‘కదిలేవాడు’గాడే రాముడు కథలెన్నో గలవాడే
మొదలై తానైనా తుదమొదలే లేనివాడైనాడే
కల్పనలెన్నడు లేడు సంకల్పములే కలవాడు శేష
తల్ప శయునుడే వాడు శ్రీత్యాగరాజు సుతుడైనాడే” అని త్యాగయ్యస్తుతించినా..
“రామచంద్రుడితడు రఘువీరుడు… కామిత ఫలములీయ గలిగేనిందరికి
గౌతము భార్య పాలిట కామధేనువితడు.. ఘాతల కౌశికుపాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు… యీతడు దాసుల పాలిట ఇహపర దైవము” అని అన్నమయ్య కొలిచినా..
తన జీవితం ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక, ధార్మిక, నైతిక వెలుగులను అందించి అమరత్వం పొందే బాటను ఆవిష్కరించిన ఒక అద్భుత దీప్తి.. శ్రీరామచంద్రమూర్తి. ఆ పురాణపురుషుని గాథయే శ్రీరామాయణం. భారతీయ వాఙ్మయంలో రామాయణం ఆదికావ్యంగానూ, దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆదికవిగాను ప్రసిద్ధులు. ఈ కావ్యం భారతీయ భాషల్లో రామామృతపానం, రామకథా గానం చేసిన మహాకవుల గురించి తెలుసుకుందాం.
వాల్మీకి రామాయణం
శ్రీరామచరితం ప్రపంచానికి మొట్టమొదట తెలిసింది వాల్మీకి రామాయణం. ద్వారానే. క్రీ.పూ. 3వ శతాబ్దంలో వాల్మీకి రచించిన రామాయణంలో 24 వేల శ్లోకాలున్నాయి. అవి బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ, ఉత్తర కాండ.. అని ఏదు కాండలుగా విభజించి కనిపిస్తాయి. వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా తీసుకుని కొన్ని శతాబ్దాలుగా ఎందరో కవులు రామాయణ కథను స్థానిక భాషల్లో వెలువరించారు. దానికి ప్రాంతీయంగా మార్పులు చేర్పులు చేశారు. సాహిత్య సంప్రదాయం పునరుజ్జీవానికి తమ వంతు కృషి చేస్తూ.. భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. మహర్షి వాల్మీకితో సమానంగా వారందరినీ ప్రజలు పూజ్యభావంతో కొలుస్తున్నారు.
తెలుగులో
గోన బుద్ధారెడ్డి (రంగనాథ అని కూడా ఆయనను పిలుస్తారు) దక్షిణాది పాలకుడు, కవి. ఆయన రచించిన ‘రంగనాథ రామాయణం’ తెలుగు భాషలో అందంగా చెప్పిన రామాయణాల్లో ఒకటిగా ప్రాచుర్యం పొందింది. చాలా మంది మేధావులు ఆయన సాధారణ శకం 1300-1310 మధ్య తన కుటుంబ సభ్యుల సహకారంతో ఈ రచన చేసినట్టుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ జనజీవనంలో అది భాగంగా మారింది. తోలుబొమ్మల రూపంలో దానిని వివరించేవారు. గోన బుద్ధారెడ్డి కుమారుడు గోనగన్నారెడ్డి (1262-1296) రంగనాథ రామాయణాన్ని తెలుగులో ద్విపద కావ్యంగా మలిచారు.
