మతం ముసుగులో మాయగాళ్ల మోసం | Fraud in the guise of religion |
ఎన్టీఆర్ జిల్లా గంపల గూడెం మండలంలోని ఊటుకూరుకు చెందిన ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు రెండునెలల కిందట తాటిపూడికి వచ్చారు. ఒక రైతు ఇంటివద్ద క్రైస్తవ మత స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. పేదలు, అమాయకులను సమీకరించు కుని వారిని ప్రలోభాలకు గురిచేశారు. తమ దగ్గరకు వచ్చిన వారికి మొదట కొద్దిమొత్తంలో నగదు ఇతరత్రా బహుమానాలు ఇచ్చారు. విందు, వినోదాలు ఏర్పాటు చేశారు. ఇక ఆతర్వాత ఆముగ్గురు తమ మోసానికి తెర దీశారు. ప్రార్థన చేసిన వారిని పేదలు, అమాయకులు నమ్మి, వారి ప్రలోభాలకు లోనయ్యారు. వారి చేతిలో నష్టపోయిన వారు 200మందికిపైగానే ఉన్నారు.
బాధితులంతా వితంతువులు, దివ్యాంగులు. ఈముగ్గురు మోసకా రులు వితంతువులు, దివ్యాంగులపైనే దృష్టి సారించారు. రూ.500, రూ.3వేలు, రూ.5వేలు, రూ.10వేలు, రూ.30వేల చొప్పున వసూలు చేశారు. రూ.500 చెల్లించిన వారికి రూ.వెయ్యి, రూ.3వేలు చెల్లించిన వారికి రూ.4నుంచి 5వేలు, రూ.10వేలు చెల్లించిన వారికి రూ.50వేలు, రూ.30వేలు చెల్లించిన వారికి రూ.రెండులక్షల చొప్పున పింఛన్ ఇస్తామని, వాహనాలు సమకూర్చుతామని నమ్మించారు.పేదల్లో ఎక్కువ మంది రూ.500చొప్పున, మరికొంతమంది రూ.3వేల చొప్పున, కొద్దిమంది రూ.10వేలు, రూ.30వేల చొప్పున రూ.ఆరులక్షల వరకు వారికి సమర్పించుకున్నారు. వాటిని తీసుకున్న తర్వాత ఒక్కొక్కరుగా తట్టాబుట్టా సర్దుకొని తాటిపూడి నుంచి పలాయనం చిత్తగించారు.
Courtesy : vskandhra