడి పెళ్ళి వేగంగా చేయమని తొందర పెట్టడంతో తండ్రి సర్దార్ కిషన్ సింగ్ శేఖాపురాజిల్లా, మన్నావాలా గ్రామానికి చెందిన తేజ్ సింగ్ బాన్ చెల్లిని భగత్ సింగ్ తో పెళ్ళి నిశ్చయించాడు. ఈ పెళ్ళి గొడవలనించే భగత్ సింగ్ కాలేజీ చదువు మానేశాడు. తండ్రికి రాశాడు ఇలా. ఈ ఉత్తరం 1823లో రాసింది. అప్పటికి భగత్ సింగికి 16 ఏళ్ళ వయసు)
———————-
పూజ్యులయిన తండ్రిగారికి,
ఇది పెళ్ళి చేసుకొనే సమయంకాదు. దేశం నన్ను పిలుస్తోంది. నేను మనసా వాచా, ఆర్థికంగా దేశ సేవచేస్తానని ప్రతిజ్ఞ చేశాను. పైగా ఇదేమీ మనకు కొత్తకూడా కాదు. మన కుటుంబమంతా దేశభక్తికే అంకిత మయినది. నేను పుట్టిన రెండు మూడేళ్ళ తర్వాత 1910లో చిన్నాన్న స్వరణ్ సింగ్ జైలులో చనిపోయారు. మరొక చిన్నాన్న అజిత్ సింగ్ దేశం నుంచి బహిష్కరింపబడి, విదేశాల్లో బతుకు తున్నారు. మీరు కూడా జైలులో ఎన్నో యాతనలు అనుభవించారు. నేను కూడా మీరు నడచిన తోవనే నడుస్తున్నాను. అందుకే ఈ సాహసానికి ఒడిగట్టాను. మీరు నా యందు దయవుంచి నన్ను వివాహ బంధంలో ఇరికించకండి. నా ఆశయంలో విజయుణ్ని అయ్యేలా ఆశీర్వదించండి.
భగత్ సింగ్ రాసిన లేఖలు – 2
33 కోట్ల ప్రజల తల్లి భారతమాత కష్టాల్లో వుంది
(నీ పెళ్ళి నిశ్చయమయి పోయిందని, పిల్ల, సంప్రదాయం మనకి నచ్చాయని నువ్వు మీ నాయనమ్మ కోర్కెని నెరవేర్చాలని, నా ఆజ్ఞగా మన్నించి ఈ పెళ్ళికి అడ్డు పెట్టవద్దని తండ్రిరాసిన ఉత్తరానికి భగత్ సింగ్ జవాబు – 1923 లో రాసింది.)
———————-
పూజ్యులయిన నాన్న గారికి,
మీ ఉత్తరం చదివి నేను ఆందోళన చెందాను. మీవంటి సిసలైన దేశభక్తుడు, వీరుడు ఇటువంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకుంటే, ఇక మామూలు మనిషి మా టేవిటి?
మీరు నాయనమ్మ గురించి ఆలోచిస్తున్నారేగాని, 33 కోట్ల ప్రజలతల్లి “భారత మాత” ఎంత కష్టంలో వుంది? అని ఆలోచించరేం? మనం అందుకోసం సర్వ స్వాన్ని బలి పెట్టాలి.
భగత్ సింగ్ రాసిన లేఖలు – 3
తాతగారి ప్రతిజ్ఞని పూర్తిచేస్తున్నాను
(కాలేజీ విడిచి పెడ్తూ మరొక ఉత్తరం రాశాడు తండ్రికి- 1923 లో)
పూజ్యులైన తండ్రిగారికి,
నమస్తే. నేను నా జీవితాన్ని మాతృభూమికి సంబంధించిన ఉత్కృష్ణ మయిన ఆశయాలకి ఆర్పిస్తున్నాను. అందువల్ల నాకు కుటుంబ సుఖాలు అనుభ వించాలనిలేదు.
మీకు గుర్తు వుండే వుంటుంది. నాకు జంధ్యం వేస్తూ తాతగారు నన్ను ‘దేశ సేవకి ఆర్పిస్తున్నా’నంటూ నలుగురి మధ్య ప్రకటించారు. నేను కేవలం ఆ ప్రతిజ్ఞని పరిపూర్తి చేస్తున్నాను – నన్ను క్షమించగలరని ఆశిస్తున్నాను.
