Taslima Nasreen |
బంగ్లాదేశ్‌లలో పరిస్థితే భారత్‌లోనూ ఏర్పడుతుంది
హిందువులు అధిక సంఖ్యాలుగా ఉన్నంతవరకే రాజ్యాంగం, లౌకికవాదం, చట్టం మొదలైనవన్నీ. హిందువులు మైనారిటీలైతే ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లలో పరిస్థితే భారత్‌లోనూ ఏర్పడుతుంది.
– తస్లీమా నస్రీన్, రచయిత్రి
తస్లీమా నస్రీన్ జీవితచరిత్ర :
అంతర్జాతీయ సాహిత్య ప్రపంచంలో తస్లీమా నస్రీన్ పేరు తెలియని వారుండరు.ఆమె బంగ్లాదేశ్ లోని మైమెన్సింగ్ నగరంలో 1962 లో జన్మించారు. 1984 లో మెడిసిన్ పట్టా పుచ్చుకొని, బంగ్లా రాజధాని ఢాకాలోని ఆసుపత్రులలో ప్రసూతి నిపుణురాలుగా, మత్తు వైద్యురాలుగా పని చేసారు. తన మెడిసిన్ చదువుల కాలంలోనే ఆమె బలమైన స్త్రీ వాద రచయిత గా రూపొందారు.పిదప కవిత్వమూ, నవలలు , వ్యాసాలు ప్రచురించారు. ఆమె ప్రచురించిన ‘లజ్జ’ (Shame,1993 ) నవల బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను, మతమార్పిడులను ప్రపంచానికి తెలియజేస్తున్న పుస్తకం రెచ్చగొట్టే విధంగా వుందని బంగ్లాదేశ్ ప్రభుత్వం 1994 లో నిషేధించింది. ఆమె లౌకిక, స్వేచ్చాయుత దృష్టికోణం ముస్లిం పక్షపాత మతతత్వ ధోరణులను బహువిధాలుగా ఎండగట్టింది. ఎన్నో చర్చలు, వాదోపవాదాలు రగిల్చింది. దాంతో కోపోద్రిక్తులైన బంగ్లాదేశ్ లోని సంప్రదాయవాదులు దైవదూషణ చేసినందుకు గాను ఆమెను ఉరి తీయాలని ఆందోళనలు చేసారు. దాంతో తస్లీమా నస్రీన్ రహస్యంగా బంగ్లాదేశ్ ను వదిలి స్వీడన్‌లో తలదాచుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె ఆత్మకథలు’ అమర్ మేయెబెల ‘ ( My Childhood, 2002 )ను ; ‘ఉతల్ హవా'( wild wind ) ను 2002లో, ‘ క’ ( Speak up ) ను 2003 లో నిషేధించింది. పశ్చిమ బెంగాల్ లో ముద్రితమైన ‘ ద్విఖండిత ‘ను కూడా బెంగాల్ ప్రభుత్వం నిషేధించి, 2005 లో ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. మొత్తం గా ఏడు భాగాలుగా తస్లీమా ఆత్మకథనాలు ముద్రితమైనాయి.వివాదాస్పదమయ్యాయి.
తస్లీమా ఇప్పటివరకు 30 పుస్తకాలు ముద్రించారు.20 కు పైగా భాషలలోకి ఆమె పుస్తకాలు అనువాదం అయ్యాయి.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి 1992,2000 సంవత్సరాలకు గాను ఆనంద పురస్కారం; 1994 లో యూరోపియన్ పార్లమెంట్ నుండి సాక్రోవ్ పురస్కారం,1994 లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి మానవ హక్కుల పురస్కారం, 1994 లో స్వీడన్ ప్రభుత్వం నుండి కుర్ట్ టుకులోస్కీ పురస్కారం వంటి అనేక అంతర్జాతీయ పురస్కారాలు పొందారు.బెల్జియం ( 1995 ), పారిస్ ( 2005 ),ఫ్రాన్స్ ( 2011 ) వంటి దేశాల యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్ లు పొందారు.
ఈ కవితలు ఆమె రాసిన కవితా సంపుటుల నుంచి సంగ్రహించినవి.స్త్రీల హక్కులు, మతతత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నించి, నిలదీసే రచయిత్రిగా పేరు పొందిన తస్లీమా నస్రీన్ ఒక ప్రత్యేక గొంతుకతో స్త్రీల ఆంతరంగిక ప్రేమ,నిరీక్షణ, ఘర్షణ, ఆశ, నిరాశ, స్వేచ్ఛాయుత భావ ప్రకటన వంటి విషయాలను ఈ కవితలలో నిర్భయంగా వ్యక్తపరిచారు. తస్లీమా నస్రీన్ లోఆలోచనలు పరుచుకున్న ఈ కవితలు మన మనసులను కదిలిస్తాయి.కల్లోల పరుస్తాయి.
దైవ దూషణ చేసినందుకు గాను తస్లీమా జైలులో వున్నప్పుడు(2002) రాసిన కవితలు ఇవి.
1.బందిఖానాలో నా జీవితం
స్నానం చేయడం..