రామాయణం మీద తెలుగు కవుల భక్తికి ఇంకా ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వాల్మీకి మూల కావ్యాన్ని అనుసరించి ఎందరో కవులు, రచయితలు, విద్వాంసులు వివిధ ప్రక్రియలలో రాసి, గానం చేసి లోకానికి అందించారు. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం, మొల్ల రామాయణం, రఘునాథ రామాయణం, కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (‘రామాయణ కల్పవృక్షం.. ఈ కావ్యానికే విశ్వనాథ జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నారు. తెలుగులో రామాయణమే తొలి జ్ఞానపీఠాన్ని నెలకొల్పింది.) విహారి, భళ్లపూడి వేంకట చిరంజీవిరావు, భాస్కరుడు, పుట్టపర్తి నారాయణాచార్యులు (జనప్రియ రామాయణం) దొడ్ల రామాయణం, ఎర్రాప్రెగ్గడ, జొన్నాభట్ల పెదనరిసింహా శాస్త్రి (రావణాయనం) మున్నగునవి ప్రశస్థమైనవి. భక్త రామదాసు కీర్తనలు, దాశరథి శతకం, శ్రీనివాస శిరోమణి, డాక్టర్ దాశరథి రంగాచార్యులు, ఉప్పులూరి కామేశ్వరరావు, డాక్టర్ అక్కిరాజు రమాపతిరావు, అయ్యదేవర పురుషోత్తమరావు, ఉషశ్రీ రాసిన వచన రామాయణాలు అలరిస్తున్నాయి.
కశ్మీరీలో
కశ్మీరీ ఆధ్యాత్మిక కవిప్రకాష్ రామ్ కుల్గామి (19వ శతాబ్దం) రామాయణాన్ని రచించారు. 19వ శతాబ్దానికి చెందిన ‘రామావతార్ చరిత్’ కాశ్మీరీ భాషలో వచ్చిన తొలి రామాయణం. అది ఎన్నో రకాలుగా విశిష్టమైనది. ఆ భాషలోని ఏడు రామాయణాల్లో అది ఒక్కటే ప్రచురణకు నోచుకుంది. మహాశివునికి, పార్వతికి మధ్య సంభాషణ రూపంలో సాగే ఈ కథనంలో, మధ్యలో ఎందరో శ్రోతలు, వక్తలు కనిపిస్తారు. ఆ భాస రామకథలో ఎన్నో మార్పులు, మళ్లింపులు చోటు చేసుకున్నాయని చాలా మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూంటారు.
బెంగాలీలో
బెంగాలీ భాషలో తొలి రామాయణాన్ని మహాకవి కృత్తివాస ఓఝా (1389)లో రచించారు. ఆయన మూలకథను వాల్మీకి రామాయణం నుంచితీసుకుని ఎన్నో మార్పులు చేశారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో అంశాలను జోడించారు. కృత్తివాస రామాయణం’ చాలా ప్రాచుర్యం పొందింది. ఎన్నో బెంగాలీ కుటుంబాలు ఆ పుస్తకాన్ని పూజ్యభావంతో చదువుతాయి. మధ్య యగం నాటి బెంగాలీ సాహిత్య రూపమైన సంప్రదాయ రామాయణ పాకలి రూపంలో ఈ రచన సాగుతుంది. మధ్యయుగం నాటి బెంగాలీ సమాజం, సంస్కృతి ఇందులో కనిపిస్తాయి. భక్తి ఉద్యమంలో కృత్తివాస రామాయణం కీలక పాత్ర పోషించింది. బెంగాల్లోని గంగాపరీవాహక ప్రాంతాల్లో వైష్ణవం వృద్ధికి అది దోహదం చేసింది.
బెంగాల్లో రామాయణం అనేక రూపాల్లో కనిపిస్తుందీ, కైలాస బాసు (1588) అద్భుత రామాయణం రచించారు.ఆ తర్వాత 17వ శతాబ్దంలోనూ అదేపేరుతో ఇంకో రామాయణం విడుదలయ్యింది. 17వ శతాబ్దంలో బెంగాలీ కవయిత్రి చంద్రావతి రామాయణ కథను తనదైన ఆధ్యాత్మిక భావనతో జానపద కళారూపంగా మలిచారు.
