వేదాలపై మన సంస్కృతి ఆధారపడిందని, వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. మంగళవారం ముంగండ గ్రామంలోని చింతామణి గణపతి మందిరంలో శ్రీఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్ ఆధ్వర్యంలో రుగ్వేద పారాయణ, వేద విద్వత్ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ప్రవచిస్తూ వేదం లోకాన్ని సంరక్షిస్తుందన్నారు.
వేదాలతో సర్వమానవాళి, ఇతర ప్రాణులు సుభిక్షంగా ఉంటాయన్నారు. వీటి ప్రాశస్త్యం, వేద పరిరక్షణ ఆవశ్యకతను షణ్ముఖశర్మ వివరించారు. ఉదయం నుంచి వేద విద్వాంసులచే రుగ్వేద సంహిత పారాయణ జరిగింది. ఆయా కార్యక్రమాల్లో శ్రీఆశ్వలాయన మహర్షి రుగ్వేద పరిషత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోదావరి వెంకట సుబ్బారావు, చెరుకూరి వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్, సహ కార్యదర్శి గంటి సుబ్రహ్మణ్య శాస్త్రి, సభ్యులు, వేద రక్షకులు పాల్గొన్నారు.