రోజు విడిచి రోజు నేను స్నానం చేయను
నెలలు గడిచాయి, నా శరీరం ఘాటైన వాసన వెదజల్లుతోంది
అయినప్పటికీ, స్నానం చేయాలనే కోరిక నాకు లేదు
నేనెందుకు చేయాలి ? స్నానం వల్ల ఉపయోగం ఏమిటి?
ఒక అర్థం లేని ఉదాసీనత నన్ను చుట్టుముట్టింది
రోజుకు మూడుసార్లు
నాకు ఆహారం అందించడానికి
ఒక వ్యక్తి వస్తాడు
నాకు ఇష్టమున్నా ,లేకున్నా
అదొక విషయం కాదు
కానీ నేను దానిని మింగాలి
నేను తినకుండా జీవించగలనా!
అప్పుడు నేను వారితో ఇలా అనగలను:
నువ్వు అనుకున్నది నాకు ఇవ్వు
ఆహారం అనే పదార్థం తప్ప
నిద్రపోతున్నాను..
నేను నిద్రపోయే ముందు
నాకు నేనే జోల పాడుకుంటున్నాను
నను వదలని భయాలతో బాధపడుతున్నాను:
నాకు ఏదైనా దెయ్యం పడితే...
నేను మళ్ళీ మేల్కొనలేకపోతే..!
నేను నిద్రలో పడిపోయి..
నిద్రలో ఊపిరాడక గింజుకుపోతున్నట్లుగా అయిపోతే..
తత్తరపడి, పదేపదే మేల్కొన్నాను
నేను చుట్టూ చూస్తూ ఆలోచిస్తున్నాను:
ఇది నా స్వంత పడక గదినా?
లేదు, ఇది నా స్వంత గది కాదు
బహిష్కరణ కేవలం ఒక పీడకల,
ఇది వాస్తవికతలో భాగం కాకూడదు
నేను పగటిపూట మేల్కొని ఉన్నంత వరకు
బహిష్కరణ ఒక పీడకలలా నాపై వసిస్తుంది
నా నమ్మదగని కలలని ఆవిరి చేయకూడదని
నిద్రా ! నేను నిన్ను భయపెడుతున్నాను..!
ఉద్యమం
నేను నివసించే గది దీర్ఘచతురస్రాకారంలో ఉంది
దాని నాలుగు గోడల మధ్య బంధించబడి
నేను కేవలం ఒక మూల నుండి మరొక మూలకు వెతుకుతాను
నేనెంత అత్యుత్సాహంతో మొత్తుకున్నా;
పై నుండి ఆజ్ఞ, నేను తప్పక కట్టుబడి ఉండాలి
గది నా నుండి ఒక గడ్డకట్టిన భాగస్వామిలా వేరు చేయబడింది,
నేను, అవతలి మూలన, సాష్టాంగపడి పడుకున్నాను
ఈ కఠోర నిశ్శబ్దంలో, నేను ఆశ్చర్యపోతున్నాను:
నాకు తెలిసి ఇంత విశాలమైన, ఉదారమైన, ఉత్కృష్ట
పురాతన అవని..
ఎప్పటి నుంచి ఇది ఇంత పక్షపాతంగా మారింది?
సమావేశం
జైళ్లలో కూడా..
వారు కొన్ని నియమాలను గౌరవిస్తారు..
సందర్శకులను కలవడానికి అనుమతి
వాటిలో ఒకటి
స్నేహితులు లేని,బంధువులు లేని
కట్టుబాటుని కాలదన్నే ఖైదీగా ఉండమని నన్ను బలవంతం చేశారు.
ఒక ఖైదీలాగా నన్ను ఆదరించాలని
ప్రతిరోజూ అర్జీలు పంపుతున్నాను
భారత ప్రభుత్వం స్తబ్దుగా కదలకుండా ఉంది
2.మేము!
నిన్న రాత్రి ఒక బల్లి ఎక్కడి నుంచో వచ్చి నా మీద పడింది.అది నా చేయి వెంబడి మెలికలు తిరుగుతూ నా భుజం మీదకు ఎక్కి, నా తల మీదకు వెళ్లి,నా చెదిరిన జుట్టు గుబురులో దాక్కుంది.దిమ్ముగా వున్న నా తల వెనుక చేరి,అది మరో బల్లి వద్ద గంటల పాటు నిక్కుతూ వుంది.తెల్లవారుజామున, అది నా చెవి పక్కకి జారి, నా వెన్నెముకపై చతికిలబడాలని నిర్ణయించుకుంది.
రెండవ బల్లి నా కుడి కాలు మీద, నా మోకాలి నుండి రెండు అంగుళాల క్రింద స్తంభించిపోయింది. సాయంత్రం మొత్తం అవి తమ స్థానాల నుండి కదలలేదు.వాటిని తీసివేయలేక పోయినందున, నేను సాధారణంగా చేసే పనే..గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నాను.సడి చేయకుండా,తిరగేసి లెక్కించడంలో నిజంగా ఎటువంటి హేతుబద్ధత లేకపోయినా- నేను పదే పదే వంద నుండి ఒకటి వరకు లెక్కించాను.