గుజరాతీలో
గుజరాత్‌లో 6వ శతాబ్దానికి చెందిన భర్తృహరి సంస్కృతంలో రాసిన ‘భట్టికావ్యం’ రామాయణ కథను చెప్పిన తొలిరచన. అలాగే 14వ శతాబ్దంలో ఆసాయిత్ రచించిన ‘రామర్ లీలా న పాడో’ ఆ భాషలో వచ్చిన తొలి రామాయణం అన్న అభిప్రాయం ఉంది. 15వ శతాబ్దంలో, ‘భలానా రామవివాహ’ అనే రచన చేశారు. అనంతరం వేర్వేరు కాలాల్లో 50 వరకూ రామాయణాలు వెలుగు చూశాయి. అన్నింటిలోకి 20వ శతాబ్దంలో వచ్చిన ‘గిరిధారదాస’ బాగా ప్రాచుర్యం పొందింది.
స్వామినారాయణ్ సంప్రదాయానికి చెందిన సాధువు, స్వామినారాయణ పరమహంసగా పిలిచే ప్రేమానంద స్వామి (1784-1855) తులసీదాసు రామచరితమానస్‌ను గుజరాతీలోకి అనువదించారు.
పంజాబీలో
10వ సిక్కు గురువు, గోవింద్‌రాయ్‌గా జన్మించిన గురుగోవింద్ సింగ్ (31666-1708) ఆధ్యాత్మిక వేత్త, కవి, తత్త్వవేత్త, రామాయణాన్ని ‘రామావతార్ ఇన్ గురుముఖి’ పేరుతో రామాయణ గాథను 24 అవతారాల్లో వర్ణించారు. ‘చౌబీస్ అవతార్’ అనేది దశమగ్రంధ్ అనే దానిలో ఓ భాగం. గురుగోవింద్ సింగ్ రచించిన 10 గ్రంథాల్లో ఒకటి.
హిందీలో
శ్రీరాముని జీవిత గాథను హిందీ (అవధి) భాషలో చెప్పిన రచనల్లో ఆధ్యాత్మిక కవి తులసీదాస్ రచించిన ‘రామచరితమానస్’ను అత్యుత్తమమైనదిగా చెప్పాలి. తులసీదాస్ (1632-1623) గోస్వామి తులసీదాస్ గా ప్రాచుర్యం పొందారు. ఉత్తర భారతదేశానికి చెందిన రామానంద వైష్ణవ కుటుంబానికి చెందిన వాడు. శ్రీరాముని పరమభక్తుడు. సంస్కృతం, అవధిలలో శ్రీరామునిపై అనేక రచనలు చేశారు. ఆయన రచనలు మొత్తంగా ‘భారతీయ సంస్కృతికి సమగ్రరూపం’గా రూ నిలుస్తాయి. మధ్యయుగం నాటి భారతీయ కవిత్వంలో శిఖరాయమానంగా నిలుస్తాయి.
ఆధ్యాత్మిక సాహిత్యంలో, భారతీయుల విశ్వాసాలను పరిరక్షించడంలో మేలిమి రచనలని చెప్పుకోవాలి. వీటితో పాటు హిందీ మాండలికాల్లోనూ జానపద రీతుల్లోనూ రచనలు సాగాయి. రాధేశ్యామ. ‘రామాయణ్’, మైథిలీ శరణ్ గుప్తా ‘సాకేత’ రామాయణం గొప్పతనాన్ని చాటిన ప్రధాన రచనలని చెప్పాలి.
కన్నడంలో
కన్నడంలో శ్రీరాముని కథ తొలిసారిగా చావుందరాయ పురాణంలో ప్రస్తానన కొచ్చింది. 978 లో ‘పంపా రామాయణం’గా ప్రాచుర్యం పొందిన ‘రామచంద్ర చరిత పురాణ’ ను 11వ శతాబ్దంలో నాగచంద్ర, లేదా అభినవ పంప రచించారు. కన్నడ భాషలో వచ్చిన తొలి రామాయణంగా దాన్ని చెప్పుకోవాలి. అది సంప్రదాయకమైన చంపూ మీటర్ పద్ధతిలో, విమలాసురుని పౌమ చరిత విధానంలో ఉంది. ఇందులో 16 అధ్యాయాలున్నాయి. వాల్మీకి మూల రచన నుంచి పక్కకు సాగుతుంది.