—————
(లాహోరు నించి కాన్పూరుకి వెళ్ళిపోతూ, లాహోరు రైల్వేస్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వచ్చిన స్నేహితులతో భగత్ సింగ్ ఇలా అన్నాడు “మిత్రులారా! మీకో విషయం చెబుతున్నా. ఈ పరాధీన భారతదేశంలో నాకు పెళ్ళంటూ జరిగితే, మృత్యువే నా వధువు అవుతుంది. నా శవ యాత్రే పెళ్ళి ఊరే గింపు, అమరవీరులు పెళ్ళి పెద్దలవుతారు”)
భగత్ సింగ్ రాసిన లేఖలు – 4
పుస్తకాలు పంపండి
(అసెంబ్లీ బాంబు కేసులో అరెస్టు అయిన తర్వాత ఢిల్లీ జైలునుంచి భగత్ సింగ్, తండ్రి సర్దార్ కిషన్ సింగ్ కు రాసిన లేఖ-లాహోరు చిరునామాకి)
————————
పూజ్య పితాజీ మహరాజ్ కి – వందేమాతరం
మేం ఏప్రిల్ 22వ తేదీన పోలీసు కస్టడీ నుంచి ఢిల్లీ జైలుకి తీసుకురాబడ్డాం. ఇప్పుడు మేం ఢిల్లీ జైలులోనే వుంటున్నాం. కేసు విచారణ మే 7న జైలులోనే జరుగుతుంది. బహుశా ఓ నెలలోపునే ఈ డ్రామా ముగుస్తుంది. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు ఇక్కడికి వచ్చారని, వకీలు వగయిరాలతో సంప్రదించి నన్ను కలుసుకొనే ప్రయత్నం చేశారని, అయితే అన్ని ఏర్పాట్లూ జరగలేకపోయాయని తెలిసింది. బట్టలు నాకు మొన్న అందాయి. మీరెప్పుడు వస్తే, అప్పుడు నన్ను కలుసుకోవచ్చు. వకీలు ప్రత్యేకించి అవసరంలేదు. గాని, అయితే ఒకటి రెండు అంశాల మీద సలహా తీసుకోవాలనుకుంటున్నాను. అయినా ఇవేవీ అంత ముఖ్యమయినవి కావసుకోండి. మీరు అనవసరంగా హైరానా పడకండి. నన్ను కలవదలిస్తే ఒక్కరే రండి. వాల్డా సాహిబా (అమ్మగారిని) తోడు తీసుకు రాకండి. ఆమె ఊరికినే ఏడ్చేస్తారు. నా మనసుకీ కష్టం అనిపిస్తుంది. ఇంటి సంగతులూ అవీ మీరు కలిసాకనే తెలుస్తాయి.
వీలయితే గీతా రహస్యం, నెపోలియన్ జీవిత చరిత్ర-నా పుస్తకాల షెల్ప్ వుంటాయి, తీసుకురండి. అలాగే కొన్ని మంచి ఇంగ్లీషు నవలలు కూడా. వాలదా సాహిబా, మాతాజీ (నాయనమ్మ), పిన్నిగారి చరణాలకు నా నమస్కారాలు తెలియ జేయండి. రణవీర్ సింగ్, కులకార్ సింగ్ కి నమస్కారాలు. బాపూజీ (తాతగారికి) చరణాలకి నా నమస్కారాలని మనవి చేయండి. పోలీసు కస్టడీలోనూ, ఢిల్లీ జైలులో కూడా మాతో సజావుగానే ప్రవర్తిస్తున్నారు. మీరెలాంటి చింకా పెట్టుకోకండి. మీ చిరునామా తెలీకపోవడంవల్ల ఈ చిరునామాకి (కాంగ్రెసు ఆఫీసుకి) రాస్తున్నానీ ఉత్తరం
భగత్ సింగ్ రాసిన లేఖలు – 5
నేను పొద్దుపొడుపును సూచించే వేగుచుక్కను
(అదేరోజు చిన్న తమ్ముడు కులకార్ సింగ్ కు రాసిన ఆఖరి ఉత్తరం)
—————
సెంట్రల్ జైలు, లాహోరు
మార్చి 3, 1931.
ప్రియమైన కులకార్,
ఇవేళ నీ కళ్ళమ్మట కన్నీరు చూసి, నా మనసు విలవిల్లాడిపోయింది. ఇవేళ నీవు వాడిన మాటల్లో ఎంతో వ్యధ వుంది: నీ కన్నీరుని నేను భరించలేకపోయాను.
ఒరేయ్ భాగ్యశాలి! స్థిమితంగా చదువుకో. నీ ఆరోగ్యం జాగ్రత్త. ధైర్యంగా వుండు. ఇహనేం రాయనూ!
వాడి కొకటే ధ్యాస,
కౄరత్వంలో కొత్త పద్దతులెలా కనిపెట్టాలని
ఆత్యాచారాల నెలా అంతమొందించాలని
నరకం అంటే కోపమెందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా ఆన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం!
నేను కొద్ది క్షణాల అతిధిని
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చుట్టూ గాలిలో చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి
క్షణిక మయినది
ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు, తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై
ధైర్యంగా వుండు….నమస్తే!
నీ సోదరుడు,
భగత్ సింగ్.
విశ్వసంవాద కేంద్రం - తెలంగాణ సౌజన్యంతో