నా మంచం - మురికి బట్టలు, ఉపయోగించిన ట్రేలు, మిగిలిపోయిన భోజనంతో, పగిలిన గిన్నెలతో, వ్రాసుకోవడానికి నోట్‌బుక్‌లు, టీ మరకల కారణంగా గోధుమ రంగులోకి మారిన పాత వార్తాపత్రికలు; ఊడి చిక్కుకున్న జుట్టుతో ఒకటి రెండు దువ్వెనలు; బొగిలిపోయి పడున్న ఒకటి రెండు బియ్యం పిండి చెక్కలు ; చెదిరిపోయిన మందుమాత్రల అట్టలు, తాగి చెల్లాచెదురుగా పారేసిన సీసాలు; ఇంకు లేని పెన్నులు వగైరా..వగైరా..లతో గందరగోళంగా ఉంది.
కొన్ని రోజులుగా రెండు వందలకు పైగా నల్ల చీమలు నా మంచాన్ని ఆక్రమించాయి. నా మంచం మీద వాటి కొత్త కాలనీని నిర్మించడానికి అవి నడుం కట్టాయి. కొంచెం కొంచెంగా అవి నన్ను పూర్తిగా నియంత్రించడం ప్రారంభించాయి.అవి చాలా అల్పజీవులు.రోజుల తరబడి, వెరపున వణుకుతూ..నేనే ఈ చిన్నచీమలలాగా అయిపోయాను.
వాటి తీరు చూసి నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను.అవి నా ఒంటి మీద తమ ఇష్టారీతిన తిరుగుతున్నాయి - కానీ పొరపాటున కూడా అవి ఒక్కసారి కూడా నన్ను కుట్టలేదు. నేను వాటికి చెందినదానినేనని అవి భావించినట్టున్నాయి..
వాటి సహవాసంలో సాహచర్యంలో మనుషుల మధ్య కంటే వాటి మధ్యే సురక్షితంగా ఉన్నానని నేను భావిస్తున్నాను…
3.ఏమి దేశం..!
ఒక శకానికి పైగా
నేను పడుతున్న బాధలను నా దేశం ఆస్వాదించింది
పరాయి దేశాలలో నా బహిష్కరణను చూస్తున్నాను
దూరం నుండి చూపు మసకబారినప్పుడు
వారు బైనాక్యులర్ ద్వారా నా మీద గూఢచర్యం చేస్తారు
పొరలు పొరలుగా నవ్వుకుంటారు
వారిలో ఒక నలభై మిలియన్లు మంది
నా వినాశనాన్ని ఆనందిస్తున్నారు
ఇంతకు ముందు నా దేశం ఇలా ఉండేది కాదు
మానవత్వంతో నిండిన
హృదయమనేది ఆమెకు వుండేది
ఇప్పుడు ఇది నాకు తెలిసిన దేశం కాదు
ఇప్పుడు ఆమె
కొన్ని ఎండిపోయిన నదులు
కొన్ని కుగ్రామాలు, పట్టణాలు
అక్కడక్కడ కొంత పచ్చదనం, కొన్ని చెట్లు
కొన్ని ఇళ్ళు, మార్కెట్లు, ఎండిన పచ్చికభూములు
మనుషులను పోలి ఉండే కొందరు వ్యక్తులు మాత్రమే..!
ఒకప్పుడు నా దేశం జీవంతో మిసమిసలాడింది
నా ప్రజలు పద్యాలు చెప్పారు
ఇప్పుడు కవిని బహిష్కరించే ముందు
ఎవరూ ఒకటికి రెండుసార్లు ఆలోచించడం లేదు
ఇప్పుడు కటికచీకటి రాత్రి, దేశం మొత్తం
నూట యాభై మిలియన్లు మంది
ఒక కవిని ఉరి వేయడానికి సంకోచించదు
అమితానందం పొందుతుంది
ఒకప్పుడు దేశానికి ఎలా ప్రేమించాలో తెలుసు
ఇప్పుడు ఆమె హింసతో నిండి,ముఖం చిట్లించడం నేర్చుకుంది
ఆమె వద్ద పదునైన కత్తులు, మారణాయుధాలు
చేతిలో ప్రాణాంతకమైన పేలుడు పదార్థాలు వున్నాయి
ఇకపై ఆమె ఏ గీతం పాడదు
కాలక్రమేణా, దేశం కోసం అన్వేషణలో
నిద్ర లేకుండా, దశాబ్దాలుగా
ఒక దేశం కోసం వెర్రి అన్వేషణలో
నేను భూగోళం మొత్తం గాలించాను
నా స్వదేశం అంచుకు చేరుతున్నాను
నేను ఆమె కోసం చేతులు చాచి ఎదురు చూస్తున్నాను
అయ్యో..!వారు చెప్పడం నేను విన్నాను
"నా దేశం ఎప్పుడైనా నన్ను తన ఆధీనంలోకి తీసుకుంటే
ఆమె అక్కడ నా సమాధిని నిర్మిస్తుంది"
[ఈ కవితలను బెంగాలీ నుంచి ఇంగ్లిష్ లోకి సుజల్ భట్టాచార్య అనువదించారు]