క్లాసికల్ కన్నడలో చెప్పిన రామాయణం ‘కుముదెందు రామాయణం (జైన్ పద్ధతిలో) 13వ శతాబ్దంలోనూ, కుమార వాల్మీకి తొరావే రామాయణం 16వ శతాబ్దంలోనూ వచ్చాయి. దానితో పాటు రమాకాంత నరహర రచన కూడా చెప్పుకోదగ్గవి. అతన్ని ‘కుమార వాల్మీకి’ గా పిలుస్తారు. వాల్మీకి రామాయణంలోని అంశాలను ఎక్కువగా స్వీకరించటం వల్ల ఆయనకు ఈ పేరు వచ్చింది. 19వ శతాబ్దపు కవి ముద్దన్న శ్రీరాముని పేరుమీద ‘అద్భుత రామాయణం’,’రామాశ్వవమేథ’, ‘రామపట్టాభిషేక’ అనే రచనలు చేశారు.
మరాఠీలో
సంత్ ఏకనాథ్ (కీ.శ1533-1599) హిందూ సాధువు, తత్త్వవేత్త, కవి.కృష్ణ భగవానుని భక్తుడు. వర్కారీ సంప్రదాయానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ‘భావార్ధ రామయణం’ పేరుతో రామాయణ ఇతిహాసానికి భిన్నమైన భాష్యం చెప్పారు. దీనితో పాటు 12 లేదా 13వ శతాబ్దంలో రామాయణం మరాఠీలోకి అనువాదం అయినట్టు ఆధారాలు చెబుతున్నాయి.
కొంకణిలో
రామాయణం కొంకణి అనువాదం ‘రామాయణం’ రచయిత కృష్ణదాస శర్మ (కీ.పూ 15వ శతాబ్దం), ఆయన గౌడ సారస్వత బ్రాహ్మణుడు. గోవాలోని కోర్టలిం సమీపాన గల క్వెలోస్సిమ్ (కెలోషి) ఆయన స్వగ్రామం, కొంకణి భాషలో ఆయన రచనలు పోర్చుగల్లోని బాగా పబ్లిక్ లైబ్రరీలో 771, 772 సంకేతాల రూపంలో అందుబాటులో ఉన్నాయి. రామాయణ, మహాభారతాలు వచనం రూపంలో ఇందులో కనిపిస్తాయి. డాన్ ఫ్రాసిస్కో గ్రాసియా అధీనంలో రాచోల్ (రాయితూర్) శిక్షణ సంస్థలో అందుబాటులో ఉన్నాయి. 16వ శతాబ్దంలో జెసూట్ మేధావులు రోమన్ భాషలోకి దీనిని లిప్యంతరీకరణ (ట్రాన్స్ లిటరేట్) చేశారు. కొంకణి భాషలో తొలిగా ఉనికిలో వచ్చిన వచన రచనగా వాటిని మనం చెప్పుకోవాలి.
ఒడిశాలో
బలరామదాస (కీ.శ.1472-1556) ఒడిశా కవి, సాహిత్యకారుడు. భక్తిఉద్యమంలో ఒడియా సాహిత్యం పంచశాఖలో ప్రాచుర్యం పొందిన ఐదుగురు కవుల్లో ఆయన ఒకరు. ఆయన ప్రాచీన రామాయణాన్ని ‘జగమోహన ‘రామాయణం’ పేరుతో రచించారు. వాల్మీకి రామాయణానికి పునర్ వ్యాఖ్యానం చేశారు. కొన్నిసార్లుమూల రచన నుంచి పక్కకు మళ్లారు.
తమిళంలో
సంగం సాహిత్యంలో రామాయణానికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తాయి. అది వాల్మీకి రామాయణం అంత పురాతనమైనది. పురాణసన్పూరు సంకలనంలో ఒక పద్యం-రావణుడు సీతను అపహరించటం గురించి చెబుతుంది. కంబార్ (కీ.శ 1180-1250) మధ్యయుగం నాటి తమిళకవి. కంబ రామాయణంగా ప్రసిద్ధమైన రామావతారం రచయిత. రామాయణ ఇతిహాసానికి తమిళ అనువాదం. 11వేల చరణాలున్న కంబ రామాయణం వాల్మీకి రామాయణానికి యథాతథమైన అనువాదం కాదు. రాముని కథను పునర్లిఖించారు. కొందరు మేధావులు కంబార్ క్రీ.శ 9వ శతాబ్దానికి చెందిన వాడుగా చెబితే, మరికొందరు ఆయన 12వ శతాబ్దానికి చెందిన వాడని వాదిస్తారు.
