రజ్జూ భయ్యా ( ప్రొ. శ్రీ రాజేంద్ర సింగ్) రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాలుగవ సర్ సంఘచాలక్ గా 1994 నుండి 2000 దాకా సేవలు అందించారు.
29 జనవరి 1922 జన్మించిన రజ్జూ భయ్యా అలహాబాద్ విశ్వవిద్యాలయంలోని భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా పనిచేసారు. అనంతరం 1960 వ దశకంలో ఆ పదవిని త్యజించి తన జీవితాన్నిఆర్ఎస్ఎస్ కార్యానికి అంకితం చేశారు.
రజ్జూ భయ్యా ఎమెస్సీ చదువుతున్న రోజులలో వారికి నోబల్ ప్రైజ్ గ్రహీత సీవీ రామన్ పరీక్ష పర్యవేక్షకునిగా వారి కళాశాలకు వెళ్ళారు. ఆ సమయంలో ఆయన రజ్జూ భయ్యా ప్రతిభాపాటవాలను ఎంతగానో మెచ్చుకున్నారు. వారికి అణుధార్మిక రంగంలో ఉన్నత పరిశోధన కోసం ఫెలోషిప్ కూడా ఇప్పించారు.
భౌతికశాస్త్రంలో పట్టభద్రుడైన తరువాత స్పెక్ట్రోస్కోపిపై పాఠాలు చెప్పడానికి అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా చేరిన రజ్జూ భయ్యా అక్కడ ఎన్నో సంవత్సరాలు పనిచేసిన తరువాత భౌతికశాస్త్ర విభాగానికి అధిపతిగా బాధ్యతలు తీసుకున్నారు. రజ్జూ భయ్యా అణుధార్మిక క్షేత్రంలో కూడా నిష్ణాతునిగా పేరు తెచ్చుకున్నారు. ఆ రోజులలో అంత గొప్ప పేరు సంపాదించుకోగలగడం చాలా అరుదు. తన విభాగంలో ఆయన గొప్ప అధ్యాపకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఎంతో క్లిష్టమైన పాఠాలను చాలా సరళంగా చెప్పడం ఆయన ప్రత్యేకత.
ఆర్ఎస్ఎస్ తో సహచర్యము:
రజ్జూభయ్యా 1942లో జరిగిన క్విట్ ఇండియా ఆందోళనలో చాలా చురుకుగా పాల్గొన్నారు. ఈ సమయములోనే వారికి ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి మీద సంఘ్ ప్రభావము ఏర్పడింది. 1966 లో తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, ప్రాంత ప్రచారక్ గా పూర్తిగా తన సేవలను సంఘ్ కు అర్పించారు. ఉత్తరప్రదేశ్ ప్రాంత ప్రచారక్ గా పని ప్రారంభించిన ఆయన 1980లో సర్ కార్యవాహ్ గా, ఆ తరువాత 1994 సంవత్సరంలో బాలసాహెబ్ దేవరస్ తరువాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 4వ సర్ సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో లాల్ బహదూర్ శాస్త్రి మొదలైన వారితో కలిసి పనిచేసారు. మురళీమనోహర్ జోషి వారి శిష్యపరమాణువులలో ఒకరు. వారు పనిచేసిన ఆ ఆరుసంవత్సరాలు కూడా సంఘ్ కి, దేశానికి ఎంతో కీలకమైన సమయము.
రజ్జూభయ్యాకు అందరు రాజకీయ నాయకులతో చక్కటి అనుబంధం, చనువు ఉండేది. వారివారి ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రమేయము లేకుండా అన్నివర్గాల వారితో మమేకమైపోయేవారు. ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఆరోగ్యం సహకరించక ఆయన సర్ సంఘచాలక్ బాధ్యత నుంచి తప్పుకున్నారు. తన తరువాత సుదర్శన్ జీని సర్ సంఘచాలక్ గా ప్రతిపాదించారు.
ఎమెర్జెన్సీ సమయంలో వారు భారతదేశ పర్యటన చేపట్టారు. 1976లో డిల్లీలో మానవహక్కుల సమ్మేళనం నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారు. ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ అనే సంస్థ మొదలుపెట్టడంలో కూడా వారు కీలకపాత్ర పోషించారు.
“జన్మతహ మనుషులందరూ మంచివారే. వారితో మాట్లాడేటప్పుడు వారిలోని మంచిగుణాల మీద నమ్మకంతో మాట్లాడాలి. కోపము, అసూయ అనేవన్నీ కూడా వారి పూర్వ అనుభవాల ప్రతిక్రియ. వీటి ప్రభావము మనిషి నడవడిక మీద పడుతుంది. మౌలికంగా ప్రతీ మనిషీ మంచివాడు, విశ్వసించదగినవాడు” అని రజ్జుభయ్యా భావించేవారు. స్వదేశీ మరియు గ్రామీణజీవనాన్ని ఆర్ధికంగా బలోపేతం చేయడంలో ఎంతో విశ్వాసం కలిగి ఉండేవారు.
1995లో గ్రామీణాభివృధి మీద దృష్టి కేంద్రీకరించి, గ్రామాలను ఆకలిరహిత, రోగరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని తీర్మానం చేసారు. ఇవ్వాళ 100 కి పైగా గ్రామాలలో స్వయంసేవకులు చేసిన పనిని చూసి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలోని ప్రజలు ఉత్సాహం పొంది స్వయంసేవకులు చేసిన ప్రయోగాలని వారు అనుసరిస్తున్నారు.
1995 లో రజ్జూభయ్యా విజయదశమి ఉత్సవ సందర్భంగా నాగపూర్ లో జరిగిన కార్యక్రమంలో లాల్ బహదూర్ శాస్త్రి, గాంధీని గుర్తుచేసుకున్నారు. ఆ ఇద్దరు మహాపురుషుల కలలను సాకారం చేయడంలో కేంద్ర ప్రభుత్వం తగిన చిత్తశుద్ధి చూపడం లేదని అన్నారు.
రాంప్రసాద్ బిస్మిల్ పేరు మీద ఒక స్మారకచిహ్నాన్ని డిల్లీలో ఏర్పాటు చేయలని రజ్జ్యుభయ్యా అనుకున్నారు. 14 జులై 2003 తేదీన పూనేలోని కౌశిక్ ఆశ్రమంలో రజ్జూ భయ్యా తుదిశ్వాస విడిచారు.
___vskteam