మలయాళంలో
తుంచత్తు రామానుజన్ ఎజుతచ్చన్ (క్రీ.శ.16వ శతాబ్దం) మలయాళ భక్తకవి, అనువాదకుడు, భాషావేత్త, ఆధునిక మలయాళ భాషకు పితామహునిగా గుర్తింపు పొందారు. కేరళ సాహిత్యరంగాన్ని (భక్తి ఉద్యమంతో ముడిపడి ఉన్న దేశీయ మతపరమైన పాఠ్యాంశాలు) మలుపుతిప్పిన అగ్రగణ్యుల్లో ఒకరు. చిలుక పలుకుల్లా అత్యంత సరళంగా ఆధ్యాత్మిక రామాయణం రూపొందించటం ఎజుతచ్చన్ కు విశిష్టతను తెచ్చిపెట్టింది. ఆధునిక మలయాళంలో దీనిని రూపొందించారు.
అస్సామీలో
కవిరాజ మాధవ కండలి 14వ శతాబ్దానికి చెందిన అస్సామీ కవి. ఆయన రచన ‘సప్తకంద రామాయణం’ తొలి అనువాదాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది. కంభర అనువాదం తర్వాత రచనగా ప్రసిద్ధికెక్కింది. అస్సాంలో వచ్చిన మొట్టమొదట రచనల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బొర్హ మహారాజు మహామాణిక్య ఆదేశాల మేరకు జనసామాన్యం అభిరుచుల మేరకు రాసిన సప్తకంద రామాయణ జానపద బాణీని అనుసరించటంతో మరింత ప్రాచుర్యం సంతరించుకుంది.
సాహిత్య సాంప్రదాయాల్లో..
బుద్ధిజం: బౌద్ధ సాహిత్యంలో రాముని గాథను వివరించే మూడు జాతక కథలున్నాయి.. ఇవన్నీ క్రీ.పూ.మూడో శతాబ్దానికి చెందినవి. దశరథ రామాయణంలో రాముడిని రామ-పండితుడు అని వ్యవహరిస్తారు.
జైన్లు: సంస్కృతం, ప్రాకృతం, కన్నడ… ఇలా వివిధ భాషల్లో జైన రామాయణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో విమల సూరి రచించిన పౌమ చారీయం అనేది మిగిలిన వాటి అన్నింటికంటే పురాతనమైనది.
నేపాలి: భానుభక్త ఆచార్య (1814-1868) నేపాలీ కవి, రచయిత, అనువాదకుడు. రామాయణాన్ని సంస్కృతం నుంచి నేపాల్లోకి అనువదించిన తొలి వ్యక్తి. ఆయనను నేపాలీ భాషలో ఆదికవి అని గుర్తించి గౌరవించారు. భానుభక్త రామాయణం అనేది హిందూయిజాన్ని ప్రజాస్వామీకరించటంలో కీలకమైన తొలి అడుగుగా చెబుతారు. అది బహుముఖంగా నేపాలీ జనసామాన్యంలోకి చొచ్చుకెళ్లింది.
పర్షియన్: మొగల్ చక్రవర్తి అక్బర్ బాదుషా పర్షియన్ భాషలో రామాయణాన్ని అనువదించాలని ఖాదర్ బదౌనీని ఆదేశించారు. అయితే జహంగీర్ హయాంలో సాదుల్లూ మాషీ పాని ఈ బాధ్యతను తలకెత్తుకుని దానిని విజయవంతంగా పూర్తి చేశారు.
ఆర్గనైజర్ సౌజన్యంతో
అనువాదం: డాక్టర్ పార్థసారథి చిరువోలు